– ధారవి తరహాలో ముసురుకుంటున్న వైరస్
– బస్తీ దవాఖానాల్లో జ్వరం కేసులపై నిర్లక్ష్యం
– జియాగూడ, ఎన్‌టీఆర్ నగర్, భోలక్‌పూర్‌లో పెరుగుతున్న కేసులు
కరోనా(కోవిడ్-19)తో గ్రేటర్ హైదరాబాద్‌లోని మురికివాడలకు ముప్పు పొంచి ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలోని ధారవి కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్నది. సుమారు 14లక్షల జనాభా కల్గిన ఈ ప్రాంతంలో 1000కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50మందికి పైగా మృతిచెందారు. అలాంటి పరిస్థితే గ్రేటర్ హైదరాబాద్ మురికివాడల్లోనూ ఏర్పడే ప్రమాదముంది. ఇప్పటికే జియాగుడ, ఎన్‌టీఆర్ నగర్, భోలక్‌పూర్‌లో కరోనా విజృంభిస్తున్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ తగినన్ని చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు.
3వేలకుపైగా మురికివాడలు
గ్రేటర్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 3వేల మురికివాడలు ఉన్నాయని అంచనా. జీహెచ్‌ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం 1700 ఉన్నాయి. మిగిలిన 1300 అధికారుల లెక్కల్లో లేనివి. జియాగుడ డివిజన్‌లోనే 20బస్తీలు పక్కపక్కనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోనూ 20బస్తీలు ఉన్నాయి. భోలక్‌పూర్, అడ్డగుట్ట, ఎన్‌టీఆర్‌నగర్‌లో ఇరుకు గల్లీలు ఉన్నాయి. పాతబస్తీ, బంజారాహిల్స్ రోడ్డునెం.46 (అంబేద్కర్‌నగర్), బంజారాకాలనీ(హయత్‌నగర్) తదితర మురికివాడల పరిస్థితి అధ్వానంగా ఉన్నది.
జియాగూడలోనే 170కిపైగా కేసులు
జియాగూడలోనే 170కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20బస్తీలకుగాను ప్రతి బస్తీలోనూ వైరస్ పాకింది. ఎన్‌టీఆర్ నగర్‌లో 40కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతం వ్యవసాయ మార్కెట్ నుంచి మొదలుకుని కామినేని మెయిన్ రోడ్డు వరకు విస్తరించి ఉంది. దీంతో సామాజిక వ్యాప్తి ద్వారా మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. భోలక్‌పూర్‌లో 18 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలోనూ 20కిపైగా బస్తీలు ఉన్నాయి. ఇక్కడ తోళ్ల వ్యాపారమూ సమస్యగానే ఉంది. ఈ ప్రాంతాల్లో సరైన రీతిలో వైరస్ కట్టడి లేకపోవడంతోపాటు అనుమానితులకు పరీక్షలు చేయనందున వైరస్ పెరుగుతున్నది. పరీక్షల నిమిత్తం వస్తున్న వారికి సైతం చేయకుండా పంపించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
జ్వరం కేసులపై నిర్లక్ష్యం
జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారి విషయంలోనూ జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ మూడు లక్షణాల కల్గిన వారు మందుల కోసం వస్తే సమాచారమివ్వాలని మెడికల్ షాపులకు ఆదేశాలు జారీ చేసిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. బస్తీ దవాఖానాల్లో నమోదవుతున్న ఫీవర్, దగ్గు, జలుబు కేసులను ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 168 బస్తీ దావఖానాల్లో ఒక్కో దాంట్లో ప్రతిరోజూ 10-20 ఫీవర్, మరో 10-20 దగ్గు, జలుబు కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం.. ఫీవర్ 20, దగ్గు, జలుబు 20మంది చొప్పున 168 దావఖానాలకు 6,720 మంది వస్తున్నారు. వీరందరిని కరోనా అనుమానితులు గుర్తించి పరీక్షలు చేస్తే కేసులు బయటపడటంతోపాటు నియంత్రణకు అవకాశముంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.
చర్యలు నామమాత్రమే..
కరోనా కట్టడికి జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. మురికివాడల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడం లేదని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించడంలోనూ బల్దియా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలోనూ లోపాలున్నాయి. జియాగుడ ప్రాంతంలో రాత్రి 12గంటల నుంచి ఉదయం 3గంటల వరకు నీటి సరఫరా జరుగుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులెక్కడా..?
కరోనా నియంత్రణలో కేరళలోని పట్టణ స్థానిక సంస్థలు కీలకంగా పనిచేశాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతోనే కట్టడి చేయగలుగుతున్నారు. కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం ప్రజాప్రతినిధులు ఎక్కడా కనిపించడం లేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్ తప్ప కార్పొరేటర్లు, ఏరియా కమిటీ, వార్డు కమిటీల సభ్యులేమయ్యారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రజాప్రతినిధులు కదలాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది.
పేదలకు మాస్క్‌లు అందజేయాలి
ఎం.శ్రీనివాస్- సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ విఫలమయ్యాయి. బస్తీ దవాఖానాల్లో నమోదవుతున్న ఫీవర్, దగ్గు, జలుబు కేసులపై నిర్లక్ష్యమెందుకు? మురికివాడల్లోని పేదలకు ఉచితంగా మాస్కులు అందజేయాలి. మరో ఆరు నెలలపాటు ఆర్థిక సాయం చేయాలి.
Courtesy Nava Telangana