పది లక్షల మరణాలు

0
182

– 80శాతం కోవిడ్‌ మరణాలు అధికారిక లెక్కల్లో చూపటం లేదు : మిడిల్‌సెక్స్‌ వర్సిటీ గణిత లెక్చరర్‌ మురాద్‌ బనాజీ

న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్‌ కారణంగా ఇప్పటికే దాదాపు 10లక్షలమంది మరణించి వుంటారని, కోవిడ్‌ మరణాల సమచారాన్ని భారత ప్రభుత్వం దాస్తోందని..అధికారికంగా వెల్లడించటం లేదని లండన్‌లో మిడిల్‌సెక్స్‌ యూనివర్సిటీ గణిత లెక్చరర్‌గా పనిచేస్తున్న మురాద్‌ బనాజీ చెప్పారు. కోవిడ్‌ మరణాలపై వివిధ సంస్థల అంచనాలు, అధ్యయనాల ఆధారంగా ఈవిషయాన్ని వెల్లడిస్తున్నానని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ ‘ద వైర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కరణ్‌ థాపర్‌ అడిగన ఒక ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు.

భారత్‌లో కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి, మరణాలు, చికిత్స..తదితర అంశాలపై బనాజీ గతకొన్ని నెలలుగా అధ్యయనం చేస్తున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకూ కోవిడ్‌-19 కారణంగా దాదాపు 10లక్షల మంది చనిపోయారని, ఇందులో 80శాతం మరణాలు అధికారిక లెక్కల్లో చూపించటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే 8నాటికి భారత్‌లో కోవిడ్‌ మరణాల సంఖ్య 2,38,000గా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి ఐదు రేట్లు కోవిడ్‌ మరణాలున్నాయని ఆయన అంచనావేస్తున్నారు. రాబోయో రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని భారతదేశంలో, దేశంబయట ప్రముఖ సంస్థలు అంచనావేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

వివిధ సంస్థల అంచనాల ప్రకారం..
జూన్‌నాటికి కోవిడ్‌ మరణాల సంఖ్య 4,04,000కు పెరుగుతుందని ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగుళూర్‌’ వారు అంచనావేశారు. వాషింగ్టన్‌కు చెందిన ‘ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ (ఐహెచ్‌ఎంఈ) వారు వేసిన అంచనా ప్రకారం, ఈ ఏడాది జులైనాటికి భారత్‌లో 10,18,879 మరణాలుంటాయని చెప్పారు. సెప్టెంబర్‌నాటికి మరణాల సంఖ్య 14లక్షలకు పెరుగుతుందని చెప్పారు. అధికారిక, అనధికారిక మరణాలను లెక్కలోకి తీసుకొని ఈ అంచనాలను ఐహెచ్‌ఎంఈ వెల్లడించింది. అధికారిక లెక్కల్లో చూపని మరణాలు మూడు రేట్లు ఉంటుందని ఐహెచ్‌ఎంఈ భావించింది. దీని ప్రకారం..ఇప్పటికే భారత్‌లో కోవిడ్‌ మరణాలు 10లక్షలు దాటిందని భావిస్తున్నా.

Courtesy Nava Telangana

Leave a Reply