వర్సిటీలకు వీసీలేరీ?

0
261
వర్సిటీలకు వీసీలేరీ?

ఇప్పటికే 5 నెలలుగా ఇన్‌ఛార్జులుగా ఐఏఎస్‌లు
 పాలన గాలికి.. కుంటుపడుతున్న విశ్వవిద్య

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో శాశ్వత ఉపకులపతి ఉన్న ఒకే ఒక్కటి జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ). ఈనెల 17 తేదీతో అదీ ఖాళీ కానుంది. అంటే రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఇన్‌ఛార్జి ఉపకులపతులే దిక్కు. వారు ఐఏఎస్‌లు కావడం, కీలక శాఖలకు అధిపతులుగా ఉండటంతో విశ్వవిద్యాలయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. శాశ్వత వీసీలు లేకపోవడం వల్ల వర్సిటీల్లో పాలన కుంటుపడుతోంది. రాష్ట్రంలోని 8 విశ్వవిద్యాలయాలకు 2016 జూన్‌, జులైలో ప్రభుత్వం శాశ్వత ఉపకులపతులను నియమించింది. వారి పదవీకాలం మూడేళ్లు పూర్తికావడంతో 2019 జూన్‌, జులైలో ఐఏఎస్‌ అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమించింది. ఒక్కొక్క అధికారికి రెండు వర్సిటీల బాధ్యతలు అప్పగించింది. ఇక ఆర్‌జేయూకేటీకి తెలంగాణ ఆవిర్భావం నుంచి శాశ్వత ఉపకులపతి లేరు. దానికి కులపతిగా గవర్నర్‌ కాకుండా విద్యావేత్త ఉంటారు. దానికి కూడా గవర్నర్‌ ఉండేలా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయిదున్నరేళ్లు దాటినా అదీ కార్యరూపం రాలేదు. దీనికి అసెంబ్లీ ఆమోదం అవసరం. ఫలితంగా ఐఏఎస్‌ అధికారిని ఇన్‌ఛార్జిగా నియమిస్తూ వస్తున్నారు. ఇప్పుడు విద్యా సంబంధిత వ్యవహారాల పర్యవేక్షణకు కనీసం సంచాలకుడు కూడా లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇక కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీకి 2015 ఆగస్టు నుంచి.. అంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి ఐఏఎస్‌లే ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు.

అడుగడుగునా జాప్యం
 జూన్‌, జులైలో వీసీల పదవీకాలం ముగుస్తుందని తెలిసినా జులై 9న ప్రభుత్వం భర్తీకి ప్రకటన జారీ చేసింది. 984 దరఖాస్తులు అందాయి. ఈనెల 17కు జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ పదవీకాలం ముగియనున్నా ఇప్పటివరకు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయలేదు.
 ఉపకులపతుల ఎంపికకు వర్సిటీ, ప్రభుత్వ, యూజీసీ నామినీలతో అన్వేషణ కమిటీలను నియమించాల్సి ఉండగా ఉపకులపతుల పదవీకాలం ముగిసిన రెండు నెలలకు.. అంటే సెప్టెంబరు 23న కమిటీలను నియమిస్తూ జీఓ జారీ చేసింది.
 ఆ కమిటీలు ఏర్పాటై మూడు నెలలు దాటినా ఉపకులపతుల ఎంపికకు సమావేశం నిర్వహించలేదు.
 మరోవైపు పూర్తిస్థాయి వర్సిటీలకు పూర్తిస్థాయి పాలక మండళ్లు (ఈసీ)లు నియామకం జరపలేదు. ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు ఈసీల నియామకం జరగలేదు.

ఎన్నో సమస్యలు….
 శాశ్వత ఉపకులపతులను నియమిస్తేనే ఆచార్యుల ఖాళీల భర్తీ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతానికిపైగా బోధనా సిబ్బంది ఖాళీలున్నాయి.
 రూసా కింద నిధులను ఈ మార్చిలోపు ఖర్చు చేయాల్సి ఉంది. శాశ్వత వీసీలు లేకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం కుదరడం లేదు. ఓయూలో రూసా కింద ఏర్పాటు చేసిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)కి ఇప్పుడు మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేని పరిస్థితి.
ఐఏఎస్‌ అధికారుల వద్దకు రిజిస్ట్రార్లు కేవలం అత్యవసర దస్త్రాలు మాత్రమే తీసుకెళ్లి సంతకాలు చేయిస్తున్నారు.

(Courtesy Eenadu)

Leave a Reply