ఏడేండ్లలో రూ. 4 లక్షల కోట్ల అప్పులు

0
595
  • అన్నీఅప్పులే
  • ఏడేండ్లలో రూ. 4 లక్షల కోట్ల బాకీలు
  • ఎఫ్​ఆర్​బీఎం చట్టం పరిధిలోనే  2.86 లక్షల కోట్లు
  • కార్పొరేషన్ల ద్వారా మరో లక్షా 20 వేల కోట్లు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్‌‌లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. చేసిన అప్పులతో ప్రజల జీవితాలు ఏమైనా మెరుగపడ్డాయా అంటే అదీ లేదు. తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చే నాటికి రూ. 69,517 కోట్ల అప్పులు ఉంటే ఏడేండ్లలో అవి రూ. 4 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎఫ్‌‌ఆర్‌‌బీఎం చట్ట పరిధిలో తీసుకున్న అప్పులే రూ. 2.86 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. ఈ మొత్తం వార్షిక బడ్జెట్‌‌ కన్నా రూ. 50 వేల కోట్లు అదనం. ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు, మిషన్‌‌ భగీరథ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్పొరేషన్‌‌ల ద్వారా తెచ్చిన అప్పులను ఎక్కడా అధికారికంగా చూపించడం లేదు. అయితే ఇవి దాదాపు మరో 1.20 లక్షల కోట్ల వరకు ఉంటాయి. ఇన్ని అప్పులు చేసినా ఇంకా అప్పులు తేవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. ఎఫ్‌‌ఆర్‌‌బీఎం పరిమితిని పెంచాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. కరోనా కారణంగా ఆదాయం కోల్పోయామని, అప్పులు తేవడం తప్ప మరో దిక్కు లేదని చెప్తోంది.

రెవెన్యూ మిగులు నుంచి..
తెలంగాణ వ‌‌చ్చిన మూడేండ్లలోనే  స‌‌ర్కార్ ప్రణాళిక లోపం, ఇష్టారీతి ఖ‌‌ర్చుల వల్ల ఆర్థిక పరిస్థితి త‌‌ల‌‌కిందులైంది. 2014 జూన్ 2న రెవెన్యూ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఆ మిగులు ఆ ఒక్క ఏడాది చెప్పుకోవడానికే సరిపోయింది. క్రమంగా మిగులు నుంచి రెవెన్యూ లోటులోకి వెళ్లిపోయింది. నిరుడు రూ. 16 వేల కోట్లు లోటులో ఉన్నట్లు ప్రభుత్వమే ఒప్పుకుంది. అంతకు ముందుటేడాది రూ. 6,254 కోట్లు లోటులో ఉంది. ఇలా మిగులులో ఉన్న రాష్ట్రం లోటులోకి వెళ్లడమే కాకుండా, పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పైగా తెలంగాణ ప్రభుత్వం చూపెట్టిన కొన్ని మిగులు బడ్జెట్లు తప్పుడు లెక్కలని 15వ ఆర్థిక సంఘం, పే రివిజన్ కమిషన్, కాగ్ వేలెత్తిచూపాయి. ఇష్టారాజ్యంగా, తలకు మించిన అప్పులు తెలంగాణ చేస్తోందని, ఆర్థిక క్రమశిక్షణ పాటిచండం లేదని 15వ ఆర్థిక సంఘం తీవ్రంగా తప్పు పట్టింది. అలాగే రెవెన్యూ మిగులుపై తప్పుడు లెక్కలు చూపారని  తెలిపింది. ఉదాహరణగా 2016–17లో రెవెన్యూ మిగులు రూ. 1,386 కోట్లే అయినా.. తప్పుడు లెక్కల ద్వారా దాన్ని రూ. 6,778 కోట్లుగా చూపించారని బట్టబయలు చేసింది.

చాన్స్​ దొరికితే అప్పు చేసుడే
అవకాశం​ దొరికితే చాలు రాష్ట్ర సర్కారు అప్పులు చేస్తోంది. నిరుడు కరోనా, లాక్‌‌డౌన్‌‌తో ఎఫ్‌‌ఆర్‌‌బీఎం పరిమితిని కేంద్రం పెంచడంతో ఇదే చాన్స్‌‌గా భావించి రూ. 45 వేల కోట్లకు పైగా లోన్లు తీసుకుంది. అప్పులను ఓపెన్‌‌ మార్కెట్‌‌ నుంచే సర్కారు సేకరిస్తోంది. ఈ ఏడాది ఓపెన్‌‌ మార్కెట్‌‌ నుంచి రూ. 47 వేల కోట్లు, కేంద్రం, ఇతర సంస్థల నుంచి ఇంకో రెండు వేల కోట్ల అప్పులు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు, డబుల్‌‌ బెడ్రూం ఇండ్లకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్న వాటి ఫలితాలు కనిపించడం లేదని కాగ్‌‌, 15వ ఆర్థిక సంఘం తేల్చిచెప్పాయి.

ఒక్కొక్కరిపై రూ. 81 వేల అప్పు
ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు తెస్తూ ప్రజలపై భారాన్ని మోపుతోంది. ఎఫ్‌‌ఆర్‌‌బీఎం చట్టం పరిధిలో తీసుకున్న అప్పులనే లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ. 81,944  దాకా అప్పు ఉంది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది రూ. 11 వేలు పెరిగింది. కార్పొరేషన్ల కింద తీసుకున్న అప్పులను లెక్కలోకి తీసుకుంటే ప్రతి ఒక్కరిపై రూ. 1.25 లక్షల వరకు అప్పుల భారం పడుతోంది. నిబంధనల ప్రకారం అప్పు జీఎస్‌‌డీపీలో 25 శాతానికి మించొద్దు. గతేడాది అప్పుల పరిమితి 25.07% ఉన్నట్టు ప్రభుత్వమే ఒప్పుకుంది. చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం భారీగానే ఉంది. ఏడేండ్లలో వడ్డీల కోసం రూ.75 వేల కోట్లు చెల్లించింది. ఈ ఏడాది రూ. 17,584 కోట్లు చెల్సించాల్సి ఉంది. అంటే మొత్తం కలిపి రూ.92 వేల కోట్ల పైమాటే. ఈ ఆర్థిక సంవత్సరంలో లోన్‌‌ ఇన్‌‌స్టాల్‌‌మెంట్లు, ఇంట్రస్ట్‌‌  కలిపి రూ. 33 వేల కోట్లు చెల్లించాలి.

Courtesy V6velugu

Leave a Reply