ఏపీలో ధ్వంస రచన

0
33
  • తెదేపా ప్రధాన కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడులు
  • దుడ్డుకర్రలు, కంకర రాళ్లతో బీభత్సం
  • కార్యాలయ సిబ్బందిపైనా దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
  • జిల్లా పార్టీ కార్యాలయాలపైనా దాడులు
  • తెలుగుదేశం నేతల ఇళ్ల ముందు ధర్నాలు
  • అట్టుడికిన రాష్ట్రం
  • రాష్ట్రపతి పాలన విధించాలని తెదేపా డిమాండ్‌ 
  • నేడు బంద్‌కు పిలుపు

అమరావతి: తెదేపా జాతీయ కార్యాలయంతో పాటు, పార్టీ నాయకుడు పట్టాభిరామ్‌ ఇంటిపై మంగళవారం సాయంత్రం ఏపీవ్యాప్తంగా అల్లరిమూకల దాడులు, పలుచోట్ల తెదేపా కార్యాలయాలపై వైకాపా నాయకులు, కార్యకర్తల దాడి యత్నాలు, తెదేపా నాయకుల ఇళ్ల ముందు ధర్నాలతో రాష్ట్రం అట్టుడికింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారం దాడులు జరగడం ప్రజల్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనలన్నీ మంగళవారం సాయంత్రం దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ దాడులతో తెదేపా శ్రేణులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి. వైకాపా నాయకులు, పోలీసులు కుమ్మక్కై ఈ అరాచకానికి తెగబడ్డారని మండిపడుతున్నాయి. బుధవారం రాష్ట్ర బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది. దాడులపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తెదేపా చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ ఇలా ఒక పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడటంతో ఒక దుష్ట సంప్రదాయానికి తెర తీసినట్టయిందని వివిధ రాజకీయ పక్షాలు ఖండించాయి. తెదేపా ఆరోపణల్ని వైకాపా ఖండించింది. తెదేపా కార్యాలయాలపై తాము దాడులు చేయలేదని, ఎవరితోనో రాళ్లు వేయించడం, భౌతికంగా ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు పేర్కొన్నారు.

ఏకకాలంలో దాడులు!
ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విశృంఖలంగా సాగవుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు సోమవారం ఆరోపణలు చేయడంతో… నర్సీపట్నం పోలీసులు హుటాహుటిన గుంటూరు వచ్చి సోమవారం అర్ధరాత్రి ఆనంద్‌బాబు ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఈ పరిణామాలపై తెదేపా నాయకుడు పట్టాభిరామ్‌ మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, ప్రభుత్వం, పోలీసులపై పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని పట్టాభిరామ్‌ ఇంటిపై సాయంత్రం కొందరు దుండగులు దాడి చేసి, బీభత్సం సృష్టించారు. కాసేపటికి మంగళగిరి సమీపంలో, డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గర్లో ఉన్న తెదేపా జాతీయ కార్యాలయంపై పదుల సంఖ్యలో దుండగులు విరుచుకుపడి విశృంఖలంగా దాడికి పాల్పడ్డారు. పార్టీ నాయకుడు దొరబాబు సహా, మరో ముగ్గురు కార్యాలయ సిబ్బందిని గాయపరిచారు. ఈ దాడిని ముందే పసిగట్టిన తెదేపా కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. అల్లరిమూకలు వెళ్లిపోయాక వారు వచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా దాడి యత్నాలు.
తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరి మూకలు విరుచుకుపడ్డ సమయానికే.. విశాఖ, నెల్లూరు, చిత్తూరు వంటి చోట్ల తెదేపా కార్యాలయాలపైనా, నేతలపైనా వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు. కొన్ని చోట్ల తెదేపా నాయకుల చొక్కాలు చించేయడం వంటి ఘటనలు జరిగాయి. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని వైకాపా నాయకులు ముట్టడించారు.

కేంద్ర బలగాల రక్షణ కావాలి
పార్టీ కార్యాలయంపై దాడి జరుగుతున్న సమయానికి తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నారు. దాడి సమాచారం తెలిసిన వెంటనే ఆయన డీజీపీకి ఫోన్‌ చేశారు. ఆయన స్పందించకపోవడంతో… చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. పార్టీ కార్యాలయాలకు కేంద్ర బలగాల రక్షణ కోరారు. ఆయన హుటాహుటిన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన బీభత్సాన్ని పరిశీలించాక… విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి పాలనకు తాను వ్యతిరేకమంటూనే… ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విశాఖ పర్యటన రద్దు చేసుకుని, రాత్రి 9 గంటల సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంపై దాడులకు నిరసనగా తెదేపా నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై రెండు దఫాలుగా రాస్తారోకో చేశారు.
తెదేపా కార్యాలయాలపై దాడుల్ని వైకాపా తప్ప అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. భాజపా, కాంగ్రెస్‌, జనసేన, వామపక్ష పార్టీలు తెదేపాకు సంఘీభావం ప్రకటించాయి.

చవకబారు రాజకీయాలకు మేం వ్యతిరేకం: వైకాపా
చవకబారు, తెరచాటు రాజకీయాలకు ముఖ్యమంత్రి జగన్‌ వ్యతిరేకమని, ఆయన రాజకీయం నేరుగానే ఉంటుందని వైకాపా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ‘మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అని తెదేపా నాయకులు అడుగుతున్నారు. బూతులు తిట్టడాన్నీ మాట్లాడే స్వేచ్ఛగా తెదేపా గుర్తిస్తోందా?’ అని ధ్వజమెత్తారు. బుధవారం నిరసన కార్యక్రమానికి వైకాపా పిలుపునిచ్చింది.

ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే: చంద్రబాబు
అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి.. ప్రభుత్వం, పోలీసులు కలసిచేసిన టెర్రరిజమని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ‘రాష్ట్రపతి పాలనకు నేను వ్యతిరేకం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఏముంటాయి? 356 అధికరణం ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించాలి’ అని డిమాండు చేశారు. ‘దాడులపై చెప్పేందుకు ప్రయత్నించినా డీజీపీ ఫోన్‌ తీయకుండా తీరికలేకుండా ఉన్నారా?’ అని నిలదీశారు. ‘దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. ఎప్పుడూ బంద్‌కు పిలుపివ్వని నేను.. బుధవారం రాష్ట్ర బంద్‌ పాటించాలని కోరామంటే ప్రజలంతా అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలూ మద్దతివ్వాలి’ అని విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడలో పట్టాభి, హిందూపురంలో బాలకృష్ణ ఇంటిపై, కడపలో అమీర్‌బాబుతోపాటు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరుల్లోనూ దాడులు జరిగాయి. శాంతిభద్రతల రక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే ఏం కావాలి? దీనిపై విచారణ చేయించాలి’ అని డిమాండు చేశారు. ‘తెదేపా కార్యాలయంపై దాడి జరుగుతుంటే డీజీపీకి తెలియలేదంటే ఆయన ఆ పదవికి తగినవారేనా? సంయమనం పాటించాలంటూ తెలివిగా మాట్లాడుతున్నారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ఆయన.. మమ్మల్ని చంపే సమయంలో ఎక్కడున్నారు? ఎక్కడికి పోయారు? చేతనైతే శాంతిభద్రతలను రక్షించండి.. లేదంటే ఇంటికి పోండి’ అని మండిపడ్డారు. మాదకద్రవ్యాల మాఫియాకు ఏపీ కేంద్రంగా తయారైందని బాబు దుయ్యబట్టారు.

మాటలు మీరితే ఊరుకోం: సుచరిత
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడే వారిని చూస్తూ ఊరుకోబోమని, సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. మంగళవారం రాత్రి గుంటూరులో ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు, వీడు, పాలెగాళ్లు అని సంబోధిస్తూ తెదేపా నేత పట్టాభి మాట్లాడితే ఏనాడూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు సరికాదని మందలించలేదు. గుజరాత్‌ పోర్టులో దొరికిన డ్రగ్స్‌ విషయంలో సీఎం, వైకాపా నాయకులపై పదేపదే బురదజల్లుతున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని కేంద్రం స్పష్టత ఇచ్చినా సీఎంను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉండొచ్చని అనుమానించాల్సి వస్తోంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని పాలెగాడు అంటే చంద్రబాబుతో సహా వీరెవరూ ఖండించకపోవడం బాధాకరం’ అని సుచరిత వ్యాఖ్యానించారు. ‘గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏమిటో చెప్పాలని నర్సీపట్నం నుంచి పోలీసులు వచ్చి తెదేపా మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు నోటీసులిస్తే తీసుకోలేదు. ఆయన ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థంకావడం లేద’న్నారు.

Courtesy Eenadu

Leave a Reply