– సెల్ఫ్ లాక్‌డౌన్‌లో పల్లెలు
– పట్టణం నుంచి పల్లెలకు పాకుతున్న మహమ్మారి
– సరిహద్దు రాష్ట్రాల నుంచి ముప్పు
– భారీగా తగ్గిన టెస్టులు
– పెరుగుతున్న పాజిటివ్ కేసులు
మాయదారి మహమ్మారి కరోనా.. పట్టణం నుంచి పల్లెలకు పాకి వణికిస్తోంది. పాలకులు పట్టించుకోక పోగా.. ఆస్పత్రులకు బారుతీరిన వారిని పరీక్షల కిట్లు లేవంటూ వెనక్కి పంపుతుండటంతో.. పరిస్థితి విషమించి ఆస్పత్రి మెట్లేక్కేసరికే కొందరు ప్రాణం కోల్పోతున్నారు. దానికి తోడు సరిహద్దు రాష్ట్రాల నుంచి వైరస్ పాకుతుండటంతో.. పల్లెలు ”మేము రాము.. మీరూ రావొద్దు” అంటూ సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి.. తమను తామే రక్షించుకోవాలంటూ గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామంటూ హెచ్చరిస్తూ తమ ప్రజలను రక్షిస్తున్నాయి. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ వైరస్‌ను కట్టడి చేస్తున్నాయి.
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కరోనా కోరాలు చాస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల తరువాత పట్టణంతోపాటు పరిసర మండలాల్లో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. అంతరాష్ట్ర రవాణా వ్యవస్థ సాగుతుండటంతో జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 44 మండలాలకు గాను 10 గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించుకున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో కరోనా బాధితులు ఉన్నారు. సీహెచ్‌సీ సెంటర్స్‌లో 50 మందికి, పీహెచ్‌సీ సెంటర్స్‌లో రోజుకి 25 నుంచి 50 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవడం కోసం వందలాది మంది తోసుకుంటూ లైన్‌లో ఉండటం, గుంపులుగా చేరడంతో వైరస్ వ్యాపిస్తోంది. పీహెచ్‌సీల్లో రోజు 25 మందికి మాత్రమే టెస్టులు చేస్తుండటంతో రోగులు తిరిగి వెళ్లి బయట తిరుగుతున్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో కరోనా టెస్టు కేంద్రం ఏర్పాటు చేశారు. రోజు సుమారు 500 నుంచి 600 మంది వస్తున్నారు. వీరిలో 250 మందికి పరీక్షలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి లైన్‌లో నిలబడుతున్నారు. లైన్‌లో గంటల తరబడి నిలబడలేక చెప్పులు, ఆధార్ కార్డులు, వాటర్ బాటిల్స్ పెడుతున్నారు.
36 గ్రామపంచాయతీలకు ఒకే ప్రాథమిక వైద్యశాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 36 పంచాయతీలకుగాను 60వేల జనాభా ఉంది. ఒకేఒక ప్రాథమిక వైద్యశాల ఉంది. ఇక్కడ రోజుకు 25 మందికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారు. వారిలోనూ 17 నుంచి 20 మందికి పాజిటివ్ వస్తోంది. రోజు 100-150 మంది బాధితులు పరీక్షల కోసం వస్తున్నారు. ఉదయం 3.35 గంటలకు వచ్చి ఆస్పత్రి ఎదుట క్యూ కడుతున్నారు. ముందు వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. మిగతా వారు వెనుతిరుగుతున్నారు. మండలంలో దాసుతండా, కొత్తతండా, ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు పంచాయతీల్లో ఏప్రిల్, మే నెలలో సుమారు 15 మంది కరోనాతో చనిపోయారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 12వేల 340 పాజిటివ్ కేసులు తేలాయి. 84 మంది చనిపోయారు. ర్యాపిడ్ కిట్ల కొరత ఎక్కువగా ఉంది. పదర, బాలానగర్, మదనపురం, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, కొడెరు, గంగపురం మండలాల్లో ఈ నెల 4వ తేదీ నుంచి 20 వరకు లాక్‌డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వివిధ వ్యాపార సంస్థలు నడుపుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి అత్యధిక లాక్‌డౌన్‌లు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ లాక్‌డౌన్‌కు తీర్మాణం చేసింది. మధ్యాహ్నం 3గంటల నుంచి మరునాడు ఉదయం 6గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని చైర్మెన్ కప్పరి స్రవంతి ప్రకటించారు. పది రోజుల లాక్‌డౌన్ విధించారు. శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ, కొండకల్ గ్రామాల్లోపది రోజులు లాక్‌డౌన్ విధించారు. ఈ గ్రామాల్లో రోజువారి కేసులు 5 నుంచి 10 వస్తున్నాయి. కొత్తూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మధ్యాహ్నం 2 తర్వాత లాక్‌డౌన్ పాటించాలని తీర్మానం చేశారు. గండిపేట్‌లోని నార్సింగి మున్సిపాలిటీలో ఖానాపూర్ గ్రామంలో లాక్‌డౌన్ పెట్టుకున్నారు. గ్రామంలో దాదాపు 40 కేసులు నమోదయ్యాయి. చౌదరిగూడెం మండల కేంద్రంలో లాక్‌డౌన్ విధించారు. 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. అమన్‌గల్ మున్సిపాలిటీలో 20 వరకు లాక్‌డౌన్ ఉండగా, కడ్తాల్, తలకొండలపల్లి మండలాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పెట్టారు.
యాచారం మండలం పరిధిలోని మేడిపల్లి, మాల్, యాచారం, కొత్తపల్లి, నందివనపర్తి, పలు గ్రామాల్లో లాక్‌డౌన్ విధించుకున్నారు. మండల పరిధిలో 150పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ర్యాపిడ్ టెస్టులు చేయడం లేదు. ఇప్పటి వరకు కరోనాతో 6గురు చనిపోయారు. మొయినాబాద్ నక్కలపల్లి, మర్పల్లి మండల కేంద్రంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకున్నారు. రోజూ 20పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పరిగి మండల మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని ఖాగ్లాపూర్, చిట్యాల, రాపోల్, మాదారం, ఇబ్రహీంపూర్, పలు గ్రామాల్లో లాక్‌డౌన్ విధించుకున్నారు. పరిగిలో 15 రోజుల్లో 2249 టెస్టులు చేయగా 654 మందికి పాజిటివ్ వచ్చింది. తాండూరులో 11 నుంచి 24 వరకు లాక్‌డౌన్ విధించుకున్నారు. కోటబాస్‌పల్లిలో మల్కాపూర్‌లోనూ లాక్‌డౌన్ విధించుకున్నారు. పెద్దేముల్ మండలంలో రేపటి నుంచి 20 వరకు లాక్‌డౌన్ పెట్టారు.
మారుమూల జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని మట్టెవాడ పంచాయతీలో ఆదివారం నుంచి సర్పంచ్ ఈసం సంధ్య సూర్యనారాయణ లాక్‌డౌన్ విధించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని కాటాపూర్, బీరెల్లి గ్రామాల్లో ఈనెల 10 నుంచి లాక్‌డౌన్ విధించారు. కాటాపూర్‌లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు షాపులు తెరిచి ఉంటాయని, అనంతరం మూసేయాలని నిర్ణయించారు. బీరెల్లిలోనూ 10 నుంచి 10 రోజులు లాక్‌డౌన్ పాటిస్తామని సర్పంచ్ చంద్రం తెలిపారు. ఉదయం 6 నుంచి 10 వరకు, సాయంత్రం 5 నుంచి 8 వరకు వ్యాపార సంస్థలు తెరిచి ఉంటాయని చెప్పారు.
గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్‌లో సోమవారం నుంచి 10 రోజులపాటు స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లుయాదవ్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర సరుకుల అమ్మకానికి అనుమతిచ్చారు.
ఉమ్మడి నిజామాబాద్‌లో 220 గ్రామాల్లో..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 220 గ్రామాల్లో స్వీయ లాక్‌డౌన్ అమల్లో ఉంది. కొన్ని గ్రామాల్లో ఉదయం 5 నుంచి 10 గంటలు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వ్యాపారాలకు వెసులుబాటు కల్పించగా, మరికొన్ని గ్రామాల్లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు వెసులుబాటు కల్పించుకున్నాయి. పలు మండలాలూ స్వీయ లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. నందిపేట్ మండల కేంద్రంలో వ్యాపారులు ముందుకొచ్చి వారం రోజులపాటు పూర్తిగా బంద్ పాటిస్తున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఆది, సోమ రెండ్రోజులు పూర్తి లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. అలాగే, మహారాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు సగానికిపైగా గ్రామాలు ఎప్పటి నుంచో స్వచ్ఛంద లాక్‌డౌన్ పెట్టుకుని, గ్రామ పొలిమేరల్లో ఎవరినీ రానివ్వకుండా కాపలా కూడా పెట్టాయి. ఈ జిల్లాలోని ఆస్పత్రులన్నీ మహారాష్ట్ర రోగులతోనే నిండిపోయాయి.
ఏమని ‘చెప్పు‘దుము..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షల కోసం తాకిడి పెరిగింది. ఇందుకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో టెస్టులు చేయడంలో ఆలస్యం అవుతోంది. ఎక్కువ సేపు లైన్‌లో నిలబడలేక జనం చెప్పులను లైన్‌లో ఉంచుతున్నారు.
Courtesy Nava Telangana