- ఇరువర్గాల ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు
- పలు వాహనాలు ధ్వంసం.. బైక్‌కు నిప్పు
- 25 మందిపై కేసులు.. 144 సెక్షన్ అమలు
- 300 మంది పోలీసులతో బందోబస్తు
- పరిస్థితి అదుపులో ఉంది: హోంమంత్రి
భైంసా క్రైం/నిర్మల్/హైదరాబాద్ : సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో మరోసారి అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడులు చేసుకున్నాయి. మునిసిపల్ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల తర్వాత ప్రశాంతంగా ఉన్న భైంసా.. తాజా ఘటనతో మరో సారి ఉలిక్కిపడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రార్థన స్థలం వద్దకు ఆదివారం రాత్రి కొందరు చేరుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంత మంది గుమికూడడం సరికాదంటూ మరో వర్గానికి చెందిన వ్యక్తి ప్రార్థన స్థలం లోపలికి దూసుకెళ్లాడు. అయితే, ఆ వ్యక్తి మద్యం తాగి ప్రార్థన మందిరంలోకి వచ్చాడంటూ అక్కడున్న వారు దాడికి దిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరో వర్గం వారు అక్కడికి చేరుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనలో ఓ కారు, ఆటో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరస్పరం దాడులు చేసుకున్న 25 మందిపై కొవిడ్-19 చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్, నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు.. భైంసా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 144 సెక్షన్‌తోపాటు పోలీసు యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. 300 మందితో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అల్లర్లు దురదృష్టకరం: సోయం
భైంసాలో అల్లర్లు దురదృష్టకరమని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడొద్దని సూచించిన వ్యక్తితోపాటు అతడి తమ్ముడిపై 20 మంది దాడిచేసి గాయపర్చారని ఆరోపించారు. అల్లర్లు జరిగిన ప్రతిసారి పోలీసులు ఒక వర్గం వారినే అరెస్ట్ చేసి , వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. అల్లర్లకు బాఽధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కారకులపై కఠిన చర్యలు
భైంసాలో ఘర్షణకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. భైంసా ఘటనను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వివరించారు.
Courtesy Andhrajyothi