ఇదేమీ రాచరికం కాదు

0
217
  • ఉద్యోగులపై నిర్దయ సరికాదు..
  • అగ్గి రాజేసి చలి కాచుకుంటారా: హైకోర్టు
  • పంతాలొద్దు..చర్చలకు పిలవండి..
  • సెలవులెందుకు పొడిగించారు?
  • ప్రభుత్వంపై మండిపాటు.. వెంటనే ఎండీని నియమించాలని సూచన
  • ఇరుపక్షాలూ వెనక్కి తగ్గాలి.. 18లోగా పరిష్కారంపై ఆశాభావం
  • కార్మికులవి గొంతెమ్మ కోరికలు.. చంద్రుణ్నే కోరితే సాధ్యం కాదు
  • పారిశ్రామిక వివాదాల్లో జోక్యం వద్దు: అదనపు ఏజీ రామచంద్రరావు
  • సాంకేతిక కారణాలతో ప్రజలకు అసౌకర్యం కలిగించరాదన్న కోర్టు

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండి పడింది. అగ్గి రాజేసి చలికాచుకోవద్దని, సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇరు పక్షాలూ ఒక అడుగు వెనక్కి తగ్గి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోడానికి ముందుకు రావాలని సూచించింది. పంతాలకు, పట్టింపులకు పోవద్దని హితవు పలికింది. తక్షణమే ఆర్టీసీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ మొండివైఖరి వల్ల హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు పెండింగ్‌లో పడుతున్నాయని వ్యాఖ్యానించింది. లోకాయుక్తను నియమించరు, బాలల సంరక్షణ కమిటీలు (సీడబ్ల్యుసీ) వేయరు, ఆర్టీఐ కమిషనర్లను, మానవహక్కుల కమిషన్‌ను నియమించరు.. ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించింది. ఖాళీ పోస్టులు ఎందుకు భర్తీ చేయరని నిలదీసింది. ఈ నెల 18లోగా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీని.. గుర్తింపు పొందిన ట్రేడ్‌యూనియన్లను ఆదేశించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఆర్‌. సురేందర్‌సింగ్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది.

బడుల సెలవులు ఎందుకు పొడిగించారు?…ఆర్టీసీ సమ్మె వల్ల సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని.. ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌. ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, 70ు బస్సులు తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. దీనికి సీజే.. సమ్మె వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, సమ్మె కారణంగా పాఠశాలలకు వారం రోజులు సెలవులు పొడిగించారని గుర్తుచేశారు. ఒకవైపు ఎలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామని చెబుతూనే.. సెలవులు ఎందుకు పొడిగించారని ధర్మాసనం నిలదీసింది. 70% బస్సులు తిరుగుతున్నాయని అంటున్నారు. మరి మిగతా 30% బస్సుల సంగతేంటని ప్రశ్నించింది.

దీనికి ఏజీ.. డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి పత్రికా ప్రకటన ఇచ్చామని, లైసెన్సులు పరిశీలించి నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. తిరిగి కల్పించుకున్న ధర్మాసనం.. గడచిన 10 రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఎంతమంది డ్రైవర్లు, కండక్టర్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు? వారిలో ఎందరిని నియమించారని ప్రశ్నించింది. ఈ నెల 14న 6,196 బస్సులు నడిపినట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు ముందు 9,889 బస్సులు తిరిగేవి. ఇప్పుడు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, మాక్సీక్యాబ్‌లతో కలిపి 6 వేలే తిరుగుతున్నాయి. సుమారు 3-4వేల బస్సులు తిరగట్లేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేసినట్లు లేదు. ఈ రోజు పేపర్‌ చూస్తే ఆర్టీసీ సమ్మె వల్ల మెట్రో రైళ్లలో రద్దీ పెరిగినట్టు ఉంది’’ అని వ్యాఖ్యానించింది. దీనికి ఏజీ.. 1-2 రోజుల్లో తగిన చర్యలు చేపడతామని తెలిపారు.

ప్రమాదాలపై నిందలు ముఖ్యం కాదు….డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా బస్సులు అప్పగించడం వల్ల ప్రజలు, ప్రయాణికుల ప్రాణాలకు హానికలిగే ప్రమాదం ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ క్రిష్ణయ్య కోర్టుకు తెలిపారు. దీనికి సీజే.. ఎన్ని ప్రమాదాలు జరిగాయి? ఆర్టీసీ సిబ్బంది నిర్వహణలో సరాసరి ఎన్ని ప్రమాదాలు జరిగాయి అని ప్రశ్నించారు. ఇంత పెద్ద సంస్థ నిర్వహణలో ఎక్కడో ఒకచోట ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని.. నిందారోపణలు చేయడం ముఖ్యం కాదని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని వ్యాఖ్యానించారు. కాగా, ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు ఏజీ జె.రామచంద్రరావు.. సెప్టెంబరు 16న లేబర్‌ కమిషనర్‌ ముందు చర్చలకు రావాలని ఆర్టీసీ నోటీసు జారీచేసిందని, కానీ పాలనాపరమైన సమస్యలవల్ల వాయిదా వేసిందని కోర్టుకు తెలిపారు. పారిశ్రామిక వివాదంలో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం.. సాంకేతిక కారణాలు చూపి ప్రజలకు అసౌకర్యం కలిగించడం సరికాదంది. న్యాయపరమైన వివాధాలను సాధ్యమైనంత వరకు చర్చలద్వారా పరిష్కరించుకోవాలేగానీ మంట వేసి చలి కాచుకోరాదని వ్యాఖ్యానించింది. దీనికి అదనపు ఏజీ.. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని ఆరోపించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే రేపు మరో కార్పోరేషన్‌ తమను కూడా వీలీనం చేయాలని కోరే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీనం చేయడం సాధ్యపడదన్నారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం..సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సేవల్లో ఉన్నవారు సమ్మెకు దిగడం సరైన విధానం కాదు. ఎస్మాచట్టాన్ని ఎందుకు ప్రయోగించరాదు అని కార్మిక సంఘం తరపు సీనియర్‌ న్యాయవాది డి. ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించింది. దానికి ప్రకాశ్‌రెడ్డి.. ఆర్టీసీ కార్మికులు కేవలం జీతం కోసమే సమ్మెకు దిగలేదని వివరణ ఇచ్చారు. సంస్థకు కొంతకాలంగా శాశ్వత ఎండీ లేరని, ఇన్‌చార్జి ఎండీ సమస్యలను పట్టించుకోవట్లేదని తెలిపారు. దీనికి ధర్మాసనం.. సమ్మెచేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కార్మికులు మరో విధంగా తమ నిరసనను తెలియపరచవచ్చు. పెద్ద పండగ ముందు ప్రజలకు అసౌకర్యం కలిగించేలా సమ్మెకు దిగడం ఏమిటి అని ప్రశ్నించింది. దీనికి ఆయన.. ప్రభుత్వం కార్మికులపట్ల అహంకారంగా వ్యవహరిస్తోంది. 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరకపోతే కార్మికులు తమంత తామే సెల్ఫ్‌ డిస్మిస్‌ అవుతారని సీఎంవో కార్యాలయం ప్రకటన జారీచేసింది అని ధర్మాసనానికి తెలిపారు.

ఇదేమైనా టగ్‌ ఆఫ్‌ వారా?..కార్మిక సంఘాలు సెప్టెంబరు 11న సమ్మె నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. లేబర్‌ కమిషనర్‌ ముందు చర్చలకు రావాలని నోటీసు ఇచ్చి ఏ కారణం చూపకుండా దాన్ని ఉపసంహరించారన్నారు. దీనికి ధర్మాసనం.. ఇదేమీ పోటాపోటీకాదు (టగ్‌ ఆఫ్‌ వార్‌), సామాన్యప్రజల సమస్య. ప్రభుత్వం కార్మికుల పట్ల, ప్రజలపట్ల సున్నితంగా వ్యవహరించాలి.అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన ప్రకటనలతో ప్రజలను భయపెడుతోందని న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి వ్యాఖ్యానించగా.. తప్పుదారిలో వెళ్తున్న పిల్లలను తండ్రి హెచ్చరిస్తారు. అంతమాత్రాన వదిలేస్తారా? ఎవరో ఒకరు కొంత తగ్గి డిమాండ్లు ఎలా సాధించుకోవాలో ఆలోచించాలి అని ధర్మాసనం సూచించింది.

సమస్య పరిష్కారానికే చర్చల…ఆర్టీసీ కార్మికుల సీసీఎస్‌, పీఎఫ్‌ నిధులను ప్రభుత్వం వాడుకుందని, వారు రోడ్డున పడ్డారని ప్రకాశ్‌ రెడ్డి కోర్టుకు తెలుపగా.. ఆ సొమ్మును సంస్థ మనుగడ కోసం ఖర్చుచేసి ఉండొచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది.రోమ్‌ నగరాన్ని ఒక్క రోజులో నిర్మించలేదు. సమస్య పరిష్కారానికే చర్చలు జరపాలి. లేబర్‌ కమిషనర్‌తో చర్చలు పరిష్కారం దిశగా సాగాలి’ అని సూచించింది. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది.. ప్రభుత్వం అసలు చర్చలే ఉండవని చెబుతోంది. ఇంకెవరితో చర్చలు జరపాలి అని ప్రశ్నించారు. పారిశ్రామిక వివాదల చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం లేబర్‌ కమిషనర్‌తో చర్చలు జరుగుతుండగా సమ్మెకు దిగడం చట్టవ్యతిరేకమని ధర్మాసనం గుర్తుచేయగా.. లేబర్‌ కమిషన్‌ ఎలాంటి నివేదికా ఇవ్వలేదని, చర్చలే జరగకుండా నిరవధికంగా వాయిదా వేశారని కోర్టుకు వివరించారు. 48 వేల మంది సెల్ఫ్‌ డిస్మిస్‌ అంటూ తొలగించారన్నారు. ఈ సమయంలో అదనపు ఏజీ కల్పించుకుని.. దానికి సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్స్‌ ఇవ్వలేదన్నారు. 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని.. సెల్ఫ్‌ డిస్మిస్‌ అంటూ ప్రకటనలు జారీచేస్తున్నారన్నాని, ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో గమనించాలని ప్రకాశ్‌రెడ్డి పేర్కొనగా.. మీరేం చెబుతార’ని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఏజీ.. ప్రభుత్వ విధానమేంటో కౌంటర్‌లో తెలిపామన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేసి అక్టోబరు 1న చర్చలకు ఆహ్వానించామన్నారు. ఎంత నచ్చజెప్పినా కార్మికులు దిగిరాలేదన్నారు

ఎలాంటి చర్యలు చేపట్టారు?…ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని ధర్మాసనం నిలదీసింది. ప్రభుత్వ ప్రకటనలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలని వ్యాఖ్యానించింది. కార్మికుల జీవితాలు బాగుపడేలా మెరుగైన జీతభత్యాలు ఉండాలని, కార్మికులపై శీతకన్ను వేయరాదని సూచించింది. 2015లో 44ు ఫిట్‌మెంట్‌ ఇచ్చామని ఏజీ తెలుపగా.. ‘అప్పుడు ఇచ్చారు సరే, మరి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నార’ని ధర్మాసనం నిలదీసింది. ‘ధర్మశాస్త్రం ప్రకారం ప్రజలను సొంతపిల్లలుగా భావించాలి. వారి కష్టాలు తీర్చేవిధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. మన ప్రజల పట్ల మనమే ఇంత నిర్థయగా ఉంటే ఎలా? ఇదేమీ బ్రిటీషు రాచరికం కాదు. ప్రజాస్వామ్యంగా ఉండాలి. రెండు వైపులా చూడాలి, తక్షణమే పరిష్కరించ దగ్గ డిమాండ్లు చూడాలి. ట్రేడ్‌యూనియన్‌-ప్రభుత్వం మధ్య ప్రజలు నలిగిపోరాదు అని వ్యాఖ్యానించింది.

పరిష్కారానికి ఏం చేస్తున్నారు?..సమ్మె పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో బుధవారంలోగా చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నా కార్మికులు కలిసి రాలేదని అదనపు ఏజీ ఆరోపించారు. దీనికి సీజే.. ఆర్టీసీ సంస్థకు ఎండీని ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఇన్‌చార్జి ఎండీ ఉన్నారని ఏఏజీ బదులివ్వగా.. ఇన్‌చార్జి ఎండీ కంటితుడుపు చర్య, శాశ్వత ఎండీ నియామకానికి అడ్డంకులేంటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. ముందు సంస్థకు ఎండీని నియమించి, ప్రాధాన్యతా క్రమంలో డిమాండ్ల పరిష్కారానికి కృషిచేయాలని సూచించింది. ఎండీ నియమకం అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఏఏజీ తెలుపగా.. పరిశీలన కాదు పనులుకావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. ఆ సంస్థకు ఏటా రూ.1100 కోట్ల మేర ప్రభుత్వం సాయం చేస్తోందని ఏఏజీ చెప్పబోగా.. తక్షణమే సంస్థకు ఎండీని నియమించడం పెద్ద భారమేమీ కాదు అని సీజే వ్యాఖ్యానించారు.

40-50 ఏళ్ల అవసరాలను తీర్చేలా ఉండాలి…గతాన్ని విస్మరించండి. ఇకమీదట ఏం జరగాలో చూడండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే 40-50 సంవత్సరాల్లో ప్రజల అవసరాలు తీర్చేలా కార్పోరేషన్‌ ఉండాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఏఏజే అన్నారు. దీనికి సీజే.. 18లోగా శుభవార్త చెబుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా.. ఆర్టీసీ సమ్మెను విరమింపజేయాలని, కార్మికులకు సెప్టెంబరు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని, ప్రైవేటు పాఠశాలలకు అదనపు సెలవులు రద్దు చేయాలని కోరుతూ మరో మూడు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

తెలంగాణకు ఏం తక్కువ? ..కొత్త బస్సులు కొనాలన్న కార్మికుల డిమాండ్‌ ప్రజల కోసం, సంస్థ కోసం అని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. అంత బడ్జెట్‌ లేదని ఏఏజీ తెలిపారు. దీనికి ధర్మాసనం.. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ ఆర్టీసీలు ఇంతకంటే మెరుగ్గా నడుస్తున్నాయి. తెలంగాణాకు ఏం తక్కువ? సౌకర్యాలు మెరుగ్గా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ప్రభుత్వ విజన్‌-2020 కారాదు. అది 2040గా ఉండాలి. అప్పటికి.. ఎంత జనాభా ఉంటుంది? ఎన్నిబస్సులు అవసరం అవుతాయో గుర్తించాలి అని సూచించింది.

Courtesy Andhrajyothi…

 

Leave a Reply