తిరగబెడుతున్న టీబీ

0
63
  • 2 దశాబ్దాల తర్వాత మళ్లీ విజృంభణ..
  • కొవిడ్‌ తర్వాత పెరిగిన క్షయ కేసులు
  • బాధిత టాప్‌ 30 దేశాల్లో ఇండియా
  • భారత్‌లో గతేడాది
  • 5.10 లక్షల మంది మృతి
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక

హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా క్షయ (టీబీ) మళ్లీ విరుచుకుపడుతోంది. రెండు దశాబ్దాల తర్వాత మహమ్మారి తిరగబెడుతోంది. 2021లో కొత్తగా 10.60 లక్షల మంది టీబీ బారినపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 2020తో పోల్చుకుంటే ఇది 4.5శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ 3 శాతం పెరిగిందని తెలిపింది. ఈ మేరకు తాజాగా ‘గ్లోబల్‌ ట్యూబర్‌క్యులొసిస్‌ రిపోర్టు-2021’ విడుదల చేసింది. కొవిడ్‌ వల్ల టీబీ సేవలకు అంతరాయం కలిగిందని, చికిత్స అందని టీబీ రోగుల మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 2020 లో ప్రతి లక్ష జనాభాకు 204 మందికి టీబీ ఉండే ది. అది 2021 నాటికి 244కి పెరిగినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా క్షయ తీవ్రత పెరిగిన 30 దేశాల జాబితాలో మన దేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2021లో ప్రపంచంలోని క్షయ కేసుల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ 8 దేశాల్లోనే నమోదైనట్టు వెల్లడించింది. ఆ జాబితాలో ఇండియాలో 28 శాతం, ఇండోనేషియా 9.2, చైనా 7.4, ఫిలిప్పైన్స్‌ 7, పాకిస్థాన్‌ 5.8, నైజీరియా 4.4, బంగ్లాదేశ్‌ 3.6, కాంగోలో 2.9 శాతం కేసులున్నట్లు పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం… 2020లో ప్రపంచవ్యాప్తంగా టీబీ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10.1 మిలియన్లు ఉండగా, 2021 నాటికి 10.6 మిలియన్లకు పెరిగింది. 2020-21లో ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మంది క్షయతో మరణించారు. ప్రతి లక్ష మంది టీబీ వ్యాధిగ్రస్తుల్లో 17 మంది చనిపోయారు. 2005-2019 మధ్య టీబీ మరణాలు తగ్గాయి. కానీ 2020-21లో టీబీ తిరగబెట్టింది. 2019లో 14 లక్షల మరణాలు సంభవించగా, 2020లో 15 లక్షలు, 2021లో 16 లక్షలకు పెరిగింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ మరణాల్లో 82 శాతం ఆఫ్రికా, దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో సంభవించాయి. ఇందులో ఇండియాలోనే 36 శాతం సంభవించినట్లు ప్రకటించింది. 2020-21లో ఒకే ఒక ఇన్ఫెక్షన్‌ సోకడం వల్ల సంభవించే మరణాల్లో క్షయ రెండో స్థానంలో, కొవిడ్‌ మొదటిస్థానంలో ఉన్నాయి.

భారత్‌లో మరణమృదంగం!
క్షయ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న 30 దేశాల జాబితాలో ఇండియా కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడేళ్లుగా దేశంలో క్షయ మరణాలు పెరిగినట్లు డబ్ల్యుహెచ్‌వో తాజా నివేదికలో పేర్కొంది. 2019లో భారత్‌లో 4.20 లక్షల మంది చనిపోతే, 2020 నాటికి అది 4.80 లక్షలకు పెరిగింది. ఇక 2021లో 5.10 లక్షలకు పెరిగినట్లు వెల్లడించింది.

తెలంగాణలోనూ ప్రమాద ఘంటికలు
రాష్ట్రంలోనూ టీబీ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 798 టీబీ మరణాలు సంభవించాయి. గతేడాది 1,876 మంది క్షయతో చనిపోయారు. టీబీ కేసుల్లో దేశంలోనే తెలంగాణ 11వ స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. 2017లో రాష్ట్రంలో 44,644 టీబీ కేసులుండగా, 2020 నాటికి 63,209కి పెరిగినట్లు తెలిపింది. హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక కేసులున్నాయి. ఈ ఏడాది నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 6 వేలకుపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Leave a Reply