అప్పులు 4 లక్షల కోట్లు

0
713

హైదరాబాద్ :  రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం  ఇంచుమించు రూ. 4 లక్షల కోట్లకు చేరుకుంది. వీటికి కట్టే కిస్తీలు, మిత్తీలకే  బడ్జెట్లో రూ. 40 వేల కోట్లు కేటాయించారు. ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి నాటికి రూ. 2,86,804 కోట్లకు చేరనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర బడ్జెట్లోనే ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించింది. దీనికి తోడు ఇరిగేషన్  ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట  రూ.1,05,006 కోట్ల రుణాలకు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. వీటిని బడ్జెట్లో చూపించకుండా దాటవేసింది. కార్పొరేషన్ల పేరిట చేసిన ఈ అప్పులన్నీ చివరకు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. అందుకే వీటిని కూడా కలిపితే.. రాష్ట్రం చేసిన అప్పుల అసలు లెక్క  బయటపడుతోంది. తెలంగాణపై ఉన్న అప్పు మొత్తం రూ. 3,91,810 కోట్లు అని లెక్కతేలుతోంది. కార్పొరేషన్ల పేరిట తెచ్చే కొత్త గ్యారంటీలు కలిపితే.. ఈ అప్పు రూ. 4 లక్షల కోట్లు దాటిపోవటం ఖాయం.

ఐదున్నర రెట్లు పెరిగింది
రూల్స్ ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్డీపీలో 25 శాతం మించకూడదు. మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరిపోతుంది. లెక్కలేనన్ని గ్యారంటీలు ఇవ్వటంతోపాటు అప్పులు చేసిన తీరు చూస్తే ఈ హద్దులను ప్రభుత్వం ఎప్పుడో దాటింది. కానీ బడ్జెట్అంచనాల్లో జీఎస్డీపీలో 24.84 శాతం అప్పులున్నట్లు చూపించింది.  రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు.. ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ. 70 వేల కోట్లు. గత ఏడేండ్లలోనే ఇది ఐదున్నర రెట్లు పెరిగిపోయింది.

ఈసారి 50 వేల కోట్ల అప్పుకు గురి
2021–22 ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున రుణాల సమీకరణకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మొత్తం రూ. 49,300 కోట్ల మేరకు అప్పులు తీసుకోనున్నట్లు వెల్లడించింది. గతేడాది సవరించిన అంచనాలతో  పోలిస్తే దాదాపు 5 వేల  కోట్ల అప్పు ఎక్కువగా ప్రతిపాదించింది. ఓపెన్ మార్కెట్ రుణాల కింద రూ. 47,600 కోట్లు, కేంద్రం నుంచి రూ. 200 కోట్లు, ఇతర రుణాలు రూ. 1,500  కోట్లు సమీకరించాలని ప్లాన్ చేసుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.34 వేల  కోట్ల రుణాలు అంచనా వేయగా, కరోనా ఎఫెక్ట్ వల్ల కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిధి పెంచడం కలిసొచ్చింది. దీంతో అం తకు భారీగా రూ.43,984 కోట్లు ప్రభుత్వం అప్పు తెచ్చింది. కేంద్రం నుంచి రూ.400 కోట్లు, ఇతర సంస్థల నుంచి రూ. 650 కోట్లు సమీకరించింది.

తలసరి అప్పు రూ. 81,944
సర్కార్ తీసుకునే అప్పులతో రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోంది. గతేడాది సవరించిన బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ. 70,080 కాగా ఈసారి బడ్జెట్లో రూ. 11,864 పెరిగింది. అంటే రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై రూ. 81,944 అప్పు ఉంది. 2021–22 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ. 2,86,804.64 కోట్లకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే ఇది రూ. 81,944 గా తేలింది. అంటే రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై తలసరి అప్పు రూ. 81,944. 2015–16లో రాష్ట్ర ప్రభుత్వానికి  రూ. 93,115 కోట్లు అప్పుంటే 2021–22 నాటికి రూ. 2.86 లక్షల కోట్లకు పెరుగనుంది.

Leave a Reply