ఊరూరా కొనుగోలు కేంద్రాలు

0
156
  • 3, 4 రోజుల్లో ధాన్యం కొంటాం.. తక్కువకు అమ్ముకోవద్దు.. ఎమ్మెస్పీ చెల్లిస్తాం
  • భారంపై అధ్యయనానికి సీఎస్‌ నేతృత్వంలో కమిటీ
  • పీయూష్‌ గోయల్‌కు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా!?
  • కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలోనే దోషిగా నిలబెట్టాం
  • హైదరాబాద్‌ గడ్డపై సమగ్ర వ్యవసాయ విధానం
  • కేంద్రం దానిని అడాప్ట్‌ చేసుకోకపోతే దించేస్తారు
  • త్వరలోనే బీజేపీ పాపాలపుట్టను బయటపెడతా
  • మోసగాళ్లకు రూ.5 లక్షల కోట్లు మాఫీ చేశారు
  • రైతులకు రూ.3500 కోట్లు ఖర్చు చేయలేరా!?
  • రాష్ట్రాలు చిప్ప పట్టుకోవాలన్నది బీజేపీ విధానం
  • చరిత్రలో హిట్లర్లు, ముస్సోలినీలే పోయారు
  • వీళ్లు అంతకన్నా గొప్పవాళ్లు కాదు: సీఎం కేసీఆర్‌

ఈ యాసంగిలో పండే ప్రతి వడ్ల గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కనీస మద్దతు ధర రూ.1,960కే కొంటాం. దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించినంత మాత్రాన తగ్గేదే లేదు. రూ.2000-3000 కోట్లు ఖర్చయినా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించాం. మా రైతులను గంగలో వదిలేయం. ఎట్లైనా కాపాడుకుంటాం. మీకు తెలివి లేదు. మాకు తెలివి ఉంది. ధైర్యం ఉంది. సర్వశక్తులు ధారపోసి దేశానికి సరికొత్త సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొస్తా.
– ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌ : ‘‘రెండు మూడు రోజుల్లో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ యాసంగిలో పండే ప్రతి వడ్ల గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మూడు నాలుగు రోజుల్లో ధాన్యం అంతా కొంటాం. రైతులను కోరేదొక్కటే.. ఒక్క గింజను కూడా తక్కువ ధరకు అమ్మొద్దు. కనీస మద్దతు ధర రూ.1,960కే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. నిధులన్నీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ధాన్యం కొనుగోలుకు బుధవారం నుంచే యుద్ధ ప్రాతిపదికన కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని కలెక్టర్లకు సూచించామన్నారు. సంబంధిత ఏర్పాట్లను పౌర సరఫరాల శాఖ చూసుకుంటుందన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ అనంతరం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వడ్ల కొనుగోలుతో పడే భారం ఎంత!? ప్రభుత్వం భరించేది ఎంత వంటి అంశాలపైౖ అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నలుగురు అధికారులతో కమిటీని వేస్తున్నామని చెప్పారు. కమిటీలో ఆర్థిక, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతోపాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఉంటారన్నారు. తక్కువ నష్టంతో ధాన్యం కొని అమ్మడమే లక్ష్యమన్నారు. దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించినంత మాత్రాన చిన్నబుచ్చుకునేది లేదని, రూ.2000-3000 కోట్లు ఖర్చయినా రైతాంగాన్ని చిన్నబుచ్చొద్దనే ఉద్దేశంతో కొనుగోళ్లు జరపాలని నిర్ణయించామని తెలిపారు.

కేంద్రం దుర్మార్గాన్ని బయటపెట్టాం
‘‘కేంద్ర ప్రభుత్వ దుర్మార్గం బహుముఖీనంగా ఉంది. దుర్మార్గమైన రైతు వ్యతిరేక విధానం అవలంభిస్తోంది. దానిని బయటపెట్టినం. మీరు ఇయ్యనంత మాత్రాన మా రైతులను గంగలో వదిలేయం. ఎట్లానైనా కాపాడుకుంటాం. మీకెట్లా తెలివి లేదు. మాకు తెలివి ఉంది. ధైర్యం ఉంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రంలో వెధవ, పనికిమాలిన ప్రభుత్వం ఉందని, వరి వేయవద్దని, ఇతర పంటలు వేసుకోవాలని రైతులకు చెప్పామని, దాంతో, 20 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని కేసీఆర్‌ చెప్పారు. అప్పట్లో వరి వేయాలని, కేంద్రమే ధాన్యాన్ని కొంటుందని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రైతులను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు అసలు మెదడు, బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? అని కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘నూకలు తినడం అలవాటు చేయండి మీ రాష్ట్రానికి అంటడా? ఎంత గర్వం. ఎంత అహంకారం. అద్భుతమైన పంట పండించి దేశానికి అన్నం పెట్టే తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అంటారా? వాళ్లకే తెలివి ఎక్కువగా.. ఇతరులకు తక్కువ ఉందని అనుకుంటారు. భారీ పంట దిగుబడులను చూసి తెలంగాణలో ఏమి మేజిక్‌ (చమత్కార్‌) జరిగింది? అన్నారు. యాసంగిలో రాష్ట్రంలో 36 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే.. ఏ రాష్ట్రంలోనూ అందులో సగం కూడా సాగు కాలేదు. అదే తెలంగాణ మేజిక్‌. ఇది అర్థం కాక.. తెలివి లేక మేజిక్‌ ఏమిటని అడుగుతున్నారు. చెప్పొచ్చు కదా మాకు చేతకాదు దద్దమ్మలమని. మతం పేరు మీద… మన్ను పేరు మీద గెలిచి అధికారం చేస్తున్నమని. ఇది మాకు చేతకాదు అని చెప్పొచ్చు కదా’’ అని ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలో వేయనంత పంట వేశామని, అందుకే సమస్య ఇక్కడ వస్తోందని చెప్పారు. యాసంగి వడ్లను మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎక్కువ వస్తాయని, దేశ ఆహార భద్రతను కాపాడడానికి ఐదు వేల కోట్లయినా.. పది వేల కోట్లయినా కేంద్రమే దానిని భరించాలని డిమాండ్‌ చేశారు. దానిని రాష్ట్రాలను భరించమంటే ఎలా అని ప్రశ్నించారు.

ఇంత పెద్ద దేశాన్ని పాలించే ప్రభుత్వ నీతి ఇదేనా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయడం తమ కర్తవ్యమని, అందుకే ఢిల్లీకిపోయి ఎక్స్‌పోజ్‌ చేశామని తెలిపారు. ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టామన్నారు. ప్రధాన మంత్రికి మనసు లేదన్నారు.

సర్వశక్తులు ధారపోసి వ్యవసాయ విధానం తెస్తా
దేశానికి సరికొత్త సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతు ప్రతినిధులు, రైతు సంఘాల నేతలను హైదరాబాద్‌కు పిలిపించి, ఇక్కడే దానిని ప్రకటిస్తామన్నారు. ‘‘ఇందుకు చాలామంది ఆర్థిక వేత్తలను పిలుస్తున్నా. అశోక్‌ గులాటి, రైతు నాయకులు వస్తామన్నారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల రైతు ప్రతినిధులు, ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి వర్క్‌షాప్‌ పెట్టి, ఆ పాలసీని ఇక్కడ డిక్లేర్‌ చేస్తాం. భారత ప్రభుత్వం దాని ఖర్మ బాగుంటే ఆ పాలసీని అడాప్ట్‌ చేసుకుంటుంది. లేకపోతే, రైతాంగం దానిని గిల్లి పడేసి, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటుంది. అప్పుడు కళకళలాడే భారత దేశం ఉంటది. ఇలా వెలవెలబోయే భారతదేశం ఉండదు.అందుకు భగవంతుడు నాకిచ్చిన సర్వశక్తులను ధారపోసి ప్రయత్నం చేస్తా’’ అని వివరించారు.

త్వరలోనే బీజేపీ బండారం బయటపెడతాం
‘‘పెద్ద పెద్ద ఘరానా.. డెకాయిటీగాళ్లు వేల కోట్లు ముంచుతుండ్రు. వాళ్లను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమే. దేశంలో అత్యధికంగా సాధించిన ప్రగతి బ్యాంకులను దివాలా తీయించడమే. బ్యాంకులను ముంచినోళ్లు లండన్‌లో సురక్షితంగా ఉన్నారు. వాళ్లను అరెస్ట్‌ చేయడానికి వెళితే ఇదే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫోన్‌ చేసి వెనక్కి పిలిపించారు. ఆ డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయి. త్వరలోనే ఢిల్లీలోనే వారి పాపాల పుట్ట బయటపెడతాం’’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

షావుకారులు, సేట్లు, బడా బడా కంపెనీలు, బ్యాంకుల్లో మోసాలు చేసినోళ్లకు ఇప్పటి వరకూ రూ.10.50 లక్షల కోట్లు మాఫీ చేశారని, ఓ దొంగ రూ.21 వేల కోట్లు, మరో దొంగ 18 వేల కోట్లు మోసం చేశారని, ఆదానీ గ్రూపునకు రూ.12 వేల కోట్లు మాఫీ చేశారని, కానీ, 60 లక్షల మంది రైతులకు సంబంధించిన యాసంగి ధాన్యం కొనుగోలుకు రూ.3500 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం సిద్ధంగా లేదని తప్పుబట్టారు. ‘‘బీజేపీ ప్రభుత్వం దాని సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని పెట్రేగించే ప్రయత్నం చేస్తోంది. అన్ని రకాలుగా దేశాన్ని దెబ్బతీసిండ్రు. జీడీపీ మొత్తం నాశనమైపోయింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. నిత్యావసర ధరలు పెంచుతోంది. సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. అహంకారం తలకెక్కింది.

ఏదైనా సమస్య రాగానే కశ్మీరీ ఫైల్స్‌, పుల్వామా అంటూ మత గజ్జి రేపుతోంది. షార్ట్‌ కట్‌ మెథడ్‌లో ప్రజలను అప్పటికప్పుడు ఉద్వేగపరుస్తోంది. 10 ఓట్లు సంపాదించుకోవడం జరుగుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌, కర్ణాటకల్లో రాళ్లేస్తారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ డ్రామా. రాళ్లేసుడు.. ఉద్రిక్తతలు సృష్టించుడు. దేశాన్ని సర్వ భ్రష్టం చేస్తోంది’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం కబళిస్తోందన్నారు.

భారతీయులను ఇతర దేశాలు వెళ్లగొడితే..?
‘‘బెంగళూరు అద్భుత నగరం. అనేక ప్రభుత్వాల కృషి ఫలితంగా సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా అయింది. 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలుంటాయి. మరో 30 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతయి. అంత అద్భుతమైన రాష్ట్రంలో ఆరు రకాల నిషేధాలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హిజాబ్‌, హలాల్‌ మాంస నిషేధం, ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కొద్దు, ముస్లిం షాపుల్లో కొనొద్దు.. ఇంకా ఏవేవో దిక్కుమాలిన, పనికిమాలిన నిషేధాలు పెట్టింది. దీని పర్యవసానం ఏమిటి!? 13 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో బతుకుతున్నరు. ప్రపంచం వారందరినీ తరిమేస్తే? బీజేపీ పోషిస్తుందా? వాళ్లకు ఇండియాలో ఉద్యోగాలిస్తారా?’’ అని ప్రశ్నించారు.

‘‘అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు. హిట్లర్లు, ముస్సోలినీలు, నెపోలియన్లే పోయారు చరిత్రలో. వీళ్లు అంతకన్నా గొప్పోళ్లు కాదు. ఈ విషయంలో దేశాన్ని, దక్షిణ భారత దేశాన్ని చైతన్యపరచడానికి నేను ప్రముఖ పాత్ర వహిస్తాను’’ అని వివరించారు.

పెట్రో ధరలు రాష్ట్రాలు తగ్గించాలట.. వాళ్లు పెంచుతారట
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యాట్‌ను పెంచలేదని, తగ్గించలేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘2015లో రౌండ్‌ ఫిగర్‌ చేసినం. 60 పైసలు, 30 పైసలు ఉంటే రూపాయి చేసినం. అది కూడా కలెక్షన్‌ ఈజీగా ఉంటదని. కానీ, రాష్ట్రాలు పన్నులు తగ్గించాలంటూ నువ్వెందుకు పెంచుతున్నవ్‌. నీవు పెంచాలి. మేం తగ్గించాలా? నీ జేబు నిండాలి. నా జేబు ఖాళీ కావాల్నా? పెట్రోలు, డీజిల్‌ తక్కువ ధరకే అందించాలంటే నీవు పెంచొద్దు కదా. నీవు పెంచి.. రాష్ట్రాన్ని తగ్గించమని ఏ నోటితో అంటవు? నీది నోరా.. మోరా? వాట్‌ ఈజ్‌ దిస్‌?’’ అంటూ మండిపడ్డారు.

Leave a Reply