చరిత్ర నిర్మాతలు, నడుస్తున్న చరిత్ర

0
223
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)

కరోనా మహమ్మారి విజృంభణతో మన ఆర్థిక, సామాజిక రంగాలు అతలాకుతలమై పోతున్నాయి. దేశ విభజన అనంతరం మనం ఎదుర్కొంటున్న భీకర సంక్షోభమిది. జాతి హితవరుల మాట వినే ప్రభుత్వమూ, పాఠాలు నేర్చుకునేందుకు చరిత్రను వినే ప్రభుత్వమూ ఇప్పుడు మనకు కావాలి. ఆ సర్కారు ఒక పార్టీ లేదా ఒకే మతం, మరీ ముఖ్యంగా ఏకైక నాయకుని ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేదిగా ఉండకూడదు. జాతి శ్రేయస్సును అవిభాజ్యంగా భావించేదై ఉండాలి. అటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు పొందుతాం, అసలు పొందుతామా లేదా అన్న దానిపైనే మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది.

విధాన నిర్ణయాలు తీసుకోవడంలో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరపడం ప్రజాస్వామ్య పాలకుల లక్షణం. అటువంటి ఉత్తమ మార్గాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తిచేస్తూ సరిగ్గా ఏడాది క్రితం (2020 ఏప్రిల్) న్యూఢిల్లీ కేంద్రంగా వెలువడే ఒక జాతీయ దినపత్రికలో నేనొక వ్యాసం రాశాను. ‘కరోనా కార్చిచ్చు నేపథ్యంలో దేశం తీవ్ర సవాళ్ల నెదుర్కొంటోంది. దేశ విభజన అనంతరం మనం ఎన్నడూ చూడని సంక్షోభమిది.

మహమ్మారి మూలంగా కోట్లాదిమంది ప్రజలు ఇప్పటికే తీవ్ర యాతనలు, సమస్యలను చవిచూస్తున్నారు. అవి మరింతగా పెరిగేవే కాని తగ్గేవి కావు. ఇటువంటి విషమ పరిస్థితుల్లో సామాజిక విశ్వాసాన్ని పునరుద్ధరించడం, ఆర్థికవ్యవస్థ పునర్నిర్మాణం ఒక వ్యక్తి, అతనికి విశ్వాసపాత్రులయిన కొద్దిమంది సలహాదారుల శక్తి సామర్థ్యాలకు మించిన పని’ అని నేను ఆ వ్యాసంలో స్పష్టం చేశాను. సవాళ్లను అధిగమించేందుకు కొన్ని సిఫారసులు కూడా చేశాను. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ, సంక్షోభాల నిర్వహణలో అపార అనుభవమున్న మాజీ ఆర్థికమంత్రులను ప్రధానమంత్రి సంప్రదించి తీరాలి. ఆర్థికశాఖ మాజీ కార్యదర్శులు, ఆర్బీఐ మాజీ గవర్నర్ల సలహాలను కూడా తీసుకోవాలి. నార్త్‌బ్లాక్ (ఆర్థికమంత్రిత్వ శాఖ నెలవు)లోని ప్రస్తుత ఆర్థికవేత్తల కంటే రైతుల, రైతుకూలీల సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న మాజీ ఆర్థికవేత్తలతో కూడా ప్రభుత్వం సమాలోచనలు జరపాలి. వైద్యనిపుణుల సహాయసహకారాలతో ఎయిడ్స్ సంక్షోభాన్ని అదుపు చేసిన, పోలియోను నిర్మూలించిన ఆరోగ్యమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శులను కూడా కరోనాపై యుద్ధంలో భాగస్వాములను చేసుకోవాల’ని సూచించాను.

అనుభవం ప్రాతిపదికన కాకుండా, ఒక ఆశాభావంతోనే నేనలా రాశాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే నిపుణుల అభిప్రాయాల పట్ల తన తిరస్కార వైఖరిని స్పష్టంగా వ్యక్తం చేశారు. తనకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంటే హార్డ్‌వర్క్ (కష్టపడి పనిచేయడం)లోనే నమ్మకముందని వ్యాఖ్యానించడం ద్వారా నిపుణుల పట్ల తన ధిక్కారాన్ని ఆయన సైద్ధాంతికంగా వ్యక్తం చేశారు. ఇక ఆచరణాత్మకంగా ఎలా చూపారన్న దానికి నోట్లరద్దు లాంటి వినాశక ఆర్థికప్రయోగాలే తార్కాణం. తనకు సలహాదారులుగా ఉన్న ఆర్థికవేత్తల హెచ్చరికలను సైతం ఖాతరు చేయకుండా నోట్లరద్దు నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకుల పట్ల అడ్డు అదుపూలేని శతృత్వవైఖరిని చూపడమే మోదీ నైజంగా కన్పిస్తోంది. విపక్షనేతల పట్ల ఒక అహంకృత తూష్ణీంభావాన్ని ఆయన తరచు ప్రదర్శించడం కద్దు.

న్యూఢిల్లీ దినపత్రికలో నేను వ్యాసం రాశాక, ఈ ఏడాది కాలంలో మోదీలోని ఆ రెండు లక్షణాలు పలుమార్లు వ్యక్తమయ్యాయి. వాటితో పాటు మరో లక్షణం– -వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలను తిరుగులేని విధంగా పెంపొందించుకోవడం–- కూడా ఆయన మాటలు, చర్యలలో బాగా ద్యోతకమయింది. మోదీ డాంబికానికి రెండు చర్యలను నిదర్శనాలుగా చెప్పవచ్చు. అవి: ప్రతి వాక్సినేషన్ సర్టిఫికెట్‌పై తన ఫోటో ఉండేలా చేయడం; దేశంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియంకు నరేంద్ర మోదీ స్టేడియంగా పునఃనామకరణం చేసేందుకు ఆమోదించడం. ఈ ఆమోదం ద్వారా, తమ జీవితకాలంలోనే తమ పేరిట ఒక క్రీడాస్థలాన్ని చూసుకోవడానికి తహతహలాడిన ముస్సోలినీ, హిట్లర్, స్టాలిన్, గడాఫీ, సద్దాం సరసన మోదీ కూడా చేరారు.

ప్రజాసమస్యల పరిష్కారంలో సాధికార నిపుణుల సలహాలను తీసుకోవాలని ఏడాది క్రితం ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేసినప్పుడు నా ప్రతిపాదనలోని ఆదర్శవాదానికి నా వృత్తిగత నేపథ్యమే ప్రేరణ అయింది. ఒక చరిత్రకారుడిగా భారతీయ ప్రధానమంత్రులు తమ అభిమాన దురభిమానాలను పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకుల సహాయ సహకారాలను కోరి స్వీకరించిన దృష్టాంతాలు ఎన్నో నాకు తెలుసు. వాటిలో కొన్నిటిని ప్రస్తావిస్తాను. 1960వ దశకంలో ప్రచ్ఛన్నయుద్ధం ప్రచండంగా చెలరేగుతున్నప్పుడు పాశ్చాత్యదేశాలకు పంపిన శాంతి ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించమని రాజాజీని నెహ్రూ అభ్యర్థించడం;

1970–-71లో తూర్పు పాకిస్థాన్‌లో పాక్ సైన్యం అమానుష కృత్యాలతో తలెత్తిన శరణార్థుల సంక్షోభం గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయమని జయప్రకాశ్ నారాయణ్‌ను ఇందిరాగాంధీ అభ్యర్థించడం; 1994లో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ సమస్యపై మన వాదనలు నివేదించేందుకు భారత ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించమని అటల్ బిహారీ వాజపేయిని పీవీ నరసింహారావు అభ్యర్థించడం. ఇవన్నీ మన ప్రధానమంత్రుల విశాల దృక్పథానికి ప్రశంసనీయమైన దృష్టాంతాలు. ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యమున్న ఆదర్శ ఉదాహరణలు. వీటన్నిటి కంటే మరింత ప్రశంసనీయమైన, ఆదర్శప్రాయమైన దృష్టాంతం మరొకటి ఉంది. అది స్వాతంత్ర్య వేళ జాతీయప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఆనాటి పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకున్న జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్ పార్టీలకు అతీతంగా పాలనాదక్షులైన వ్యక్తులకు ప్రభుత్వంలో స్థానం కల్పించారు.

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అప్పటికి రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తుండేవారు. అయినప్పటికీ స్వతంత్ర భారత తొలి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన్ని నెహ్రూ, పటేల్ ఆహ్వానించారు. కాంగ్రెస్‌ను రాజకీయంగా వ్యతిరేకించిన శ్యామప్రసాద్‌ ముఖర్జీ, ఆర్‌కె షణ్ముగం చెట్టిని కూడా జాతీయప్రభుత్వంలో చేర్చుకున్నారు. ఇలా కాంగ్రెసేతర నాయకులను మంత్రి పదవులలో నియమించడం ద్వారా స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి, ప్రథమ హోంమంత్రి తమ సొంత ఇష్టాయిష్టాలకు కాకుండా జాతిశ్రేయస్సుకు అగ్ర ప్రాధాన్యమిచ్చారు. కష్టపడి సాధించుకున్న స్వాతంత్యాన్ని అన్నివిధాల సమున్నతం చేసుకోవాలనే లక్ష్యంతోనే వారు ఇలా అత్యంత ఉదారంగా, విశాలభావంతో వ్యవహరించారు. అధికారంతో పాటు వచ్చే అహంకారానికి ఏ మాత్రం తావివ్వకుండా, దేశభక్తి నిర్దేశించే వినమ్రతను నెహ్రూ, పటేల్‌ పరిపూర్ణంగా పాటించారు.

ఏడాది క్రితం న్యూఢిల్లీ దినపత్రికలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొద్దిరోజుల క్రితం కోల్‌కతా నుంచి వెలువడే ఒక పత్రిక సంపాదకీయంలో ప్రతిధ్వనించాయి. ‘సంక్షోభం తీవ్రమైనది. ఒక విషక్రిమితో యావత్ జాతి యుద్ధం చేస్తోంది. ఈ విషమ పరిస్థితుల్లో ప్రభుత్వం సహకారపూరిత దృక్పథాన్ని అనురించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు సహకార వైఖరితో వ్యవహరించడం ద్వారా గతంలో దేశం ఆరోగ్య, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను అధిగమించాయి. ఆ ఉదాత్త చరిత్ర నుంచి ప్రస్తుత పాలకపక్షం భారతీయ జనతాపార్టీ పాఠాలు నేర్చుకోకపోవడం ఎంతైనా శోచనీయం. సమాఖ్య స్ఫూర్తిని దృఢతరం చేయాలి. ప్రతిపక్షాల పట్ల రాజీ వైఖరి చూపాలి. దేశ పాలనలో అపార అనుభవమున్న నాయకులు విపక్షాలలో చాలామంది ఉన్నారు. ఈ కష్టకాలంలో వారి సేవలను సద్వినియోగం చేసుకోవాల’ని పేర్కొంది.

మోదీ ప్రభుత్వం ఇటువంటి వివేకాన్ని ప్రదర్శించి పార్టీలకు అతీతంగా పౌరుల మధ్య పరస్పర విశ్వాసం, సంఘీభావాన్ని పెంపొందిస్తుందా అన్నది పూర్తిగా మరో విషయం. కరోనా విషక్రిమితో దేశప్రజలు యుద్ధం చేస్తున్న తరుణంలోనే నరేంద్రమోదీ వ్యక్తిపూజ కూడా బాగా పెరిగిపోయింది. అలాగే ప్రతిపక్షాలతో ప్రధానమంత్రి సంఘర్షణాత్మక ధోరణులు కూడా ఇతోధికమయ్యాయి. కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు విపక్ష నాయకుల పట్ల విషం కక్కుతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ ముఖ్యమంత్రులపై వారు వర్షిస్తున్న విమర్శలే ఇందుకు తార్కాణాలు. ఢిల్లీ, ముంబై మన మహానగరాలు. ఒకటి దేశ రాజధాని. రెండోది మన ఆర్థిక రాజధాని. రెండు నగరాలలోనూ కోట్లాది ప్రజలు నివశిస్తున్నారు.

ఈ రెండు నగరాలు బీజేపీయేతర రాజకీయపక్షాల పాలనలో ఉన్నాయనే కారణంగా ఆ నగరాలవాసులు కొవిడ్‌తో మరింతగా యాతనలు పడాలని కోరుకోవడం ఎటువంటి దేశభక్తి? ఇటువంటి ధోరణులు బీజేపీ సామాజిక మాధ్యమాల దళాలకే పరిమితమయితే పెద్దగా కలవరపడనవసరం లేదు. అయితే కేంద్రప్రభుత్వంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తులే ఇటువంటి వైఖరిని చూపడం శోచనీయం. ఈ ఏడాది కాలంలో కేంద్ర హోంమంత్రి చేసిన ప్రయాణాలను పరిశీలిస్తే ఆయన అగ్రప్రాధాన్యాలు ఏమిటో విశదమవుతాయి. అవి: పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడం; మహారాష్ట్రలోనూ తమ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం. ఈ రెండూ ఆయన మంత్రిత్వశాఖకు సంబంధించిన అంశాలు కావు. అయినప్పటికీ తన అధికారిక విధుల కంటే ఈ లక్ష్యాల పరిపూర్తికే కేంద్ర హోంమంత్రి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను భావించేదే ముఖ్యమని విశ్వసిస్తున్నారు! ఈ నెల 17న అసన్‌సోల్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన చేసిన ఒక వ్యాఖ్యే అందుకు నిదర్శనం. ‘మైనె ఐసీ సభా పెహ్లి బార్ దేఖి హై’ (ఒక ర్యాలీలో ఇంతమంది పాల్గొనడాన్ని నేను ఎన్నడూ చూడలేదు) అని ఆయన గొప్పగా చెప్పుకున్నారు ఒక భారతీయ రాజకీయవేత్త ఇంత అనుభూతి రాహిత్యంతోనూ, నిర్దయతతోనూ మాట్లాడడాన్ని మనం ఇంతకు ముందెన్నడైనా చూశామా? ఏప్రిల్ 17 నాటికి కరోనా రెండో దఫా విజృంభణ ముమ్మరమయింది. రోగులతో ఆసుపత్రులు, శవాలతో శ్మశానాలు కిక్కిరిసిపోసాగాయి. అయినప్పటికీ మన ప్రధానమంత్రి ‘చూడండి, నా ఉపన్యాసాన్ని వినేందుకు ఎంతమంది వచ్చారో’ అంటూ బడాయికి పోయారు!

కరోనా మహమ్మారి దఫాదఫాలుగా విజృంభిస్తుండడంతో మన ఆర్థిక, సామాజికరంగాలు అతలాకుతలమై పోతున్నాయి. దేశ విభజన అనంతరం మనం ఎదుర్కొంటున్న భీషణ సంక్షోభమిది. జాతి హితవరుల మాటను వినడాన్ని నేర్చుకునే ప్రభుత్వమూ, పాఠాలు నేర్చుకునేందుకు చరిత్రను వినే ప్రభుత్వమూ ఇప్పుడు మనకు కావాలి. ఆ సర్కారు ఒక పార్టీ లేదా ఒకే మతం, మరీ ముఖ్యంగా ఏకైక నాయకుని ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేదిగా ఉండకూడదు. జాతిశ్రేయస్సును అవిభాజ్యంగా భావించేదై ఉండాలి. అటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు పొందుతాం, అసలు పొందుతామా లేదా అన్న దానిపైనే మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Courtesy Andhrajyothi

Leave a Reply