రెవె న్యూ గందరగోళం

0
200
రెవె న్యూ గందరగోళం

Image result for రెవె న్యూ గందరగోళం\"– కొత్తచట్టం, సంస్కరణల చుట్టూ ప్రచారం
– ఆయోమయంలో ఉద్యోగులు
– విజయారెడ్డి సజీవదహనంతో ఉలిక్కిపాటు

రెవెన్యూ శాఖలో ఏడాదంతా గందరగోళమే నెలకొంది. ధరణి వెబ్‌సైట్‌ ఆ శాఖ ఉద్యోగులకు కొరకరాని కొయ్యలా మారింది. మరోవైపు రియల్‌ బూమ్‌తో భూముల ధరలకు రెక్కలొచ్చి ఏండ్లపడాంతరం పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పుట్టుకొచ్చాయి. ధరణి వెబ్‌సైట్‌ లోపాలు…భూ వివాదాల పరిష్కార జాప్యాలతో ఆ శాఖపై ప్రజల్లో అసహనం రెట్టింపు అయింది. రేయింబవళ్లు కష్టపడి భూ ప్రక్షాళణ పూర్తిచేశారని కొనియాడి ఒక నెల జీతం బోనస్‌ ఇచ్చిన సీఎం… ఆ తర్వాత ఎదురుదాడికి దిగారు. ”రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువైంది..మూడెకరాలను ఏడెకరాలు చేయగలరు..ఒకరి భూములను మరొకరి పేర మార్చగల ఘనులు” అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. మంత్రులు అలాంటి వ్యాఖ్యలే చేయటంతో పరిస్థితి పుండుమీద కారం చల్లనట్టయింది. ఉద్యోగులందరూ ఆందోళన బాట పట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విభజించు…పాలించు సూత్రాన్ని తెరపైకి తెచ్చి రెవెన్యూ ఉద్యోగులను నిలువునా చీల్చింది. ఓ సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నది.

ఆత్మహత్యలు…సజీవ దహనాలు
ఎన్నికల ప్రక్రియలో వేరే ప్రాంతాలకు బదిలీ అయిన రెవెన్యూ ఉద్యోగులను సొంత స్థానాలకు పంపించడంలో రాష్ట్ర సర్కారు తీవ్ర జాప్యాన్ని ప్రదర్శించింది. దీంతో పనిభారం, మానసిక ఒత్తిళ్లను తాళలేక కొందరు, గుండెపోటుకు గురై మరికొందరు..ఇలా 70 నుంచి 80 మంది ఉద్యోగులు చనిపోయారు. నల్లగొండ జిల్లాలో వీఆర్‌ఓ కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి దూరమై తీవ్ర మానసిక ఒత్తిడి లోనైన నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ జ్వాలా గిరిధర్‌రావు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటన యావత్‌ తెలంగాణ ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఘటన వెనుక రాజకీయ నేతల ఒత్తిడి, హస్తం ఉందనే ప్రచారం ఆందోళన కలిగించేదే. విజయారెడ్డి హత్య తర్వాత వెంటనే సర్కారులో చలనం మొదలైంది. రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది. తహశీల్‌ కార్యాలయాలకు పోలీసుల భద్రత కల్పిస్తూ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రద్దు..కొత్తచట్టం…అంతా గందరగోళం
పూర్తిగా రెవెన్యూ శాఖను రద్దు చేస్తారనీ, ఉద్యోగులను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. రెవెన్యూ శాఖ, కలెక్టర్‌ పేరును మారుస్తారనే చర్చా నడిసింది. ఇప్పుడున్న చట్టం లొసుగులతో ఉన్నదనీ కొత్తచట్టాన్ని వచ్చే అసెంబీ సమావేశాల్లోగా తెచ్చితీరుతామనీ సీఎం కేసీఆర్‌ ప్రకటించినా పట్టాలెక్కలేదు. తమకు రెవెన్యూశాఖపై శిక్షణ ఇవ్వాలనీ, వర్క్‌ టూల్‌ రూల్‌ పాటించి పనిభారాన్ని తగ్గించాలనీ, ఇతర శాఖల విధులను అప్పగించొద్దనీ రెవెన్యూ ఉద్యోగులు ఏడాదికాలంగా డిమాండ్‌ చేస్తున్నా ఒక్కటీ నెరవేరలేదు.

(Courtesy Nava Telangana)

Leave a Reply