తీస్తా సీతల్వాడ్‌కు సుప్రీంలో మధ్యంతర బెయిలు

0
42

దిల్లీ: సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌కు మధ్యంతర బెయిలు మంజూరుచేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల కేసులో నిర్దోషులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు పుట్టించారన్న ఆరోపణతో ఆమెను జూన్‌ 25న పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాల ధర్మాసనం బెయిల్‌ పిటిషన్‌ను విచారించింది. ఆమె బెయిల్‌ పిటిషనుపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీచేసిన గుజరాత్‌ హైకోర్టు మధ్యంతర బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహిళ అయిన అప్పీలుదారును ఇప్పటికే ఏడు రోజులు పోలీసు కస్టడీలో విచారించిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. గుజరాత్‌ హైకోర్టు సాధారణ బెయిలు ఖరారు చేసేవరకూ పాస్‌పోర్టును ట్రయల్‌ కోర్టులో స్వాధీనం చేయాలని సీతల్వాడ్‌ను న్యాయమూర్తులు ఆదేశించారు. అదేవిధంగా విచారణకూ సహకరించాలని సూచించారు.

Leave a Reply