నష్టం భరిస్తేనే లాభం!

0
259
  • ఆర్టీసీలో సర్కారు సరికొత్త విధానం.. ప్యాకేజీగా ఒక లాభసాటి, ఒక నష్టజాతక రూటు
  • ప్రైవేట్‌, ఆర్టీసీకి రూట్ల పంపకంపై కసరత్తు
  • టీఎస్‌ఆర్టీసీలో 5,100 ప్రైవేటు బస్సులకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది! ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వెంటనే అధికార యంత్రాంగం కొత్త విధానానికి రూపకల్పన చేస్తోంది. నష్టాలను పంచుకుంటేనే లాభాలు వచ్చే రూట్లల్లో బస్సులు తిరగడానికి ప్రైవేట్‌ వారికి అవకాశం ఇచ్చేలా దీనిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. లాభసాటి రూట్లలో బస్సులను నడపడం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని నష్టం వచ్చే రూట్లలో తిరిగే బస్సులపై ఖర్చు చేసేలా కొత్త పాలసీని తీసుకు రానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నష్టం వచ్చే రూట్లలో బస్సులను నడిపించడానికి ఏ ప్రైవేట్‌ కాంట్రాక్టరు ముందుకురాడు. అదే జరిగితే.. సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా, పల్లెలు, చిన్న రూట్లలో బస్సులు తిప్పడానికి ప్రైవేట్‌ సంస్థలు ముందుకురావు. అప్పుడు, వాటిలో ఎప్పట్లా ఆర్టీసీ బస్సులనే తిప్పాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లనుంది. అందుకే, తాజా విధానంలో కొన్ని నిబంధనలను విధించాలని భావిస్తున్నాం అని వివరించాయి. ఆయా రూట్లలో ప్రైవేట్‌ బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ నోటిఫై చేయడానికి ముందే ప్యాకేజీలుగా రూట్లను విభజించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపాయి. అధిక లాభం వచ్చే ఒక రూట్‌ను, నష్టం వచ్చే మరో రూట్‌ను కలిపి ఒక ప్యాకేజీగా నిర్ణయించే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ ప్యాకేజీ పరిధిలో అనుమతించే బస్సుల్లో నిర్దేశించిన సంఖ్యలో కచ్చితంగా నష్టం వచ్చే రూట్లలో కూడా తిరగాల్సి ఉంటుంది. పైగా, నష్టం వచ్చే రూట్లలో ఎన్ని బస్సులు, ఎన్ని ట్రిప్పులు తిరగాలనే విషయాన్ని కూడా ముందుగానే స్పష్టం చేసే అవకాశం ఉంది.

లాంగ్‌ రూటే లాభదాయకం….టీఎ్‌సఆర్టీసీలో లాంగ్‌ రూట్లే లాభదాయకంగా ఉన్నాయి. చిన్న రూట్లలో బస్సులను నడిపించడం ద్వారా నష్టం వస్తోందని తేల్చారు. పల్లె ప్రాంతాల్లో తిరిగే బస్సులపైనా నష్టం వస్తున్నట్టు లెక్కలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎ్‌సఆర్టీసీకి 3,726 రూట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ నష్టాల్లోనే నడుస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే, హైదరాబాద్‌లో తిరిగే బస్సులపై కూడా తీవ్ర నష్టాలు వస్తున్నాయి. అదే సమయంలో, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, ముంబై వంటి అంతర్రాష్ట్ర రూట్లతోపాటు రాష్ట్రంలోని లాంగ్‌ రూట్లలో లాభాలు వస్తున్నాయని తేల్చారు.

జూ ఆదిలాబాద్‌ జిల్లా భైంసా బస్‌ డిపో పరిధిలో మొత్తం 36 రూట్లు ఉన్నాయి. వీటిలో 12 లాభాలతో ఉండగా మిగతా 24 నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రధానంగా, హైదరాబాద్‌, నిజామాబాద్‌, గుంటూరు, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర రూట్లతోపాటు అంతర్రాష్ట్ర రూట్లు నాందేడ్‌, ధర్మాబాద్‌, అప్పారావుపేట్‌రూట్లు అధిక లాభాలతో కొనసాగుతున్నాయి. గ్రామీణ రూట్లు నష్టాల్లో నడుస్తున్నాయి.

జూ వనపర్తి నుంచి హైదరాబాద్‌, కర్నూల్‌, ఆత్మకూర్‌, గద్వాల, మహబూబ్‌నగర్‌, విజయవాడ, యాదగిరిగుట్ట వంటి రూట్లు లాభదాయకంగా ఉన్నాయి. యాదగిరిగుట్ట నుంచి కర్నూల్‌, విజయవాడ వంటి ప్రాంతాలకు నడిపే బస్సులు లాభాలు తెస్తున్నాయి.

  • మంచిర్యాల జిల్లాలో మొత్తం 26 రూట్లు ఉన్నాయి. వీటిలో పల్లె వెలుగు నడిచే 14 రూట్లలో నష్టాలే.
  • కొత్తగూడెం డిపో పరిధిలో మొత్తం 32 రూట్లు ఉంటే.. హైదరాబాద్‌, విజయవాడ, ఖమ్మం, ఇల్లందు, మర్కోడు, బంగారు చిలక వంటి 7 రూట్లలో లాభాలు వస్తున్నాయి. మిగిలినవన్నీ నష్టజాతక రూట్లే.
  • మెదక్‌ డిపో పరిధిలో మొత్తం 28 రూట్లు ఉండగా, తూప్రాన్‌ వయా సికింద్రాబాద్‌ రూట్‌లోనే లాభాలు వస్తుంటాయి.

గ్రేటర్‌లో రోజుకు కోటికిపైనే..గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 3,567 బస్సులు 45 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. రోజూ సుమారు 33 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీకి వస్తున్న నష్టాల్లో 40 శాతం గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ నుంచే! రోజూ బస్సులను నడిపేందుకు రూ.4.50 కోట్ల ఖర్చవుతోంది. వచ్చే ఆదాయం రూ.3.25 కోట్లు. రోజూ రూ.1.25 కోట్లు నష్టం వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్‌ రూట్లను ఎలా కేటాయింపులు చేస్తారన్న అంశం ప్రశ్నార్థకంగా ఉంది.

Courtesy Andhrajyothi..

Leave a Reply