దళితుడినైనందుకే ఘోరంగా అవమానించారు!

0
154
  • గణపతి చందా ఇవ్వనందుకే కక్ష కట్టారు
  • బీజేపీ, వీహెచ్‌పీ నేతలపై ఉపాధ్యాయుడి ఫిర్యాదు : కేసు నమోదు

నిజామాబాద్‌ అర్బన్‌/కోటగిరి : గణపతి చందా ఇవ్వలేదనే కక్షతో కొందరు యువకులు తనను కులం పేరుతో దూషించడంతో పాటు బలవంతంగా ఆలయానికి తీసుకెళ్లి బొట్టు పెట్టారని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. బాధితుడు మల్లికార్జున్‌ వివరాల ప్రకారం, జిల్లాలోని కోటగిరి జడ్పీహెచ్‌ఎ్‌సలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్న తన వద్దకు నాలుగు నెలల క్రితం కొందరు యువకులు వచ్చి గణపతి చందా అడిగారని, తాను చందా ఇవ్వనని చెప్పిన మాటలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని తెలియజేశారు. ఈనెల 2న బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు పాఠశాలకు వచ్చి తాను సరస్వతి దేవిని కించపరిచానని, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేయడంతో క్షమాపణ చెప్పానని, అయినా పాఠశాల ఎదుట ధర్నా చేస్తూ తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తంచేశారు.

తనను బలవంతంగా ఆలయానికి లాక్కెళ్లి గుడిలో బొట్టు పెట్టించారని తెలిపారు. తాను దళిత కులానికి చెందిన వ్యక్తి కావడంతోనే వారు పోలీసులు, ఉపాధ్యాయుల ఎదుట అవమానించారని వాపోయారు. ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. బీజేపీ మండ లాధ్యక్షుడు కాపుగాండ్ల శ్రీనివాస్‌, శేఖర్‌, రాజు, నవీన్‌, మురళి అనే వ్యక్తులపై ఆయన గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. కాగా మల్లికార్జున్‌ను అవమానించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఉపా ధ్యాయ సంఘాల పోరాట కమిటీ, టీపీటీఎఫ్‌ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశా రు. కాగా, మల్లికార్జున్‌ సరస్వతి దేవిని దూషిస్తూ బలవంతపు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారన్న బీజేపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply