ఇచ్చింది సగమే..

0
288

– కేంద్రానికి కట్టినది 2.75 లక్షల కోట్లు.. ఆరున్నరేండ్లలో దక్కినది రూ.1.40 లక్షల కోట్లు…
– ఈ ఏడాది తెలంగాణకు రావాల్సింది రూ.20 వేల కోట్లు

హైదరాబాద్‌ : కేంద్రానికి ఇచ్చేది కొండంత.. రాష్ట్రానికి వచ్చేది మాత్రం అందులో కొంతే… అన్నట్టుంది పన్నుల సరళి, వాటిపై మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానం. గడిచిన ఆరున్నరేండ్ల కాలంలో తెలంగాణ నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి రూ.2,75,926 కోట్లు చేరాయి. కాగా అందులో తిరిగి రాష్ట్రానికి దక్కింది మాత్రం రూ.1,40,329 కోట్లే. ఈ ప్రకారంగా ఇప్పటి వరకూ రాష్ట్రం చెల్లించిన పన్నుల మొత్తంలో తిరిగి మనకు దక్కింది సగమేనని విదితమవుతున్నది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ వివిధ పన్నులు, పథకాలు, కార్యక్రమాల నిధులు, సాయాల కింద దాదాపు రూ.26 వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఇందులోంచి కేవలం రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లే వచ్చాయి. మిగతా వాటిపై కేంద్రం నోరు మెదపటం లేదు. ఇందుకు సంబంధించి సర్కారియా కమిషన్‌తోపాటు ఇతర కమిటీలు చేసిన సిఫారసులను కేంద్రం పట్టించుకోవటం లేదు. రాష్ట్రాల ఆదాయాలు, కార్యక్రమాలు, పథకాల అమలుకు సంబంధించి వికేంద్రీకరణ అత్యంత అవసరమంటూ ఆయా కమిటీలు సూచించాయి.

కానీ బీజేపీ సర్కారు వాటిని ఎంతమాత్రమూ పట్టించుకోవటం లేదు. మోడీ ప్రభుత్వ హయాంలో ఇదంతా రివర్స్‌గా నడుస్తున్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగానే రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతియేటా ఎక్కువ మొత్తంలోపన్నులు వెళుతుండగా…అక్కడి నుంచి తక్కువ మొత్తంలో తిరిగి వస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు గత సెప్టెంబరులో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.3,753 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాది ఇదే నెలలో ఈ రూపంలో రూ.5,382 కోట్లు దక్కాయి. మొత్తంగా చూస్తే గతేడాది సెప్టెంబరు కంటే ఈ యేడాది కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 3 శాతం మేర తగ్గిందన్నమాట. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌… కరోనాను కారణంగా చూపుతున్న సంగతి తెలిసిందే. ఇది సరికాదంటూ జీఎస్టీకి సంబంధించిన పలు సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవటం గమనార్హం.

చట్టబద్ధత ఉండాలి… డాక్టర్‌ అందె సత్యం, ఆర్థిక విశ్లేషకులు
‘రాష్ట్రాలకు ఇచ్చే నిధులు, పరిహారాల పంపిణీ విషయంలో చట్టబద్ధత ఉండాలి. అవకాశమున్నప్పుడు రాష్ట్రాలకు డబ్బులివ్వటం లేదంటే నిరాకరించటమనేది సరికాదు. జీఎస్టీ విషయంలో అన్ని రాష్ట్రాలకూ పరిహారాలను చెల్లిస్తామంటూ చెప్పి.. వాటిని నిరాకరించటం, పైగా అది దైవ నిర్ణయమంటూ చెప్పటమనేది బాధ్యతా రాహిత్యమే…’

ప్రజలు గమనించాలి
‘కేంద్రం మన దగ్గరి నుంచి తీసుకుంటున్న నిధుల్లోంచి సగమే తిరిగి చెల్లిస్తున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ఇదే సమయంలో రాష్ట్ర జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పెరిగాయి. కీలకమైన రంగాల్లో పెట్టుబడులతోపాటు మూలధనాన్ని పెద్ద ఎత్తున ఖర్చు చేయటం వల్లే ఇది సాధ్యమైంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో వృద్ధి కొనసాగుతున్నది…’
ట్విటర్‌ లో మంత్రి కేటీఆర్‌

Courtesy Nava Telanagana

Leave a Reply