40ఏండ్లుగా సాగు చేస్తున్నాం..

0
23

ఇప్పుడు భూములు లాక్కుంటే ఎలా బతికేది
ప్లాంటేషన్‌ను అడ్డుకున్న దళితులు

వీర్నపల్లి : ’40 ఏండ్ల నుంచి ఇక్కడ భూములు సాగుచేసుకుని కుటుంబాలను పోషించుకుం టున్నాం.. ఇప్పుడు ఆ భూమి అటవీ శాఖదని అధికారులు వచ్చి మొక్కలు నాటడం సరికాదని’ దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని వదులుకునేది లేదని అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామ శివారులో ఆదివారం భారీ బందోబస్తు మధ్య మొక్కలు నాటేందుకు అధికారులు వచ్చారు. సుమారు 50మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బందితోపాటు ఐదుగురు ఎస్‌ఐలు, 50మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. దాంతో ఆ భూములను సాగుచేసుకుంటున్న దళిత, గిరిజన కుటుంబాలు అక్కడికి చేరుకుని ప్లాంటేషన్‌ను అడ్డుకున్నారు. తాము దళితబంధు అడగలేదనీ, భూములు కావాలని అన్నారు. భూములు ఇవ్వకపోగా 40ఏండ్ల నుంచి సాగుచేసుకుంటున్న భూమిని లాక్కోవడం దారుణమన్నారు. ఈ భూముల్లో 150 కుటుంబాలు, కుటుంబానికి కేవలం 20గుంటల చొప్పున భూమిలో సాగుచేసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికలప్పుడేమో దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి, మక్క పంట వేసిన పంట భూములు లాక్కోవటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న భూమిని లాక్కుంటే చావులు తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా భూమి పత్రాలు ఏమైనా ఉంటే చూపాలని ఎఫ్‌ఆర్‌వో వేణుగోపాల్‌, వేములవాడ, చందుర్తి సిఐలు బన్సీలాల్‌, శ్రీలత సూచించగా, నాలుగురోజులు సమయం కోరారు. దాంతో అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు.

Courtesy Nava Telangana

Leave a Reply