దవాఖానా కిటకిట!

0
252
  • జిల్లా ఆసుపత్రుల్లో పడకల కొరత
  • కరోనా కేసులు పెరగడంతో అదనపు ఏర్పాట్లకు కసరత్తు

హైదరాబాద్‌: ప్రభుత్వాసుపత్రులకు కొవిడ్‌ బాధితుల తాకిడి క్రమేణా ఎక్కువవుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలకు పడకలు లభ్యమవడం కష్టతరంగా మారింది. ముఖ్యంగా జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి ఉంది. జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం దీనికి కారణం. వరంగల్‌, కొత్తగూడెం, ఖమ్మం, జోగులాంబ గద్వాల, సిరిసిల్ల తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల కోసం కేటాయించిన పడకలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఐసొలేషన్‌, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు కూడా నిండిపోవడం గమనార్హం. రాష్ట్రంలోని 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల కోసం మొత్తం 7862 పడకలు కేటాయించగా, వీటిల్లో సోమవారం నాటికి 2589 (32.93 శాతం) పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 5273 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో 122 ప్రైవేటు ఆసుపత్రుల్లో 8101 పడకలు అందుబాటులో ఉండగా.. వీటిల్లో 4295 (53 శాతం) పడకల్లో రోగులకు సేవలందిస్తున్నారు. మరో 3806 పడకలు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పడకలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, రోగుల తాకిడి అధికమైన కొన్ని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో మాత్రం పడకలు ఖాళీ లేవు.

వరంగల్‌లో సమస్య మంత్రుల దృష్టికి…
వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్‌ పడకల కొరత సమస్యగా మారిందనే అంశం.. మంగళవారం ఆ నగర పర్యటనలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి రావడంతో.. వారు తక్షణమే 150 పడకలను అదనంగా ఏర్పాటు చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. పడకల కొరత నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో అదనపు పడకలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంజీఎం సహా రాష్ట్రంలోని ఇంకా ఏయే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరత ఉందనే అంశంపై ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. అదనపు పడకలు, ఆక్సిజన్‌ పైపులైన్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

ఎక్కడ చూసినా…
* వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో 255 పడకలను కొవిడ్‌ కోసం కేటాయించారు. వీటిలో 150 ఆక్సిజన్‌ పడకలు, 105 ఐసీయూ పడకలుండగా.. అన్నిట్లోనూ కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒకసారి చేరిన బాధితులు కనీసం 7-10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. నిత్యం వరంగల్‌ నగర, గ్రామీణ జిల్లాల్లో నమోదవుతున్న కేసులను కలిపితే, సుమారు 130-150 వరకూ ఉంటున్నాయి. వీరిలో కనీసం 15 శాతం మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి వచ్చినా.. రోజుకు సుమారు 20-25 మంది కొత్త బాధితులకు పడకలు అవసరమవుతాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వ వైద్యంలోనూ పడకలు లభించని దుస్థితి నెలకొంది. ఎంజీఎం ఆసుపత్రిలో స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉండడంతో ములుగు, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి కూడా బాధితులు చికిత్స కోసం వస్తుంటారు. దీంతో బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితి కొన్ని ఇతర జిల్లాల్లోనూ కనిపిస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, అదనపు పడకలు, ఆక్సిజన్‌ పైపులైన్ల ఏర్పాటుపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

వైద్య ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం సోమవారం నాటి గణాంకాలిలా..
*  కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలోని నాలుగు ఐసీయూ సహా మొత్తం 24 పడకలూ రోగులతో నిండిపోయాయి.
*  జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రిలో 38 ఆక్సిజన్‌ పడకలు, 5 ఐసీయూ పడకలుండగా.. అన్నిటా రోగులు సేవలు పొందుతున్నారు.
*  ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మొత్తం 240 కొవిడ్‌ పడకల్లో 181 నిండిపోయాయి. ఇందులో 70 ఐసొలేషన్‌ పడకలుండగా.. అన్నింటిలోనూ రోగులున్నారు. ఆక్సిజన్‌ పడకలు కూడా 120 ఉంటే.. 111 పడకల్లో సేవలు పొందుతున్నారు. అయితే 50 ఐసీయూ పడకలు మాత్రం ఇక్కడ ఖాళీగానే ఉన్నాయి.
*  మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలో 65 ఆక్సిజన్‌ పడకలుంటే.. ఇందులో 54 పడకల్లో రోగులున్నారు.
*  నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 21 పడకలుంటే.. 13 ఐసొలేషన్‌ పడకలు, 7 ఐసీయూ పడకలుండగా.. 20 నిండిపోయాయి. ఒక్క ఐసీయూ పడక మాత్రమే అందుబాటులో ఉంది.
*  నల్గొండ జిల్లా ఆసుపత్రిలోనూ మొత్తం 35 ఆక్సిజన్‌ పడకలుంటే అన్నింటిలోనూ రోగులు సేవలు పొందుతున్నారు. 25 ఐసీయూ పడకలుంటే 14 నిండిపోయాయి.
*  సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 40 ఆక్సిజన్‌ పడకలకు గాను.. అన్నింటిలోనూ రోగులతో కిటకిటలాడుతున్నాయి. 20 ఐసీయూ పడకల్లో 16 పడకల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. కేవలం నాలుగు ఐసీయూ పడకలు మాత్రమే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఐసొలేషన్‌ పడకలే లేవు.
*  సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 18 ఐసొలేషన్‌ పడకలు, 22 ఆక్సిజన్‌ పడకలు, 10 ఐసీయూ పడకలుండగా.. అన్నీ నిండిపోయాయి.
*  గాంధీ ఆసుపత్రిలోనూ 500 ఐసీయూ పడకలుంటే.. అన్ని పడకల్లోనూ రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ ఆక్సిజన్‌ పడకలు, ఐసొలేషన్‌ పడకలు మాత్రం ఖాళీగానే ఉన్నాయి.

Courtesy Eenadu

Leave a Reply