ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్

0
28

– జ్ఞానవాపీ, మథురలో షాహీ ఇద్గా, కుతుబ్‌మీనార్‌లపై కోర్టుల్లో వివాదాలు
– దేశమంతా భావోద్వేగాలు రగిలించేయత్నంలో హిందూత్వ శక్తులు
– నిత్యం మత ఉద్రిక్తత నెలకొల్పటమే పాలకుల వ్యూహం
– ప్లేసెస్‌ ఆఫ్‌ వర్షిప్‌ యాక్ట్‌తో..
– మత వివాదాలను అడ్డుకోవచ్చు : రాజకీయ విశ్లేషకులు

బీజేపీ నాయకులు తాజ్‌మహల్‌ చుట్టూ ఇప్పుడు కొత్త కథ అల్లుతున్నారు. దీనిపై వారు అలహాబాద్‌ హైకోర్టు మెట్లు ఎక్కారు. తాజ్‌మహల్‌..ఒకప్పుడు శివాలయం, మహల్‌లో సీల్‌ వేసిన 20 గదులను తెరపించాలని బీజేపీ నాయకుడు రజనీష్‌ సింగ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే పిటిషన్‌ను విచారణను తిరస్కరిస్తూ హైకోర్టు ధర్మాసనం (మే 12న) పిటిసన్‌దారు రజనీష్‌ సింగ్‌కు గట్టిగా చురకలు అంటించింది.

న్యూఢిల్లీ : అద్వానీ రథయాత్ర…బాబ్రీ మసీదు కూల్చివేతతో దేశంలో బీజేపీ పెద్ద ఎత్తున విస్తరించింది. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో మసీదులు, ముస్లిం స్మారక స్థూపాలు, చిహ్నాల చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. ఉద్దేశపూర్వకంగా ఒక మతానికి చెందినవాటిని హిందూత్వ గ్రూపులు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. జ్ఞానవాపీ మసీదు (వారణాసి), షాహీ ఈద్గా (మథుర), భోజశాల స్మారక చిహ్నం (ధార్‌-మధ్యప్రదేశ్‌), కుతుబ్‌మీనార్‌…ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.
పలు రాష్ట్రాల్లో ఒక మత వివాదాన్ని రేపటం బీజేపీ పాలకులకు, హిందూత్వ గ్రూపులకు ఒక పరిపాటిగా మారందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రార్థనా మందిరాలు, స్మారక చిహ్నాల విషయంలో వివాదలు తలెత్తినప్పుడు ‘ప్లేసెస్‌ ఆఫ్‌ వర్షిప్‌ యాక్ట్‌, 1991’ను కోర్టులు ప్రయోగించి లౌకికత్వాన్ని పరిరక్షించాయని, లౌకకత్వాన్ని నిలబెట్టాయని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అదే పంథాలో నేడు న్యాయస్థానాలు ఆ చట్టాన్ని ఎందుకు ఉపయోగించటం లేదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గతాన్ని తవ్వి అశాంతిని రేపుతారా?
గత ఏడాది డిసెంబర్‌లో కుతుబ్‌మీనార్‌పై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏవో పాత విషయాలు తవ్వుకొని…ప్రస్తుత సమాజంలో అశాంతిని నింపుదామా? అంటూ సివిల్‌ జడ్జి నేహా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్లేసెస్‌ ఆఫ్‌ వర్షిప్‌ యాక్ట్‌, 1991’ను ఉపయోగిస్తూ లౌకికత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తన తీర్పులో ఆమె పేర్కొన్నారు. వారణాసి, మధుర, ధార్‌(మధ్యప్రదేశ్‌)…ఇలా అనేక చోట్ల ముస్లిం ప్రార్థనా స్థలాలు, స్మారకచిహ్నాలపై నేడు న్యాయాస్థానాల ముందుకు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ‘ప్లేసెస్‌ ఆఫ్‌ వర్షిప్‌ యాక్ట్‌, 1991’ను పరిగణలోకి తీసుకొని కొత్త వివాదాలు ఏర్పడకుండా పరిష్కరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

జ్ఞానవాపీపై అందరి దృష్టి
వారణాసిలో జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్‌ ఆవరణలో ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదని, అక్కడ ఇప్పటికీ శివలింగం ఉందని హిందూత్వ శక్తులు కోర్టుకు ఎక్కాయి. మథురలోని ప్రఖ్యాత మసీదు ‘షాహీ ఇద్గా’పైనా కొత్తగా వివాదం మొదలైంది. కృష్ణుడు జన్మించిన స్థలం ఇది, కాత్రా కేశవ్‌ దేవ్‌ దేవాలయం సమీపంలో మసీదు ఉండటమేంటని కొంతమంది మధుర జిల్లా కోర్టును ఆశ్రయించారు. షాహీ ఈద్గా లోపలి పరిసరాల్ని, చుట్టుపక్కల అంతా కూడా వీడియోగ్రాఫీ సర్వే చేపట్టాలని పిటిషన్‌దారులు కోరారు. దీనిపై అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే..జులై1 కల్లా చెప్పండని న్యాయస్థానం షాహీ ఈద్గా మేనేజ్‌మేంట్‌ కమిటీని అడిగింది.

మసీదు ఉన్న ప్రాంతం సహా మొత్తం 13.37 ఎకరాల భూమి కాత్ర కేశవ్‌ దేవ్‌ దేవాలయానికి చెందినదని ఈకేసులో పిటిషన్‌దారులు వాదిస్తున్నారు. బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దేశంలో మసీదు-మందిర్‌ వివాదాలు పెరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చేసి, మొఘల్‌ రాజులు మసీదులు కట్టారని హిందూత్వ గ్రూపులు మెజార్టీ హిందువుల్ని రెచ్చగొడుతున్నాయి. ముస్లిం ప్రార్థనా మందిరాలను టార్గెట్‌ చేస్తున్నాయి. వీటికి అధికార బీజేపీలోని పెద్ద పెద్ద నాయకులనుంచి కావాల్సినంత మద్దతు లభిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పదే పదే వాటిపై సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, వీడియోలు ప్రసారం చేస్తున్నారు. షాహీ ఈద్గా మసీదుపై ‘హిందూ మహాసభ’ కోర్టుకు ఎక్కింది.

హిందువులకే చెందుతుందని..
మధ్యప్రదేశ్‌లో ‘ధార్‌’లో భోజశాల స్మారకచిహ్నంపై 2003లో వివాదం మొదలైంది. ప్రతి మంగళవారం అక్కడ పూజా కార్యక్రమాలకు హిందువులకు, శుక్రవారం ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించారు. తాజాగా దీనిపై ‘హిందూ ఫ్రంట్‌ ఫర్‌ జస్టిస్‌’ మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు చేసుకోవటాన్ని సవాల్‌ చేశారు. భోజశాలలో కేవలం హిందువులు మాత్రమే పూజాకార్యక్రమాలు నిర్వహించుకునే హక్కు ఉందని పిటిషన్‌దారులు వాదిస్తున్నారు. హైకోర్టు మే 13న కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పురావస్తు శాఖకు నోటీసులు జారీచేసింది.

Leave a Reply