బాబ్రీ స్థలాన్ని వదిలేస్తాం!

0
314

 • కానీ.. మావి 3 షరతులు.. సున్నీ బోర్డు సంచలన ప్రతిపాదన
 • మధ్యవర్తిత్వ బృందం ప్రతిపాదనలు
 • నేడు సుప్రీం న్యాయమూర్తుల పరిశీలన
 • అయోధ్య కేసులో ముగిసిన వాదనలు
 • చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా
 • మ్యాప్‌ చించేసిన ముస్లింల న్యాయవాది
 • చించుకో’ అంటూ చీఫ్‌ జస్టిస్‌ వ్యాఖ్య
 • వాకౌట్‌ చేస్తామంటూ హెచ్చరిక మావి 3 షరతులు.
 1. దేశంలోని మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలి. కబ్జాలు, విధ్వంసాలు జరగకుండా చట్టబద్ధ రక్షణనివ్వాలి. ఈ మేరకు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి.
 2. దేశంలో పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధీనంలో ఉన్న మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతినివ్వాలి.
 3. బాబ్రీకి ప్రతిగా అయోధ్యలోనే వేరే చోట ఓపెద్ద మసీదును కట్టుకునేందుకు అనుమతినివ్వాలి. అయోధ్యలో 22 పాత మసీదుల మరమ్మతులకు సహకరించాలి.

న్యూఢిల్లీ, అక్టోబరు 16: అయోధ్య వివాదం ఓ అనూహ్యమైన మలుపు తీసుకుంది. వివాదాస్పద స్థలంపై తమకు గల హక్కును వదులుకోడానికి ప్రధాన కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్‌ బోర్డు సంసిద్ధత ప్రకటించింది. కానీ ఇందుకు కొన్ని షరతులు విధించింది. ఈ మేరకు వాదనలకు చివరిరోజైన బుధవారంనాడు మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా తన ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ కమిటీ రూపొందించిన ఓ పరిష్కార ప్రణాళికకు తన ఆమోదాన్ని తెలియపరిచింది. దీంతో దశాబ్దాలుగా సాగుతున్న రామజన్మభూమి వివాదం సామరస్య పూర్వకంగా కోర్టు వెలుపలే పరిష్కారం కావొచ్చన్న ఓ ఆశారేఖ ఈ తాజా పరిణామంతో ఉదయించింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… సున్నీ వక్ఫ్‌ బోర్డు అంగీకరించిన ప్రతిపాదనను చేరుస్తూ ఓ పరిష్కార ప్రణాళికను మధ్యవర్తిత్వ బృందం కోర్టుకు సమర్పించింది. ఈ ప్రణాళికపై సున్నీ బోర్డుతో పాటు కొన్ని హిందూ పక్షాలు కూడా సంతకం చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కేసుపై విచారణ జరుపుతున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ సెటిల్మెంట్‌ ప్రణాళికను పరిశీలిస్తుంది. కేసు ను విచారించిన చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఛాంబర్లలోనే గురువారం సమావేశమవుతుందని సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించింది. మాజీ జడ్జి జస్టిస్‌ ఖలీఫుల్లా నేతృత్వంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు, గురు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచులతో కూడిన ముగ్గురు-సభ్యుల మధ్యవర్తిత్వ బృందాన్ని సుప్రీంకోర్టే గతంలో నియమించింది.

ఈ ఏడాది మార్చి 8 నుంచి 155 రోజుల పాటు ఫైజాబాద్‌లో ఈ బృందం ప్రధాన కక్షిదారులతో పలు ధఫాలు చర్చించినా ప్రయోజనం లేకపోవడంతో మధ్యవర్తిత్వ యత్నం విఫలమైనట్లేనని ఆగస్టు 2న సుప్రీం ప్రకటించింది. కానీ సెప్టెంబరులో మళ్లీ ఈ బృందం ఓ అఫిడవిట్‌ వేసింది. సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖాడా సహా కొన్ని పక్షాలు మధ్యవర్తిత్వానికి ఇపుడు సంసిద్ధంగా ఉన్నాయని సెప్టెంబరు 16న పేర్కొంది. అయితే దీనికి ఉత్తర్వు రూపేణా సుప్రీం ఎలాంటి అనుమతీ ఇవ్వలేదు, తమ విచారణ ఆగబోదని రాజ్యాంగ ధర్మాసనం ఆనాడు స్పష్టం చేసింది.

సున్నీల షరతులివే…

 • దేశంలోని మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలి. కబ్జాలు, ఆక్రమణలు, విధ్వంసాలు జరగకుండా చట్టబద్ధ రక్షణనివ్వాలి.
 • ఈ మేరకు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి
 • దేశంలో పురావస్తు శాఖ (ఏఎ్‌సఐ) అధీనంలో ఉన్న మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతివ్వాలి
 • అయోధ్యలో శిధిలావస్థకు చేరిన 22 మసీదుల మరమ్మతుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సహకరించాలి
 • బాబ్రీను నేలమట్టం చేసినందుకు ప్ర తిగా ఓ పెద్ద మసీదును అయోధ్యలోనే వేరేచోట కట్టుకునేందుకు అనుమతించాలి.

రామజన్మభూమి న్యాస్‌ నో..! : కానీ ఈ షరతులను ప్రధాన కక్షిదారుల్లో ఒకటైన రామజన్మభూమి న్యాస్‌ తిరస్కరించినట్లు సమాచారం. ముఖ్యంగా మొదటి రెండు షరతులు- ఈ కేసు పరిధిలోకి రావని గతంలోనే న్యాస్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పుడూ తమ వైఖరి మారబోదని ఆ వర్గాలు తెలిపాయి. అయితే షరతుల తిరస్కారానికి వేరే కారణాలున్నాయని విశ్లేషకులంటున్నారు. ‘మిగిలిన మసీదుల ఆక్రమణ జరగరాదని, వాటిని పరిరక్షించాలని కోరడమంటే మథుర, వారాణసీలపై తమ ఉద్యమ దృష్టిని హిందూత్వ శక్తులు వదులుకోవాలన్నదే!’’ అని వివరిస్తున్నారు. ఈ షరతులను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా అన్న విషయంపైనా భిన్నాభిప్రాయాలున్నాయి.

సున్నీలకు ఉన్న హక్కు ఎంత? : 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని 3ప్రధాన పక్షాలు అంటే రామచంద్రప్రభువు (దేవుడు-విగ్రహమూర్తి), నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్‌ బోర్డులకు సమానంగా పంచాలి. ప్రధాన గుమ్మటం కింద ఉన్న ప్రదేశం దేవుడికే కేటాయించాలి. ఈ తీర్పును కేసులోని కక్షిదారులం తా సవాల్‌ చేశారు.

Courtesy Andhrajyothi…

Leave a Reply