సర్వమానవాళికీ ఆయన పెరియార్

0
233

పెరియార్‌ సంక్షిప్త నామంతో సుపరిచితులైన ఈవి పెరియార్‌ రామసామి గురించి తెలుగు పాఠకులకు రేఖా మాత్రంగా తెలుసు. అయితే సమగ్రంగా తెలియదనే చెప్పాలి. 94ఏండ్ల జీవితకాలంలో ఆయన తన చివరి రోజు వరకూ నమ్మిన లక్ష్యం కోసం జ్ఞానం, పోరాటమనే దుడ్డు కర్రలు పట్టుకుని పీడిత ప్రజలకు కాపలాగా ఉన్నాడు. పెరియార్‌ తమిళనాడులో (అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ) 1879 సెప్టెంబర్‌ 17న జన్మించాడు. అంటే పెరియార్‌ వయస్సులో గాంధీ కంటే పదేండ్లు చిన్న, అంబేద్కర్‌ కంటే 12ఏండ్లు పెద్ద. ఇద్దరితోను పెరియార్‌కి సాంగత్యం ఉంది. గాంధీతో మౌలికంగానే విభేదించే పెరియార్‌ సామాజిక దక్పథం అంబేద్కర్‌తో సారూప్యత కలిగి ఉంటుంది. అయితే ఇద్దరి కార్యరంగాలు, వాటి వైశాల్యం వేరు. బాల్యంలో చదువుపై ఆసక్తి చూపక అతికష్టం మీద నాల్గవ తరగతి వరకు మాత్రమే చదివిన పెరియార్‌ అనంతర కాలంలో తమిళంలో, ఇంగ్లీషులో అనేక పత్రికలు నడిపారు.

పెరియార్‌ చేసిన ప్రసంగాలు, వ్యాసాలతో ఇప్పటికి తమిళంలో 6,500పేజీలతో కూడిన 15పెద్ద సంపుటాలు వెలువడ్డాయి. ఇంగ్లీష్‌లోనూ పుస్తకాలు రాశారు. తాను తన జీవితకాలంలో 10,700 సభలు, సమావేశాల్లో ప్రసంగించారు. ఆయన ఇచ్చిన ప్రసంగాలను రికార్డ్‌ చేసి నిరాఘాటంగా వినిపించినట్టయితే రెండు సంవత్సరాల ఐదు నెలల 11 రోజులు పడుతుందని అంచనా. పెరియార్‌పై బాల్యంలోనే ఈరోడ్‌ ప్రాంతంలో గల హేతువాద ప్రచారకుల ప్రభావం పడింది. ఆ చిన్న విత్తనాలు పెరియార్‌లో వటవక్షాలై విశ్వవ్యాప్తమయ్యాయి. పెరియార్‌ తన బాల్యంలో తల్లిదండ్రుల చాదస్తాన్ని కాదని ”తక్కువ కులం” అనబడే వాళ్ళతోనే స్వేచ్ఛగా కలిసి తిరిగేవాడు. అందుకు శిక్షగా పదిహేను రోజులు ఇంట్లో గొలుసులతో కట్టివేయబడ్డా చేతులకు గొలుసులు ఉంచుకుని కూడా తిరిగి అదే పనిచేశాడు. నచ్చినపనే చేయటం, తెగింపు, దిక్కారం, రాజీలేనితనం పెరియార్‌ జీవిత మంతా కనిపిస్తుంది. పెరియార్‌ది విలక్షణమైన, సాహసోపేతమైన పీడిత ప్రజలకే అంకితమైన జీవితం. తన సుదీర్ఘ పోరాట జీవితంలో అతను ఏదైనా సరైంది అని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా రాజీపడలేదు. పట్టు విడుపులు చూపింది కూడా తక్కువ. తన జీవితకాలంలో నమ్మిన ఆశయాల కోసం ఆస్తిని, అధికారాలను వదిలేస్తూ వచ్చాడు. రాజకీయంగా తన భావజాల ప్రతినిధులకు మద్దతు ఇచ్చాడు కానీ తాను స్వయంగా అధికార పీఠాల విషవలయంలోకి వెళ్ళలేదు. పెరియార్‌ లెక్కలేనన్ని సార్లు జైలుకు వెళ్ళారు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాతా దాదాపు సమాన సంఖ్యలో జైలుకు వెళ్ళిన ఏకైక వ్యక్తి బహుశా పెరియార్‌ ఒక్కరే.

రామస్వామి ఆరెండ్లపాటు జాతీయోద్యమంలో రాష్ట్ర నాయకునిగా ఉన్నా ఆయన సామాజిక దక్పథానికి కాంగ్రెసులోని బ్రాహ్మణాధిపత్యానికీ పొసగలేదు. కాంగ్రెసు నాయకత్వాన్ని మీరు బ్రిటిష్‌ వాళ్ళనుంచి స్వాతంత్రం కావాలని అడుగుతున్నారు సరే మీరు బ్రాహ్మణేతరులకు, పీడిత కులాలకు స్వాతంత్య్రం ఎప్పుడిస్తారని నిలదీశాడు. 1925లో అప్పటికే వరుసగా మూడేండ్లు రాష్ట్ర మహాసభల్లో బ్రాహ్మణేతరులకు చట్టసభల్లో రిజర్వేషన్‌ ఉండాలనే ప్రతిపాదన పెట్టినా వారు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్ష హౌదాను, సభ్యత్వాన్ని తృణప్రాయంగా వదిలేశారు. 1927లోనే పెరియార్‌ గాంధీతో జరిగిన సంభాషణలో బ్రాహ్మణజాతి హిందూ మతంలో మార్పుల్ని ప్రవేశపెట్టే ఏ మహాత్ముడినీ బతక నివ్వలేదని, మిమ్మల్ని కూడా వాళ్ళు భరించరని హెచ్చరించాడు. కాంగ్రెసును వదిలేశాక పెరియార్‌ దేవుడు, మతం, బ్రాహ్మణాధిపత్యం, కులవివక్ష, జెండర్‌ వివక్షలకు వ్యతిరేకంగా, ఆర్థిక దోపిడీ, ప్రాంతీయ, భాషా, సాంస్కతిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా తన పూర్తికాలాన్ని వినియోగించారు. దయ్యాలు ఎంత కల్పితమో దేవుడూ అంతే కల్పితమన్నాడు. హిందూ మతం కేవలం బ్రాహ్మణాధిపత్యం కోసమే ఏర్పడిందన్నారు. ఏ మతమైనా ప్రజలను అణచి ఉంచే సాధనమే అన్నాడు. కుల వివక్ష కాదు కుల వ్యవస్థనే పోవాలన్నాడు. దళితులకు, ఇతర వెనుక బడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో సమాన ప్రాతనిధ్యం ఉండాలన్నాడు. రిజర్వేషన్లకై అతను చేసిన పోరాటం మొట్ట మొదటి రాజ్యాంగ సవరణకు దారితీసింది. దేవదాసీ వ్యవస్థ, పాలుదాగే పసిపిల్లలకు పెళ్లిళ్లు చేయటం, చిన్న వయసులో భర్తల్ని కోల్పోయినా పునర్వివాహం చేయక పోవటం స్త్రీజాతిని బానిసలుగా చేసిన సాంప్రదాయాలు అన్నాడు. అసలు స్త్రీలు మాత్రమే పిల్లల్ని కనే పరిస్థితే మానవ నాగరికతలో వారు స్వేచ్ఛను కోల్పోవడానికి కారణం అన్నాడు. కాబట్టి పిల్లల్ని కనకపోవటం, లేదా ఒకరిద్దర్ని మించి కనక పోవటం జరిగితేనే స్త్రీలకు కొంతైనా స్వేచ్ఛ దొరుకుతుందన్నాడు. స్త్రీలకు చదువుకునే హక్కు, ఆస్తి హక్కు, సంపాదించుకునే స్వేచ్ఛ ఉండాలన్నాడు. మనుషులందరికీ స్వాభి మానమే అన్ని అవసరాల కంటే కీలకమైనది అన్నాడు. వారి ఆలోచనలు, వాటి సృజన శీలత నుంచి పాఠాలు నేర్చుకోవటం అన్ని కాలాల, అన్ని రకాల పీడిత ప్రజలకు నిరంతరావసరం.

పెరియార్‌ భావజాలానికి తమిళనాడులో తిరుగులేని గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగానూ ఈ విషయంలో తగిన గుర్తింపు వచ్చింది. కానీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పెరియార్‌ పోరాటాలు, వారి భావజాలం ప్రజల్లోకి వెళ్లాల్సినంతగా వెళ్ళలేదు. సమాజంలో మత తత్వ రాజకీయాలు, మతోన్మాదం, కులోన్మాదం పెరిగిన నేటి పరిస్థితులలో పెరియార్‌ లాంటి నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయవలసి ఉన్నది. పీడిత ప్రజల విముక్తికి వారి చైతన్యమే మొట్ట మొదటి ఆయుధం. ఆ చైతన్యాన్ని భారతీయ ప్రజలు పెరియార్‌ చేసిన పోరాటాల నుంచి అనంతంగా పొందవచ్చు.

– డాక్టర్‌ ఎస్‌ తిరుపతయ్య
సెల్‌: 9849228212

Leave a Reply