టెస్టులు కొన్నే

0
223
 • కొన్ని పీహెచ్‌సీల్లో రోజుకు పాతికే
 • ఆధార్‌లో స్థానిక చిరునామా ఉంటేనే!
 • పరీక్షలు చేయడానికి టోకెన్‌ విధానం
 • తెల్లవారుజాము నుంచే భారీ క్యూలు
 • కొన్నిచోట్ల 2-3 రోజులకొకసారి టెస్టు
 • రాజకీయ సిఫారసు ఉంటేనే పరీక్షలు
 • యాంటీజెన్‌ కిట్ల కొరతే ప్రధాన కారణం!
 • ప్రజారోగ్య కేంద్రాల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లేరీ?
 • ఆధార్‌లో అడ్రస్‌ మార్చేదెలా?.. ప్రజల ఆగ్రహం

కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టే ప్రధాన మార్గం.. టెస్ట్‌, ట్రీట్‌, ట్రేస్‌. అంటే, అనుమానితులకు పరీక్షలు చేయడం. పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స చేయడం. వారితో సన్నిహితంగా మెలిగినవారిని వెతికి పట్టుకుని వారికి పరీక్షలు, చికిత్స చేయడం. ఇది నిరంతరం జరిగితే వ్యాప్తిని విజయవంతంగా అరికట్టొచ్చు. కానీ.. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య ఇంకా పరిమితంగానే ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పరీక్షల్లో 75 శాతం యాంటీజెన్‌ పరీక్షలు కాగా.. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు కేవలం 25 శాతమే. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వస్తుండడంతో యాంటీజెన్‌ పరీక్షల సంఖ్యను సర్కారు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల యాంటీ జెన్‌ టెస్టులు చేయాలని నిర్ణయించగా, అందులో 4 లక్షల కిట్లు ఇప్పటికే తెప్పించారు.

మరో లక్ష కిట్లకు ఇండెంట్‌ పెట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు అవి సరిపోవట్లేదు. చాలా మంది ప్రజలు కరోనా పరీక్షలకు ముందుకు వస్తుండడంతో టెస్టింగ్‌ కేంద్రాల్లో టోకెన్ల విధానం అమలు చేస్తున్నారు. రోజుకు 25 నుంచి 50 దాకా టోకెన్లు ఇస్తున్నారు. ఆ టోకెన్‌ దక్కితేనే పరీక్ష. లేకపోతే మరుసటి రోజు రావాల్సిన పరిస్థితి. దురదృష్టం కొద్దీ కరోనా సోకినవారికి ఇలా 2-3 రోజులపాటు టోకెన్‌ అందకపోతే.. పరీక్ష చేయించుకునేలోగా వారి ద్వారా ఇంకెంత మందికి వైరస్‌ సోకుతుందో తెలియని పరిస్థితి. ఈ ఆలస్యం వల్ల పరిస్థితి విషమించి, కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. కొన్నిచోట్ల కరోనా టెస్టింగ్‌ టోకెన్లు బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారు.

సంగారెడ్డిలోని కొన్ని టెస్టింగ్‌ కేంద్రాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తుండగా.. వైద్య ఆరోగ్యశాఖ ఆ స్థాయిలో యాంటీజెన్‌  కిట్లను విస్తృతంగా జిల్లాలకు పంపిణీ చేయలేదు. చాలా పరిమితంగానే పంపింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో 15 రోజుల నుంచీ భారీగా కేసులు వస్తున్నాయి. టోకెన్లు చాలా తక్కువగా ఇస్తుండడంతో.. తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూల్లో ఉంటున్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో యాంటీజెన్‌ టెస్టుల కోసం ఇలా తెల్లవారు జాము నుంచే క్యూలో ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి.

అడ్రస్‌ కష్టాలు..
కొవిడ్‌ పరీక్షల కోసం వచ్చేవారి నుంచి ఆధార్‌ను తప్పనిసరిగా తీసుకుంటున్నారు. అందులో స్థానిక చిరునామా ఉంటేనే పరీక్ష చేస్తున్నారు. లేకపోతే ఆధార్‌లో ఏ చిరునామా ఉందో అక్కడికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలంటూ పంపేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే చాలామంది ఆధార్‌ కార్డుల్లో.. వారు ఆ కార్డు తీసుకున్నప్పటి చిరునామా ఉంటుంది. నగరాల్లో అత్యధిక జనాభా అద్దె ఇళ్లల్లో ఉండేవారే. వారి ఆధార్‌ కార్డుల్లో అడ్ర్‌సకు, ఇప్పుడు ఉంటున్న చోటుకు సంబంధం ఉండదు. ఆర్‌టీ-పీసీఆర్‌, యాంటీజెన్‌.. అన్నీ కలిపి జూలై 30న రాష్ట్రవ్యాప్తంగా 21,380 పరీక్షలు చేశారు. ఆ రోజు ప్రైవేటులో 1910 ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు  చేయగా.. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో 3200 టెస్టులు చేశారు.

మిగిలినవన్నీ యాంటీజెన్‌ టెస్టులే. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో యాంటీజెన్‌ టెస్టుల కోసం నమూనాలు సేకరిస్తున్నారు. అంటే ఆ 320 కేంద్రాల్లో సగటున చేసిన టెస్టులు 50. అంతకు ముందు సగటున 30లోపే జరిగేవి. కొన్ని జిల్లాల్లో రాజకీయ నాయకుల సిఫారసు ఉంటే తప్ప పరీక్షలు జరగని పరిస్థితి. అది కూడా స్థానిక అధికారపార్టీ నేతలు రికమెండ్‌ చేస్తేనే! కొన్ని పరీక్షా కేంద్రాల్లో రోజూ టెస్టులు చేయడం లేదు. రెండు మూడు రోజులకొకమారు చేస్తున్నారు. గర్భిణులకు హెల్త్‌ చెకప్‌, ఇమ్యూనైజేషన్‌ వంటి కార్యక్రమాల వల్ల చేయట్లేదని  పీహెచ్‌సీల వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు.. చాలా పీహెచ్‌సీల్లో ల్యాబ్‌ టెక్నిషీయన్స్‌ కొరత ఉంది. అలాంటి చోట్ల నర్సులు, వైద్యులే స్వాబ్‌ తీస్తున్నారు. కానీ, వారికి అవసరమైనన్ని పీపీఈ కిట్లు ఇవ్వట్లేదు.

జిల్లాల్లో పరిస్థితి ఇలా…

 1. నిర్మల్‌లో పరీక్షలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ప్రైమరీ కాంటాక్టులకు టెస్టులు చేయట్లేదు. రాజకీయ నాయకుల సిపారుసు ఉంటేనే టెస్టు చేస్తున్నారు.
 2. ఆసిపాబాద్‌లో పరిమితంగా యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్నారు.
 3. వికారాబాద్‌ జిల్లా ఆస్పత్రికి 500, ఏరియా ఆస్పత్రికి 250, పీహెచ్‌సీలకు 25 చొప్పున కిట్లు ఇచ్చారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో రోజుకు సగటున ఇద్దరికి మించి టెస్టులు చేయట్లేదు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో 10 మందికి పరీక్ష చేస్తే వారిలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.
 4. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కిట్ల కొరత తీవ్రంగా ఉంది. రోజుకు 150 టెస్టులు చేస్తుండగా అందులో 40-50 శాతం పాజిటివ్‌లు వస్తున్నాయి. పీహెచ్‌సీల్లో ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత ఉంది. మెదక్‌లో సిఫారసు ఉంటేనే పరీక్షలు చేస్తున్నారు.
 5. సూర్యాపేట జనరల్‌, ఏరియా ఆస్పత్రిలో గత పదిరోజుల్లో 1032 మందికి పరీక్షలు చేస్తే అందులో 252 మందికి పాజిటివ్‌ వచ్చింది.
 6. ఖమ్మం జిల్లాలోని ఒక్కో పీహెచ్‌సీకీకేవలం 25 కిట్లే ఇచ్చారు. టెస్టులు కావాలంటే ఇక్కడ అనేక షరతులు పెడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉంటేనే పరీక్షలు చేస్తామని వైద్య సిబ్బంది చెబుతుండటంతో చాలామంది తిరిగిపోతున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్లకు పీపీఈ కిట్లు ఇవ్వకపోవడంతో అరకొరగా నమూనాల సేకరణ చేస్తున్నారు.
 7. మేడ్చల్‌ జిల్లాలోని బస్తీ దవాఖానల్లో వైద్యులే అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. తమకు కనీసం పీపీఈ కిట్లు కూడా ఇవ్వట్లేదని వారు వాపోతున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply