తెలంగాణ సర్కారుపై ఆగ్రహం

0
295

కరోనా పరీక్షలపై నిర్లక్క్ష్యంగా వ్యవహరించి తమ ఆదేశాలు పాటించనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సోమవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్: కరోనా నిర్ధారిత పరీక్షలపై తమ ఆదేశాలు అమలు కావడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. ఆస్పత్రుల్లో రోగులు చనిపోతే మృతదేహాలకు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయాలన్న ఆదేశాలనూ ఎందుకు పెడచెవిన పెడుతున్నారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని.. విచారణ జరగాల్సి ఉందని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ధర్మాసనానికి నివేదించారు. సుప్రీంకోర్టు విచారణ జరిగే వరకు తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. కరోనా ర్యాండమ్ టెస్టులు చేయకపోవడం పట్ల కోర్టు మండిపడింది. వ్యక్తిగత రక్షణ కిట్లు(పీపీఈ) సరిపడా సరఫరా చేయనందువల్లే వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని హైకోర్టు బెంచ్‌ అభిప్రాయపడింది.

మీడియాకు విడుదల చేస్తున్న హెల్త్‌ బులెటిన్లలో తప్పుడు సమాచారం ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసింది. వాస్తవాలు వెల్లడించకుంటే ప్రజలకు కరోనా వ్యాధి తీవ్రత ఎలా తెలుస్తుందని నిలదీసింది. ఈనెల 17లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈనెల 17న ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, డైరెక్టర్ శ్రీనివాసరావు తమ ఎదుట హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

Leave a Reply