తాళిబొట్లు గిరివి పెట్టి రుణాలు

0
228

– రుణమాఫీ, రైతుబంధు అందనివారిపై అధిక భారాలు
– ఉమ్మడి మహబూబ్‌నగర్‌ రైతుల గోస

దేశానికి అన్నంపెట్టే రైతన్నలు అడుగడుగునా అవస్థలు పడుతున్నారు. కష్టం వచ్చినా.. నష్టం చవిచూసినా.. నేలతల్లినే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతుకు ప్రతి ఏడాది పెట్టుబడి భారంగా మారుతోంది. రుణాలిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం మార్గదర్శకాలతో కాలయాపన చేస్తోంది. ఖరీఫ్‌ ప్రారంభమైనా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీపై స్పష్టత లేకపోవడం, రైతుబంధు ఇవ్వకపోవడంతో రైతులు కలవరపడుతున్నారు. పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో ఇకచేసేదిలేక దాదాపు 2లక్షల మంది రైతులు బ్యాంకుల్లో అధిక వడ్డీకి బంగారాన్ని, తాళిబొట్లను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చారు. మరి కొందరైతే రూ.3 ఆపై వడ్డీలైనా అప్పు చేసి ముందుకు ‘సాగు’తున్నారు.

అన్నదాత పరిస్థితి రోజురోజుకూ దిగజారు తున్నది. ముందు పెట్టుబడి కోసం కష్టాలు వెంటాడితే.. పంట చేతికొచ్చాక.. దళారుల మోసాల్లో రైతుల బతుకులు దయనీయంగా మారుతున్నాయి. పాలమూరుజిల్లా అనగానే కరువు..కాటాకాలు కం డ్లకు కనిపిస్తాయి. ఇపుడు సేద్యానికి అవసరమైన పైసలకోసం ఎంతో పవిత్రంగా భావించే తాళి బొట్లను గిరివిపెట్టక తప్పటంలేదు. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8,73,631మంది రైతులున్నారు. వీరిలో 53,815 మందికి ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు లేవు. మరో 55,042 మంది కొత్తగా పట్టాలు పొందారు. ఖాతాలు లేనివారితో పాటు కొత్తగా పాసుపు స్తకాలు పొందినవారికి రుణమాఫీ కాదు.. రైతుబంధు రాదు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించి కొత్తగా రైతుబంధుకి అప్లై చేసుకోవాలి. దీనికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇలా లక్ష మంది రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న పరిస్థితి. వారితో పాటు ఉమ్మడి జిల్లాలో రుణాలు పొందిన రైతులుందరికీ ఖరీఫ్‌లో రుణాలందని పరిస్థితి. బ్యాంకులకు ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శ కాలు ఇవ్వకపోవడమే దీనికి కారణం. అంతేకాకుండా పాత రుణాలు మాఫీ కాకుండా కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సుముఖంగా లేవు.

సాగుకోసం పడరాని పాట్లు
ఉమ్మడి జిల్లా రైతులు గతంలో తీసుకున్న రుణాలు రూ.2,600ల కోట్లకు పైగా ఉన్నాయి. వీటిని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులెవ్వరూ రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకులు కొత్త రుణాలూ ఇవ్వడం లేదు. ఖరీఫ్‌ రైతుబంధు కూడా ఇప్పటివరకు అందలేదు. ఓ పక్క వర్షాలు పడి నేల అదునవ్వడంతో రైతులు పత్తి విత్తనాలు సాగు చేసే పనిలో పడ్డారు. విత్తనాలు కొనుగోలు చేయడానికి వడ్డీ వ్యాపారులను, విత్తన ఏజెన్సీలను ఆశ్రయిస్తున్న పరిస్థితి. వడ్డీ వ్యాపారులు రూ.3లు మిత్తి వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. బంగారం రుణాలపై వడ్డీ రాయితీ రద్దుని కేంద్ర ప్రభుత్వం గతేడాది రద్దు చేసింది. అయినా రైతులు పెట్టుబడులకు డబ్బుల్లేకపోవడంతో అధిక వడ్డీ అయినా బ్యాంకుల్లోనే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటున్నారు. కొందరైతే ‘తాళి’ని సైతం తాకట్టుపెట్టి పెట్టుబడులు పెట్టారు. ఇలా జిల్లాల్లో 2 లక్షలకు పైగా రైతులు తాకట్టు పెట్టారు. అయినా ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతులను ఇంకా కష్టాల్లోకే నెట్టడం తగదని రైతు సంఘాలు అంటున్నాయి.

రైతులకు సకాలంలో రుణాలివ్వాలి.. సి.బాల్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, నాగర్‌కర్నూల్‌
ఖరీఫ్‌ పంటలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అనేక చోట్ల వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. విత్తనాలు కేజీ రూ.1500లకు అమ్ముతున్నారు. ఎరువుల ధరలూ బాగా పెరిగాయి. గతం కంటే ఈసారి కరోనా కారణంగా పెట్టుబడి మూడు రెట్లు అధికమయింది. అందుకే రుణమాఫీతో సంబంధం లేకుండా వెంటనే పంట రుణాలిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతుబంధు సహాయం కూడా వెంటనే అందజేస్తే రైతులకు కాస్త ఊరటగా ఉంటుంది.

రూ.3ల వడ్డీకి అప్పు తెచ్చి సాగు..
బ్యాంకులో రుణం కోసం వెళితే తమకు ఇంకా రుణాలకు సంబంధించి మార్గదర్శకాలు రాలేదని అధికారులు చెప్పారు. ఏం చేయాలో తెలియక అదును దాటుతుందని వ్యాపారి దగ్గర రూ.3ల వడ్డీ చొప్పున అప్పు తీసుకుని పొలాలు సాగు చేసుకున్నాము.

తాకట్టు పెట్టి అప్పు తెచ్చా..
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. కరోనా కారణంగా ఎలాంటి పనుల్లేకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రుణమాఫీ ఏమైందో తెలియదు. మాఫీ కానిదే కొత్త రుణా లివ్వమని బ్యాంకు అధికారులు చెప్పారు. రైతు బంధు డబ్బులు రాకపోవడంతో నాభార్య తాళి బొట్టు తాకట్టుపెట్టి మరీ అప్పు తెచ్చాను.
– ఎరుకలి లక్ష్మయ్య, నడిగడ్డ గ్రామం, తెలకపల్లి మండలం

Courtesy Nava Telangana

Leave a Reply