వివాదాస్పదస్థలంలోనే మందిరం

0
286

– మసీదు నిర్మాణానికి వేరే చోట ఐదెకరాలు
– అయోధ్యపై వెయ్యికిపైగా పేజీలతో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ : దశాబ్దాలుగా కొనసాగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలిని రామ మందిర నిర్మాణానికి అప్పగించి, మసీదు కోసం వేరే చోట అయిదెకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. వివాదాస్పద స్థలిని మూడు భాగాలుగా పంచాలని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా పక్కన పెట్టిన సుప్రీం కోర్టు ‘రామజన్మభూమి న్యాస్‌’కు ఆ 2.77 ఎకరాల భూమిని అప్పగించింది. అయోధ్య యాక్ట్‌ కింద రామమందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా అయోధ్య ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని ఆదేశించిన సుప్రీం, ఆ స్థలాన్ని కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏర్పాటు చేయాలని సూచించింది. అదే సమయంలో 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసాన్ని చట్ట ఉల్లంఘనగా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. 1949లో మసీదులో రాముడి విగ్రహాలను ఉంచి పూజలు చేయడాన్ని అది తప్పుపట్టింది.
అఖారా, సున్నీ వక్ఫ్‌ బోర్డు పిటిషన్ల కొట్టివేత
శనివారం ఉదయం 10.30 గంటల సమయానికి ధర్మాసనంలోని న్యాయమూర్తులు రంజన్‌ గొగోయ్, ఎస్‌ఎ బాబ్దే, డివై చంద్రచూడ్‌, అశోక్‌భూషణ్‌, ఎన్‌ఎ నజీర్‌ బెంచ్‌పైకి చేరుకున్నారు. ముందుగా వివాదాస్పద భూమిపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలని కోరుతూ షియా వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారాలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఆయా పిటిషన్‌దార్ల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అఖారాకు వారసత్వ హక్కులు పొందే అవకాశం లేదని తేల్చిచెప్పింది. రామమందిర నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేయబోయే బోర్డులో అఖారాకు సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది. ఐదుగురు న్యాయమూర్తులు తీర్పుపై సంతకం చేయగా, తీర్పు పాఠాన్ని దాదాపు 30 నిమిషాల పాటు చదివిన గొగొయ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దీన్ని ఒక చారిత్రాత్మక తీర్పుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా కేటాయిస్తూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని తెలిపారు.
చరిత్ర, మతపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పును వెలువరించినట్లు గొగోయ్ స్పష్టం చేశారు. ఎఎస్‌ఐ నివేదికను పక్కకు పెట్టలేమనీ, దాని ప్రకారం బాబ్రీ మసీదు ఖాళీ ప్రదేశంలో నిర్మాణం కాలేదని అభిప్రాయపడిన ఆయన మసీదు కింద ఏదో నిర్మాణం ఉందన్నారు. ఆ నిర్మాణం ఇస్లాంకు చెందినది కాదని అన్నారు. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం 12 నుంచి 16 శతాబ్దాల మధ్య అక్కడ ప్రార్థనా మందిరాలు ఉండేవనీ, అవి కచ్చితంగా దేవాలయాలే అన్న దానికి ఆధారాలు లేవని తెలిపారు. ఆ స్థలంలో బాబర్‌ హయాంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినట్టు పురావస్తు శాఖ నివేదికల ద్వారా తెలుస్తోందని అన్నారు. మసీదును నిర్మించేందుకు ఆలయాలను ధ్వంసం చేశారన్న దానికి ఆధారం లేదన్న ఆయన నమ్మకం, విశ్వాసం అధారంగా భూయాజమాన్య హక్కులు కల్పించలేమని పేర్కొన్నారు. ‘1949లో మసీదులో రాముని విగ్రహాలు పెట్టారు. విగ్రహాలను పెట్టడం అంటే అది కచ్చితంగా మత దూషణ కిందకే వస్తుంది. ముస్లిములు ఎప్పుడూ మసీదును వదిలేయలేదు. వివాదాస్పద స్థలం తమదేనని వారు నిరూపించుకోలేకపోయారు’ అని అన్నారు. ‘అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారు. వారి విశ్వాసాలను తప్పుపట్టలేం’ అని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని వారు 1857కు ముందు నుంచి సందర్శిస్తూ పూజలు చేశారన్న దానికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 1857 నుంచే ఈ స్థలం తమ అధీనంలో ఉందన్న దానికి సున్నీ వక్ఫ్‌బోర్డు కచ్చితమైన ఆధారాలు చూపించలేకపోయిందని గొగోయ్ వ్యాఖ్యానించారు.
40 రోజుల పాటు రోజువారీ విచారణ
ఈ కేసుపై దాదాపు 40 రోజుల పాటు రోజువారీ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబర్‌ 16న తీర్పు రిజర్వ్‌ చేసింది. సుప్రీంకోర్టు ఎక్కువ రోజులు వాదనలు విన్న కేసుల్లో ఇది రెండోది కావడం గమనార్హం. గతంలో కేశవానంద భారతి కేసులో కోర్టు 68 రోజుల పాటు వాదనలు విన్న విషయం తెలిసిందే. అయోధ్య స్థల వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముగ్గురు మధ్యవర్తులను నియమించింది. వారిలో మాజీ జస్టిస్‌ ఎఫ్‌ఎం ఖలీఫ్‌తుల్లా, శ్రీశ్రీ రవిశంకర్‌, న్యాయవాది శ్రీరామం పంచు ఉన్నారు. కేసు పరిష్కారానికి వారు చేసిన కృషి అభినందనీయమని తీర్పు వెల్లడి సందర్భంగా కోర్టు పేర్కొంది. ఈ తీర్పును వెల్లడించిన ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు ఈనెల 17న పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కేసు తుది తీర్పును తాజాగా వెల్లడించారు.
కేసు పూర్వాపరాలు
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జిల్లాలో వున్న అయోధ్యలో రాముడు జన్మించారని హిందువుల విశ్వాసం. 1949 వరకూ అక్కడ మసీదు ఉందని, తాము అక్కడే ప్రార్ధనలు చేశామని ముస్లిముల వాదన. తరువాత ఈ వివాదాస్పద భూమి కోసం పలు హిందూ, ముస్లిం సంస్థలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. ఇదే సమయంలో 1992, డిసెంబర్‌ 6న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, బిజెపి, దాని అనుబంధ సంఘాలకు చెందిన వ్యక్తులు ఆ స్థలంలో ఉన్న బాబ్రీ మసీదు ధ్వంసం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో అప్పట్లో దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో దాదాపు రెండు వేల మంది చనిపోయారు. అప్పటి దేశ ప్రధానిగా ఉన్న పివి.నరసింహారావుపై ఆ సమయంలో అనేక విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని సరైన రీతిలో పరిష్కరించలే కపోయారని, ఘర్షణలను అడ్డుకోలేకపోయారని ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. అనంతర పరిణామాల నేపథ్యంలో అయోధ్య వివాదాస్పద స్థలంపై అలహాబాద్‌ హైకోర్టులో నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్‌ బోర్డు, రామ్‌లల్లా తరపున కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం 2010లో 2-1 తేడాతో తీర్పునిచ్చింది. స్థలాన్ని మూడు భాగాలుగా పంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుదీర్ఘకాలం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది.

Courtesy NavaTelangana..

Leave a Reply