
- పౌరుల కదలికలపై సర్కారు నిఘా నేత్రం
- ప్రైవేటు సంస్థతో కలిసి ఐటీ శాఖ కృత్రిమ మేధ ఉపకరణం
- గత అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత వినియోగం
- ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ల వివరాలు గుర్తింపు
- సర్కారు చేతిలో 30 కోట్ల రికార్డులు
- పథకాల్లో అనర్హుల గుర్తింపునకు ఇదే కీలకం
- ఐటీ శాఖ సూత్రధారి.. ‘పోసిడెక్స్’ పాత్రధారి
- ప్రజల వ్యక్తిగత సమాచారం ఆ సంస్థ చేతుల్లో
- ‘ఐటీ గ్రిడ్’ను మించిన ఉల్లంఘన: నిపుణులు
- పేరు చెప్తే.. చరిత్ర చెప్తాం!
బిగ్‌బాస్ హౌస్ అంటే తెలుసు కదా! వివిధ రంగాల ప్రముఖులను కొన్నివారాలపాటు ఒకే ఇంట్లో ఉంచుతారు! వారిపై అనుక్షణం కెమెరాల నిఘా ఉంటుంది. అక్కడ బిగ్‌బాస్ నిఘా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది బిగ్‌బాస్ హౌస్ అయితే.. ఇది తెలంగాణ హౌస్!! రాష్ట్రంలో కూడా ప్రజలెవరూ ప్రభుత్వ నిఘా నేత్రం నుంచి తప్పించుకోలేరు. ప్రభుత్వ పథకాల కోసమో.. వాహనాల రిజిస్ట్రేషన్ కోసమో.. ఏదో ఒక కారణంతో మీరిచ్చిన ఫోన్ నంబరు, ఆధార్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఆధారంగా.. బిగ్‌బా్‌సలా సర్కారు కూడా మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ని, మీ సమస్త సమాచారాన్ని కోట్లాది బైట్లల్లో సేకరిస్తోంది!!
హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారు నిఘా నేత్రం పౌరులను వెంటాడుతోంది. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడాల్సిన సర్కారు.. పౌరుల గోప్యతకు భంగం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన సర్కారు.. పౌరుల హక్కులను తానే కాలరాస్తోంది. ప్రజల వ్యక్తిగత సమాచార నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించి.. సుప్రీంకోర్టు ఆదేశాలతో పాటు చట్టాలను తుంగలో తొక్కుతోంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ దీనికి సూత్రధారి కాగా.. పోసిడెక్స్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు ఐటీ సంస్థ దీంట్లోపాత్రధారి. స్మార్ట్ పోలిసింగ్‌లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ మూడేళ్ల క్రితం ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ హబ్ (ఐపీఐహెచ్) పేరుతో పౌరుల సమాచారాన్ని సేకరించే ప్రాజెక్టు దీనికి నాంది. నాడు హైదరాబాద్ సిటీ కమిషనర్ (ప్రస్తుత డీజీపీ) మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాజెక్టుకు 2017 మొదట్లో శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని పౌరుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ రూపొందించారు. ఇందులో భాగంగా పౌరుల పేరు, వారి తల్లిదండ్రులు, భార్య/భర్త పేర్లు, చిరునామా,
పుట్టినతేదీ, మొబైల్ నంబరు, డ్రైవింగ్ లైసెన్సు సంఖ్య, ఆధార్ వివరాలు, నేరగాళ్లయితే క్రైం నంబరు సేకరించారు. ఈ సమాచారాన్నంతా 2014లో తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటాబేస్ నుంచి సేకరించారు. ఈ సమాచారాన్ని పోలీసు శాఖ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖకు ఇచ్చింది.
ప్రైవేటు భాగస్వామ్యంతో ‘సమగ్ర’
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు జీహెచ్‌ఎంసీ, ఆర్టీఏ, రిజిస్ర్టేషన్, పౌరసరఫరా శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ.. ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు పౌరుల నుంచి సేకరించిన సమాచారాన్నంతా రాష్ట్ర ప్రభుత్వం.. ఐటీ శాఖ ద్వారా పోసిడెక్స్ టెక్నాలజీస్ చేతిలో పెట్టింది. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సంబంధించిన డేటా రికార్డులు వేర్వేరు ప్రభుత్వ శాఖల వద్ద ఉంటాయి. ఇలా ప్రభుత్వం వద్ద రాష్ట్ర పౌరులకు సంబంధించి.. దాదాపు 30కోట్లకు పైగా డేటా రికార్డులు ఉన్నాయని అంచనా. ఈ రికార్డులన్నిటినీ ఒకే వ్యవస్థలో అనుసంధానం చేసేలా పోసిడెక్స్ టెక్నాలజీస్, ఐటీ శాఖ కలిసి కృత్రిమ మేధ ఆధారిత ఉపకరణాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి.. దానికి ‘సమగ్ర’ అని నామకరణం చేశాయి. దీనిద్వారా పౌరుడి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టినతేదీ, చిరునామా, ఆధార్ సంఖ్య, డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్యలో ఏ ఒక్కటి నమోదు చేసినా 97ు కచ్చితత్వంతో సంబంధిత పౌరుల వివరాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఇదే విషయాన్ని ఈ ఏడాదిజూలై 5న హెచ్‌ఐసీసీలో జరిగిన చార్టర్డ్ అకౌంటంట్ల జాతీయ సదస్సులో సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఆవిర్భావం నుంచి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్ స్వయంగా పేర్కొన్నారు.
ఎలా ఉపయోగిస్తారు..?
‘సమగ్ర’ ద్వారా సంక్షేమ పథకాల్లో అనర్హులను క్షణంలో గుర్తించవచ్చు. ఉదాహరణకు.. కారు ఉన్నవారు తెల్ల రేషన్ కార్డు పొందేందుకు అనర్హులు. అయినా రాష్ట్రంలో చాలామంది అనర్హుల వద్ద తెల్ల కార్డులున్నాయి. ‘సమగ్ర’లో పౌరసరఫరా శాఖ లబ్ధిదారుల వివరాలు, ఆర్టీఏ ద్వారా వాహనాలు, కార్లు రిజిస్ట్రేషన్ చేసిన వివరాలు ఉన్నందున.. కార్లు కలిగి ఉండి కూడా తెల్లరేషన్ కార్డులు పొందినవారు ఎందరో వెంటనే తెలిసిపోతోంది. ఈ విధానం ద్వారానే రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్ల క్రితం తెల్ల రేషన్ కార్డులు రద్దుచేశారు. అలాగే.. పింఛను లబ్ధిదారుల ఎంపిక, రైతు బంధు, ఇతర సం క్షేమ పథకాల్లోనూ ఈ పద్ధతిని అమలు చేశారు. కానీ, దీనివల్ల కొంతమంది అర్హులూ నష్టపోయారు. ఉదాహరణకు.. ట్యాక్సీలు నడిపే డ్రైవర్ల కార్డులూ రద్దయ్యాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ..
సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగింపునకు ‘సమగ్ర’ను వినియోగిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా.. ఆ సమాచారం ఆధారంగా ప్రతి పౌరుడి డిజిటల్ ఫుట్‌ప్రింట్‌పై ప్రభుత్వం నిఘా వేస్తోందని సైబర్ భద్రత నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమాచారాన్ని ప్రభుత్వం తన రాజకీయ, వ్యాపార, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను కావాలనే తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐటీ శాఖలోని విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు ముందు ప్రజల ఆన్‌లైన్ శోధన సమాచారం, సోషల్ మీడియా విశ్లేషణ ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేకుల జాబితాను ఆ శాఖ రూపొందించింది. దాని ఆధారంగానే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని, ముఖ్యంగా.. అధికారపార్టీ బలహీనంగా, ప్రతిపక్షాల అభ్యర్థులు బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించి, 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఐటీగ్రిడ్‌ను మించి..
ఈ ఏడాది సార్వతిక్ర ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకూఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముందు.. టీడీపీకి మద్దతుగా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేస్తున్నారంటూ ఐటీగ్రిడ్ అనే ప్రైవేటు సాఫ్ట్‌వేర్ కంపెనీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ శాఖ వ్యవహారం పరిశీలిస్తే.. ఐటీ గ్రిడ్‌ను మించిన ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సైబర్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ శాఖలు, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రజలనుంచి సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం పోసిడెక్స్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కాకూడదనే ఉద్దేశంతోనే.. ఆధార్‌ను అన్నిటికీ అనుసంధానించకూడదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వమే జాగ్రత్తగా ఉంచాలని, ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని కూడా పేర్కొంది. కానీ తెలంగాణలో ప్రజల సమాచారాన్నంతా.. ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టారు. అదెలాగంటే.. సాధారణంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని స్టేట్ డేటా సెంటర్‌లో భద్రపరుస్తారు. దీని పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఎస్టీసీ కేంద్రం పర్యవేక్షణ బాధ్యతనూ ప్రభుత్వం పోసిడెక్స్ టెక్నాలజీ్‌సకు అప్పగించింది.
అమ్ముకుంటే అడిగేదెవరు?
‘పోసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆదాయపు పన్ను, జీహెచ్‌ఎంసీ శాఖలకు వ్యాపార సేవలు అందిస్తోంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఈ ప్రైవేటు సంస్థ కీలక భాగస్వామిగా ఉంది. ఇదే విషయాన్ని ఆ సంస్థ తన వెబ్ సైట్లోనే ప్రస్తావించింది. ఇన్సూరెన్స్, టెలికాం రంగాల్లోని ప్రముఖ కంపెనీలు పొసిడెక్స్ టెక్నాలజీ్‌సకి క్లయింట్లుగా కొనసాగుతున్నారు. ఇందులో బ్యాంకింగ్‌లో అగ్రస్థాయి ప్రైవేటు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ రంగంలో వ్యాపారసంస్థలు ఉండడం గమనార్హం. ప్రజల సమాచారాన్ని పోసిడెక్స్ సంస్థ ఆయా కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటే అడిగే నాథుడు ఎవరని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ సమాచారం ఇవ్వలేం: ఐటీ శాఖ
ప్రజల వ్యక్తిగత సమాచార సేకరణకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఐటీ శాఖ నిరాకరించింది. ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచార భద్రతకు తీసుకుంటున్న చర్యలు, ప్రైవేటు సంస్థల ప్రమేయం, పోసిడెక్స్ టెక్నాలజీ్‌సతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, ఆ సంస్థ ప్రభుత్వానికి అందించే సేవల గురించి తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. ఆ సమాచారం ఇవ్వలేమని ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
చట్టం ఏం చెబుతోంది?
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని.. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం విదేశాల్లో పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంలో ఉల్లంఘనకు పాల్పడిందంటూ గూగుల్‌పై అనేక కేసులు ఉన్నాయి. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ కోర్టుకు వెళ్లి భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. భారత్‌లో ఇలాంటి పటిష్ఠ చట్టాలు లేకపోయినా.. ఆర్టికల్-21 జీవించే హక్కులో ప్రైవసీ హక్కు కూడా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని ఆదేశించింది. పౌరులపై నిఘా ఉంచేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కూడా అనుమతించదు. దేశ ప్రయోజనాలు, శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా ఒక వ్యక్తిపై నిఘా ఉంచాలంటే హోం కార్యదర్శి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం స్పష్టం చేస్తుంది. అదికూడా నిఘా వ్యవధి గరిష్ఠంగా 60 రోజులే చెల్లుబాటు అవుతుంది
Courtesy Andhra Jyothy..