తేట తెలుగు.. భోధన మరుగు

0
285
  • తెలుగు వర్సిటీలో తెలుగు బోధించే ప్రొఫెసర్‌ ఎక్కడ?..
  • రాష్ట్ర విభజనతో ఏపీకి వెళ్లిన సాహిత్య పీఠం
  • తెలుగు శాఖ ఏర్పాటైనా మనుగడ ప్రశ్నార్థకం
  • 15 ప్రొఫెసర్‌ పోస్టులు.. అన్నీ ఖాళీ..

హైదరాబాద్‌ సిటీ : తెలుగు భాష అంటే.. తొలిసంధ్యలో ఉదయ భానుడి రాకతో నీలాలనింగి కుంకుమ తిలకం దిద్దుకున్నట్లు.. చిగుళ్లు తొడుగుతున్న చెట్టు కొమ్మ మీద కోయిల కువకువ రాగాలు తీసినట్లు.. చక్కగా అలికిన వాకిట్లో ముగ్గులు పరిచినట్లు.. వేడి వేడిగా పొగలుగక్కే అన్నంలో ఆవకాయ, నెయ్యి వేసుకొని తిన్నట్లు.. మరెన్నో అందమైన భావనల ఆనందాల విందు! నేత్రపర్వమైన చుక్కల్లాంటి  అక్షరాల కలబోత పదాలుగా సాగి, వాక్యాలుగా పారి పలుకులుగా పొంగుతుంటే అదే కదా కమ్మదనం, కర్ణపేయం అని మనసు పులకిస్తుంది. ఆదివారం తెలుగు భాషా దినోత్సవం భాషా ప్రేమికులు, కవులకు పండుగ రోజు. ఇతర భాషల వెల్లువలో తేట తెలుగు కొట్టుకుపోతోందని, మన మాతృభాషను పరిరక్షించుకోవాలని, అందుకు పునరంకితం కావాలని సంకల్పం చెప్పుకొన్న రోజు. అయితే తెలుగు ఔన్నత్యాన్ని, తెలుగు సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, కళలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఏర్పాటు చేసిన తెలుగు విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఇప్పుడు ఉత్సవ విగ్రహంగా మారిందని భాషాభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు శాఖలో బోధించేందుకు ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్‌ కూడా లేరు. ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కొంతమంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో నెట్టుకొస్తున్నారు. తెలుగు శాఖకు ఒక స్వతంత్ర గుర్తింపూ లేదు. ఈ పరిస్థితుల్లో అసలు తెలుగు శాఖను కొనసాగించాలా, రద్దు చేయాలా అనే సందిగ్ధం నెలకొంది. ఆ మధ్య నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ఉపన్యాసాల్లో పెల్లుబికిన ఉత్సాహం తెలుగు విశ్వవిద్యాయలయంలో ఇప్పుడేది అని భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర విభజనతో సాహిత్య పీఠం ఏపీకి
రాష్ట్ర విభజనకు ముందు విశ్వవిద్యాలయంలోని తెలుగు సాహిత్య పీఠం రాజమండ్రిలో ఏర్పాటుచేసిన నన్నయ్య ప్రాంగణం నుంచి కార్యకలాపాలను నిర్వహించేది. విభజన తర్వాత పీఠం ఏపీకి పరిమితమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయంలో సాహిత్య పీఠం కానీ, తెలుగు శాఖ కానీ లేకుండా పోయింది. ఆగమేఘాల మీద తెలుగు శాఖను ఏర్పాటు చేశారు. కానీ తెలుగు ప్రొఫెసర్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. వివిధ శాఖలకు అనుబంధంగానే తెలుగు శాఖను కొనసాగిస్తున్నారు. స్వయం ప్రతిపత్తితో వ్యవహరించే పరిస్థితి లేదు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న విశ్వవిద్యాలయం, వరంగల్‌లోని పోతన ప్రాంగణానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సిబ్బంది జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. రాజమండ్రి, శ్రీశైలం, కృష్ణా జిల్లా కూచిపూడిలోని క్యాంప్‌సలకు చెందిన ప్రొఫెసర్లు, సిబ్బంది జీతభత్యాలన్నీ ఏపీ ప్రభుత్వమే భరిస్తోంది.

మూస ధోరణిలోనే
ప్రొఫెసర్లు లేకపోవడంతో తెలుగు యూనివర్సిటీలో తెలుగు శాఖ నామమాత్రంగా మారింది. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర అంశాల్లో మలుపుగా భావించే పరిశోధనలేమీ జరగడం లేదు. తెలుగు బోధన కూడా ఆశాజనకంగా లేదు. యూనివర్సిటీకి 15 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరైతే ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. ప్రొఫెసర్లు అందరూ రిటైరయ్యారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు 23 మందికి ఒక్కరే మిగిలారు. 22 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 44 ఉంటే, ప్రస్తుతం 14 మంది మాత్రమే ఉన్నారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో వర్సిటీని నెట్టుకొస్తున్నారు. విశ్వ విద్యాలయం నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కరోనా నేపథ్యంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ఆన్‌లైన్‌ క్లాసులు, పరీక్షల నిర్వహణలో జాప్యం మామూలైపోయింది. వివిఽధ కోర్సుల్లోని ఫైనలియర్‌ విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో చొరవ కరువైంది. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సాంస్కృతిక రంగాల్లో నూతన ధోరణులకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలి. భవిష్యత్తులో రానున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని కొత్త కోర్సులను రూపొందించాలి. ఈ అంశాల్లో తెలుగు యూనివర్సిటీ ఎన్నో ఏళ్లుగా మూసధోరణిలోనే వెళ్తుందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం  వర్సిటీకి న్యాక్‌ బి గ్రేడ్‌ మాత్రమే ఉంది. ప్రమాణాలు ఇలాగే కొనసాగితే ఈ గుర్తింపును కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు వర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలకు కూడా ప్రాంగణాలను విస్తరించాలని సూచిస్తున్నారు.

ఉన్నత ఆశయాలతో ప్రారంభం
1985 డిసెంబరు 2న దేశంలోనే రెండో భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు యూనివర్సిటీ ఏర్పడింది. తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, చరిత్రను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగులో ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రంగా వర్సిటీ రూపుదిద్దుకోవాలని నాడు ఆశించారు. వరంగల్‌, శ్రీశైలం, రాజమండ్రి, కూచిపూడిలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆయా కేంద్రాల ద్వారా మొత్తం 30 సబ్జెక్టుల్లో, 52 సర్టిఫికెట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌, పరిశోధన కోర్సులను తెలుగు యూనివర్సిటీ అందిస్తోంది. దూర విద్య ద్వారా కూడా పలు వైవిథ్య కోర్సులను అందించిన ఘనత యూనివర్సిటీకి ఉంది.

Courtesy Andhrajyothi

Leave a Reply