– 10 ఆస్పత్రులు తిరిగినా దక్కని వైద్యం
– నో అడ్మిషన్.. నో బెడ్స్ అన్న కార్పొరేట్ ఆస్పత్రులు
– సర్కారు దవాఖానాల్లోనూ అదే పరిస్థితి
– తల్లి ప్రేమను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు
– ఆ కుటుంబానికి చీకటిని మిగిల్చిన రాత్రి
హైదరాబాద్ : ఆమె చనిపోలేదు. వైద్యం అందించక చంపేశారు అనడమే కరెక్టేమో! రాజధాని నగరం…పెద్దపెద్ద ఆస్పత్రులు..అయినా ఏం ప్రయోజనం? ఆమె ప్రాణాన్ని ఎవ్వరూ కాపాడలేదు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికెళ్తే మరో ఆస్పత్రికి పంపించారు. అక్కడేమో అబ్బే ఇక్కడ ట్రీట్‌మెంట్ ఇవ్వబోమని వాళ్లూ నిరాకరించారు…ఇలా ఒకటి కాదు..రెండు కాదు.. పది ఆస్పత్రులు తిరిగినా ఆ మహిళ ప్రాణం దక్కలేదు. బిడ్డలు కన్నీరుపెట్టికుంటూ చేతులెత్తి వేడుకున్నా వైద్యులు కనికరించలేదు. కనిపించిన వాళ్లందరి కాల్జేతులు పట్టుకుని బతిమిలాడినా భార్యను బతికించుకోవాలనే ఆ భర్త తపన నెరవేరలేదు. ప్రయివేటు…ప్రభుత్వాస్పత్రులన్నీ తిరిగీతిరిగీ ఆమె చివరకు శవంగా మారింది. ఆ కుటుంబం ఇంటి వెలుగును కాపాడుకునేందుకు పడిన తపన అంతా ఇంతా కాదు..అయినా, చివరకు ఆ రాత్రి ఆ కుటుంబంలో చీకటినే నిపింపింది.
హైదరాబాద్‌లో వైద్యం అందక ఓ మహిళ చనిపోయిన హృదయవిదారక ఘటన బుధవారం రాత్రి జరిగింది. పి.శ్రీకాంత్‌ది అత్తాపూర్. బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆయన భార్య పి.రోహిత(41). బాబు సాయి తిలక్ ఇంటర్, సిరివెన్నెల తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో చిన్న జ్వరం పెను విషాదాన్నే నింపింది. శ్రీకాంత్ భార్యకు బుధవారం స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలో చూపించారు. అదే రోజు రాత్రి 11-12 గంటల మధ్య సమయంలో ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో ఏమీ ఆలోచించకుండా ఆమెను శ్రీకాంత్ సన్‌షైన్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కరోనా రోగుల కోసం బెడ్లు లేవని చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించారు. కరోనా అని మీరెలా నిర్ధారిస్తారు? అని శ్రీకాంత్ నిలదీయడంతో కొద్దిసేపు ఆక్సిజన్ పెట్టారు. ఆ తర్వాత మా వల్ల కాదంటూ పంపించేశారు. ఆ అర్ధరాత్రి పూట భార్యను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడా పట్టించకోకపోవడంతో కోరంటి ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడా ఆమెను చేర్చుకోవడానికి ఆస్పత్రివారు నిరాకరించారు.
బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రికి…అక్కడున్నుంచి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి, కింగ్ కోఠి ప్రభుత్వాస్పత్రికి, ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి, కూకట్ పల్లిలోని హౌలిస్టిక్ ఆస్పత్రికి, ఇలా రాత్రి నుంచి పొద్దుగాల తెల్లారిందాక భార్యను బతికించుకోవాలనే ఆరాటంతో ఆస్పత్రులన్నీ తిప్పాడు. ఎక్కడా వైద్యం అందలేదు. చివరకు గాంధీకి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో రోహిత చనిపోయింది.
అన్ని అబద్ధాలే……శ్రీకాంత్
కేసీఆర్ చెబుతున్నవన్ని అబద్ధాలే. మంత్రులు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలే. ఒక్క ఆస్పత్రిలోనూ రోగులను తీసుకోవడం లేదు. ఒక్క బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో మాత్రం తీసుకుంటామని చెప్పారు. అక్కడా రోజుకు రెండు లక్షలు కట్టాలని చెప్పారు. అంత కట్టలేం అంటే వెళ్లిపోమన్నారు. ఒక్కఆస్పత్రి అడ్మిషన్ తీసుకున్నా నా పిల్లలకు తల్లి మిగిలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Courtesy Nava Telangana