గీతాంజలి ఇక లేరు

0
252
గీతాంజలి ఇక లేరు
హైదరాబాద్‌: బాల నటిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి.. ‘సీతారామకల్యాణం’ సినిమాలో సీత పాత్రలో ఒదిగి.. ప్రేక్షకుల మన్ననలు పొందిన అలనాటి అందాల నటి గీతాంజలి (72) కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని నివాసంలో బుధవారం అర్ధరాత్రి ఆమె గుండెపోటుకు గురయ్యారు. అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేశారు. ఆపై గీతాంజలి పేరుతో కథానాయికగా, క్యారెక్టర్‌ ఆర్టి్‌స్టగా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో 500పైగా చిత్రాల్లో తనదైన శైలి నటనతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్‌ నిర్మించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో సీతగా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. మహిళా ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. ఏఎన్నార్‌-గీతాంజలి, కృష్ణ-గీతాంజలి ఆ రోజుల్లో హిట్‌ పెయిర్‌. హీరో, నటుడు రామకృష్ణతో ఎన్నో చిత్రాల్లో నటించి ఆయననే వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్కరే కుమారుడు శ్రీనివాస్‌. పెళ్లైన తర్వాత భర్తకు ఇచ్చిన మాటకు కట్టుబడి గీతాంజలి 18 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. చిత్రంగా.. 2006లో విడుదలైన ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. టీవీ సీరియళ్లలో బామ్మ పాత్రలతో మెప్పించారు. అభిమానుల సందర్శనార్థం గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గీతాంజలి భౌతికకాయాన్ని ఫిల్మ్‌ చాంబర్‌లో ఉంచారు. సాయంత్రం 5 గంటలకు రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Courtesy Andhra Jyothy..

Leave a Reply