ఆలస్యం కాటేస్తోంది

0
300

 గాంధీ, ఉస్మానియాలకు పాముకాటు బాధితులు
ప్రతి నెలా 40-50 కేసుల వరకు నమోదు
ఎక్కువగా చుట్టు పక్కల జిల్లాల నుంచి రాక
చికిత్స అందించడంలో తీవ్ర జాప్యం

పాములు కాటేస్తే..

నాగు లేదా తాచుపాము, రక్తపింజరి, కట్లపాము, రాచనాగు వంటివి అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటు వేస్తే తప్పనిసరిగా యాంటీ వీనమ్‌ మందు ఇవ్వాల్సిందే.
పాము కాటు వేసినచోట రెండు గాట్లు పడి ఉంటే.. అది కచ్చితంగా విషపూరితమైనదని అర్థం. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి.
ఎవరైనా నాటు మందు వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారంటే అది విషపూరితమైన పాము కాదని అర్థం.

ఆధునికత ఎంతగా పెరుగుతున్నా.. రవాణా, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా ఇప్పటికీ పాము కాటు మృతుల సంఖ్య తగ్గడంలేదు. గత 18 రోజుల్లో ఒక్క ఉస్మానియాలోనే 19 మంది పాము కాటుతో చేరారు. గాంధీకి నెలకు 30 మంది వరకు బాధితులు వస్తున్నారు. వీరంతా ఎక్కువగా నగరం చుట్టు పక్కల జిల్లాల నుంచి రిఫరల్‌ కేసుల కింద ఇక్కడకు వస్తున్నారు. విషసర్పాలపై సరైన అవగాహన లేకపోవడం, వైద్య సిబ్బంది కొరత, విరుగుడు మందు కొరత వల్ల పాము కాటు బాధితుల్లో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో సరైన సౌకర్యాలు, వైద్య సిబ్బంది అందుబాటులో లేక నగరానికి వచ్చేలోపు విలువైన సమయం హరించుకుపోతోంది. చికిత్సకు తరలించే లోపు రోగికి వెంటిలేటర్‌ అవసరం ఎంతైనా ఉంది. చాలామందిని అది లేకుండా ఆసుపత్రులకు తీసుకుస్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలో పాముల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీకి నిత్యం 200 వరకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.

కాటేస్తే హైదరాబాద్‌కే.. 
బాధితుల్లో ఎక్కువమంది మంత్రగాళ్లు, నాటు వైద్యులనో లేదా ఆర్‌ఎంపీలనో ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాతే పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు వెళ్తున్నారు. అప్పటికే కొంత జాప్యం జరుగుతోంది. రాత్రి వేళల్లో పీహెచ్‌సీల్లో వైద్యులే ఉండటం లేదు. సిబ్బంది హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీలకు రిఫర్‌ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో పాటుకాటు విరుగుడు మందు (యాంటీ వీనమ్‌) అందుబాటులో ఉంచాలి. చాలాచోట్ల ఫ్రిజ్‌లు ఇతర సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. కొన్నిసార్లు విష సర్పం కాటేయకున్నా విషానికి విరుగుడు అందిస్తుండం వల్ల పరిస్థితి విషమిస్తోంది. వైద్య సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడమే దీనికి కారణం.

ఆందోళన వద్దు..
* పాము కాటేసిందంటే చాలామంది మొదట తీవ్రంగా భయపడిపోతారు. దీంతో రక్తపోటు పెరిగిపోయి మృత్యువాతకు దారితీస్తుంది.
* కాటేసిన పాము జాతిని గుర్తించడం అవసరమే కాని దానిని పట్టుకోడానికి లేదా చంపడానికి ప్రయత్నించడం వల్ల మరిన్ని కాట్లకు గురి కావచ్చు. చికిత్సకూ ఆలస్యమవుతుంది.
* బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. ఒత్తిడి చర్యల వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల విషం వేగంగా శరీర భాగాలకు చేరుతుంది.
* కాటేసిన వెంటనే వీలైతే 108 ఫోన్‌ చేయాలి. అందుబాటులో లేకపోతే పాముకాటుకు గురైన అవయవం నుంచి ఇతర భాగాలకు రక్త సరఫరా జరగకుండా కట్టు కట్టాలి.
* పాముకాటు బాధితుడికి తినేందుకు లేదా తాగేందుకు ఏమీ ఇవ్వకూడదు.
* వైద్యుని ఆధ్వర్యంలో మినహా ఉత్ప్రేరకాలు లేదా నొప్పి నివారణ మందులు అందించకూడదు.
* పాము కాటేసిన చోట ఎలాంటి కోత పెట్టకూడదు. అనుభవం లేనివారు నోటితో రక్తం పీల్చే పని చేయవద్దు.

ఒకే కుటుంబంలో ముగ్గురికి పాముకాటు-
భర్త మృతి.. భార్య, కుమారుడి పరిస్థితి విషమం కొమ్ములవంచ(నర్సింహులపేట) ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురిని పాము కాటేయడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్రచక్రుతండాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన జాటోతు రవి(45), భార్య నీల, కుమారులు చరణ్‌, సాయి, కుమారై శైలజ శుక్రవారం రాత్రి తమ ఇంట్లో మంచంపై నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 9 గంటలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో రవి, నీల, చరణ్‌లను పాము కాటు వేసింది. ఏదో కుట్టినట్లు అనిపించిందని చరణ్‌ వారికి చెప్పాడు. కరెంటు వచ్చిన తర్వాత వెలుగులో వారికి పాము కనిపించడంతో కర్రతో కొట్టి చంపేశారు. రాత్రి 10 గంటలకు కొమ్ములవంచ గ్రామంలో పాముకాటుకు మంత్రాలు వేసే వ్యక్తి వద్దకు వెళ్లారు. అప్పటికే రవి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబాబాద్‌లోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు నీల, చరణ్‌లను ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

 

(Courtacy Eenadu)

 

Leave a Reply