అప్పులు దొరకవు, ఆదాయం పెరుగదు!

0
183
ప్రొఫెసర్ కోదండరాం

ప్రభుత్వ అప్పులు సామాజిక, రాజకీయ రంగాలను పూర్తిగా విధ్వంసం చేస్తాయని శ్రీలంక అనుభవం చెప్పుతున్నది. ఈ వాస్తవాలు మన కళ్ల ముందు కనబడుతున్నా, నానాటికి పెరుగుతున్న మన తెలంగాణ రాష్ట్రం అప్పుల గురించి జరుగ వలసినంత చర్చ జరగడం లేదు. రాష్ట్ర రుణభారం ఎంత, అప్పులు దేని కోసం తెచ్చుకుంటున్నాం, అందువలన తలెత్తుతున్న సమస్యలు ఏమిటి అన్న విషయాలపైన మనం దృష్టి పెట్టడం లేదు. రాష్ట్ర అప్పులకు సంబంధించిన సమాచారాన్ని వెలుగులోకి తేవడమే ఈ వ్యాసం లక్ష్యం.

జూలై 25న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా 2022 మార్చి ౩1నాటికి తెలంగాణ అప్పు మొత్తం 3.12 లక్షల కోట్ల రూపాయలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అప్పుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర బడ్జెట్ పుస్తకాలలోనే కాకుండా కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పును ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పంచారు. తెలంగాణ రాష్ట్ర వాటాకు 69,603 కోట్ల రూపాయల అప్పు వచ్చింది. అటు తరువాత రాష్ట్ర అప్పు, స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అప్పుల వాటా ఎలా పెరిగిపోయిందో చూడండి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం దాకా, ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజున అంటే ప్రతి మార్చి 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు (కోట్ల రూపాయలలో) ఇలా ఉంది (బ్రాకెట్లో ఉన్న అంకె రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు శాతాన్ని సూచిస్తుంది): 2015–79,880 (15.79); 2016– 91,999 (16.95); 2017–1,34,738 (20.44); 2018– 1,65,849 (22.11); 2019– 1,96,963 (22.90); 2020– 2,32,181 (23.77); 2021– 2,78,018 (28.11); 2022– 3,12,191 (27.03). మన వాటాకు 69,603 కోట్ల అప్పు వస్తే, అది మార్చి, 2022 నాటికి రూ.3,12,191 కోట్లకు పెరిగింది! అంటే గత ఎనిమిది సంవత్సరాలో తెలంగాణ రాష్ట్ర అప్పు సుమారు నాలుగున్నర రెట్లు పెరిగింది.

ఈ మధ్య కాలంలో అప్పు పరిమాణం విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ సంస్థల పేరుతో, ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థల పేరుతోనూ తెచ్చిన అప్పును ప్రభుత్వ అప్పుగా లెక్క కట్టాలని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. ఇదే విషయాన్ని రెండేళ్ల క్రితమే కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. ఎఫ్ఆర్‌బిఎం చట్టం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్–2003) ప్రకారం కూడా ప్రభుత్వ జమానతుతో పబ్లిక్ రంగ సంస్థలు, ప్రత్యేక సంస్థలు తెచ్చే అప్పులను ప్రభుత్వ ఋణ ఖాతాలో చూపాలి.

పైగా ప్రభుత్వ పూచీకత్తుతో అప్పు తెచ్చుకున్న ఆయా సంస్థలకు స్వంత ఆదాయం లేదు. వాటికి అప్పు చెల్లించే శక్తి లేదు. ఉదాహరణకు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు కానీ, గొర్రెల, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌కు గానీ స్వంత ఆదాయం లేదు. ఈ సంస్థలు అప్పు కట్టగలిగే స్థితిలో లేవు. ప్రభుత్వమే వాటి అప్పును భరించక తప్పదు. బడ్జెట్ వెలుపల కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులు, కాగ్ నివేదిక ప్రకారం, మార్చి 2021 నాటికి రూ.97,940 కోట్లు వున్నాయి. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర అప్పుల ఖాతాలో జమ చేయవలసిందేనని కాగ్ చెప్పుతున్న మాటను అంగీకరించకతప్పదు. సంస్థల పేరుతో ప్రభుత్వం తెచ్చిన అప్పును కూడా కలిపితే పైన ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పుల కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. బడ్జెట్ వెలుపల తెచ్చిన అప్పులలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో తెచ్చిన అప్పులే మూడు పాళ్ళు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వ జమానతుతో తెచ్చిన అప్పు 36,056 కోట్ల రూపాయలు. మిషన్ భగీరథకు ప్రభుత్వం జమానతు పడి ఇప్పించిన అప్పు 25,006 కోట్ల రూపాయలు.

రాష్ట్రం ఇష్టం వచ్చినంత అప్పు తీసుకోవడానికి వీలు లేదు. ఎఫ్ఆర్‌బిఎం చట్టం ఋణ పరిమితిని తెలియచేస్తున్నది. అదే విధంగా ఫైనాన్స్ కమిషన్ కూడా అప్పులపైన పరిమితి విధించింది. ఎఫ్ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 25శాతం దాటకూడదని నిర్ణయించుకున్నది. ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్ర అప్పు 29.50 శాతం దాటకూడదు. బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లు, స్వతంత్ర ప్రతిపత్తి కల సంస్థల పేరుతోనూ తీసుకున్న అప్పును లెక్క కడితే కాగ్ నివేదిక ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరాంతానికి రాష్ట్ర అప్పు స్థూల ఉత్పత్తిలో 31.29 శాతం అవుతున్నది. 2020–21 సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు నిష్పత్తి 38.10 శాతానికి చేరుకున్నది. ఏ లెక్కన చూసినా రాష్ట్ర ప్రభుత్వం మితిమీరిన అప్పులు చేసింది. ఇక కొత్తగా అప్పులు చేసే అవకాశం అసలే లేదు.

ఇంతకూ దేని కోసం అప్పులు? ద్రవ్య లోటును పూరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగానే అప్పుల మీద ఆధారపడుతున్నది. కొంత రెవెన్యూ మిగులు 2018–19 ఆర్థిక సంవత్సరం దాకా ఉన్నా అది ద్రవ్యలోటును భర్తీ చేయగల స్థాయిలో లేదు. ప్రభుత్వం చూపిన రెవెన్యూ మిగులు వాస్తవికంగా లేదని కాగ్ తప్పు పట్టింది. కాసేపు కాగ్ నివేదికను పక్కన పెట్టి ప్రభుత్వ లెక్కలను అంగీకరించినా, రెవెన్యూ మిగులు పెట్టుబడి వ్యయానికి అవసరమైనంత లేదు. అందుకని అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే 2019–20 నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఒక వైపు కొవిడ్, మరొక వైపు ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నది.

అందువలన 2019–20 సంవత్సరం నుంచి రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు చేయవలసి వస్తున్నది. పైన పేర్కొన్న సంవత్సరంలో చేసిన అప్పునుంచి సుమారు 9721 కోట్ల రూపాయలు రెవెన్యూ ఖర్చుల కోసం ఉపయోగించారు. అటు తరువాత 2020–21 సంవత్సరంలో తెచ్చిన అప్పులో 16,725 కోట్ల రూపాయలను రెవెన్యూ ఖర్చులకు ఉపయోగించారు. నిత్య అవసరాల కోసం ప్రభుత్వం అప్పు చేయడం ప్రమాదకర పరిణామం. మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వం తెచ్చిన అప్పులో 70 శాతం పైన పాత అప్పుల చెల్లింపులకే ఖర్చవుతున్నది. అంటే రూపాయి అప్పు తెస్తే సుమారు 70 పైసలు పాత అప్పుల చెల్లింపులకు ఖర్చు చేసి మిగిలిన 30 పైసలను బడ్జెట్ లోటు పూడ్చడానికి వాడుకుంటున్నాం. పాత అప్పుల చెల్లింపులకు పోను మిగులుతున్న అప్పు చాలా తక్కువ. దానిలో అత్యధిక భాగం రెవెన్యూ ఖర్చులకు పోతే ఇక పెట్టుబడి వ్యయానికి మిగిలేది నామ మాత్రమే. ఈ పరిస్థితి ఇప్పట్లో మారేటట్టు లేదు. రెవెన్యూ ఎదుగుదల రేటు కన్నా ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. తెచ్చిన అప్పులు పాలనా నిర్వహణకు కూడా చాలడం లేదు. ఇక ఇప్పుడు కొత్తగా అప్పులు దొరకక పోతే రోజువారీ ఖర్చులకు కూడా వచ్చే రెవెన్యూ చాలదు. ఈ పరిస్థితి రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులను తీసుకొచ్చింది. జూన్, జూలై నెలల రాబడి, ఖర్చులను చూస్తే విషయాలు అర్థమవుతాయి.

కాగ్ వెబ్ సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం జూన్ నెలలో తెచ్చిన 5,161 కోట్ల రూపాయల అప్పు కలిపితే మొత్తం ఆదాయం 18,150కోట్ల రూపాయలు. సుమారు 4,904 కోట్ల రూపాయల అప్పు తెచ్చిన తరువాత జూలై నెల రెవెన్యూ 16,056 కోట్ల రూపాయలు. అప్పు తెచ్చిన తరువాత కూడా ప్రభుత్వం జూన్, జూలై నెలల్లో ఖర్చు పూరించ లేక పోయింది. జూన్ నెల మొత్తం ఖర్చు 23,208 కోట్ల రూపాయలు కాగా జూలై నెల ఖర్చు 16,160 కోట్ల రూపాయలు. ఈ నేపథ్యంలో అప్పులు దొరకక పోతే ఖర్చులకు ఎంత ఇబ్బంది అవుతుందో ఊహించుకోవచ్చు. ప్రత్యామ్నాయమేమిటి? ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నది. భూముల అమ్మకం అందులో ఒక మార్గం. ఇది కాక ఛార్జీలు, ఫీజులు, జరిమానాలను పెంచింది. ఇవే కాక కేంద్రం నుండి అదనంగా ఆదాయాన్ని సాధించవచ్చు. మరి ఈ ఆదాయాన్ని సాధించడానికి రాష్ట్రం చేసింది శూన్యం.

ఆది నుంచి ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులలో అవినీతి జరుగకపోయి ఉంటే డబ్బు ఆదా అయ్యేది. నిధులను దుర్వినియోగం చేయకుండా విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి ప్రాధాన్య రంగాలలో ఖర్చు చేసి ఉంటే చాలా పురోగతికి అవకాశం ఉండేది. విచ్చలవిడి ఖర్చుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఇక ఇప్పుడు అప్పులు దొరకవు. ఆదాయం పెరుగదు. జన జీవితంలో ఒక సంక్షోభం తలెత్తింది. ఈ సందర్భంలో ప్రజలు పూనుకుంటే తప్ప ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు రావు.

Leave a Reply