- పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి
- సమగ్ర వివరాలతో నివేదిక కోరిన బెంచి
హైదరాబాద్ : పరువు హత్యలపై పోలీసులు సమగ్ర వివరాలు సేకరించడం లేదని హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017 నుంచి 2021 వరకు 4 పరువు హత్యలు, 3 దాడులు మాత్రమే జరిగాయని, మొత్తంగా 50 కులపెద్దల పంచాయితీలు జరిగినట్లుగా పేర్కొంటూ పోలీసు శాఖ సమర్పించిన అదనపు అఫిడవిట్‌పై విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర అదనపు డీజీపీ రాజీవ్ రతన్ అఫిడవిట్ సమర్పించారు. 50 కులపెద్దల పంచాయితీలు జరిగినట్లు పేర్కొంటే 7 ఘటనలు మాత్రమే చోటుచేసుకున్నట్లు చెప్పడం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకుంటే తాము సహించబోమని ధర్మాసనం హెచ్చరించింది. శక్తివాహిని కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం దర్యాప్తు చేయాలని, ఇందుకోసం తాజాగా మరో సర్క్యులర్ జారీచేసి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈమేరకు హైకోర్టు సీజే హిమాకోహ్లీ, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. పరువు హత్యలపై పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగడం లేదంటూ… హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త యు. సాంబశివరావు గతంలో హైకోర్టులో పిల్ వేశారు. ఇటీవలకాలంలో తెలంగాణలో 36 పరువు హత్యలు జరిగియన్నారు. శక్తివాహిని కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుచ తప్పకుండా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ తెలిపారు.
Courtesy Andhrajyothi