లెక్కలు ఇదిగో!

0
442

– లాక్‌ డౌన్‌లో వలస కూలీల మరణాలపై కేంద్రం దాటవేత
– సర్వత్రా విమర్శలు.. లెక్కల చిట్టా విప్పిన ‘నవతెలంగాణ’
– మూడు నెలల్లో 322 మంది వలస కూలీల మృతి
– అనధికారికంగా వెయ్యి ఉండొచ్చు: స్వతంత్ర ఏజెన్సీలు
– బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోనే ఎక్కువ మరణాలు
– శ్రామిక రైళ్ల వల్లనే 80 మంది బలి
– ఆపన్నులను ఆదుకోవడంలో ఆదర్శంగా నిలిచిన కేరళ, ఢిల్లీ

స్రవంతి

కలో గంజో తాగే బతుకులు.. పిల్లలకు పట్టెడు మెతుకులతో కడుపు నింపుదామని కన్నతల్లిని, పుట్టిన గడ్డపై మమకారాన్ని వదలి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలకు తరలి వెళ్లాయి. అలా వెళ్లిన ఆ అమాయకులపై కరోనా కాటు వేసింది. మహ మ్మారి విజృంభణతో సొంతూర్లకు భార్య, బిడ్డలతో తిరుగు పయనమైన వారిని కష్టాలు చుట్టుముట్టాయి. ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించింది. ఫలితం కండ్ల నుంచి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఎంత చేసినా.. చివరి నిమిషంలో ఎవ్వరికీ అక్కరకురాకుండా పోయిన వలస కూలీల బతుకు చిత్రం.. లాక్‌ డౌన్‌లో ఛిద్రమై పోయింది. అయితే, కరోనా వైరస్‌ లాక్‌ డౌన్‌ సమ యంలో వలస కార్మికుల మరణాలకు సంబంధించిన గణాంకాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వలస కార్మికుల మరణాలపై మీడియాలో వార్తలు వచ్చాయి. లాక్‌ డౌన్‌ మొదలైన మార్చి చివరి వారం నుంచి జూన్‌ నాలుగో వారం వరకు మూడు నెలల వ్యవధిలో ఎంతమంది వలస కార్మికులు మరణించారు? మరెంత మంది గాయపడ్డారు? ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలను ‘నవతెలంగాణ’ క్షేత్రస్థాయిలో సేకరించింది. నిప్పులాంటి ఆ నిజాలపై ప్రత్యేక కథనం..

యూపీలోనే ఎక్కువ మరణాలు

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ గణాంకాల ప్రకారం దేశంలో 13.9 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. అయితే, అనధికార లెక్కల ప్రకారం.. ఈ సంఖ్య మరో నాలుగు రెట్లు ఎక్కువ ఉండొచ్చని అంచనా. లాక్‌ డౌన్‌ కారణంగా పట్టణాలు, నగరాల్లో పనులులేక లక్షలాది మంది వలసకూలీలు సొంత గ్రామాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో మార్చి 27 నుంచి జూన్‌ 26 మధ్య దాదాపు 322 మంది వలస కూలీలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ మరణాలు కేవలం వివిధ పోలీసు స్టేషన్‌లు, దవాఖానాలు, బాధిత కుటుంబ సభ్యులు ‘నవతెలంగాణ’ ప్రతినిధులకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ప్రకటించినవి మాత్రమే. లెక్కలోకి రాని వలస కూలీల మరణాలు వెయ్యికిపైగా ఉంటాయని స్వతంత్ర ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలో తేలింది. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ లోనే ఎక్కువ వలస కూలీల మరణాలు (105 మరణాలు) నమోదయ్యాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ లో 45 మంది, మహారాష్ట్రలో 41 మంది, బీహార్‌ లో 32 మంది వలస కార్మికులు మత్యువాతపడ్డారు. మిగిలిన మరణాలు వివిధ రాష్ట్రాల్లో సంభవించాయి.

మరణించడానికి కారణాలు ఇవే

లాక్‌ డౌన్‌ కారణంగా సొంతూర్లకు వెళ్తున్న వలసకూలీలు ప్రభుత్వ అలసత్వం వల్ల వివిధ కారణాలతో ప్రాణాలు వదిలారు. ఆకలి, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, అలసట, గుండె నొప్పి, వాంతులు, రక్త విరేచనాలు, ఛాతిలో నొప్పి, శ్వాస సమస్యలు, కడుపు నొప్పి, అలసట, అడవి గుండా వెళ్ళేటప్పుడు విష సర్పాలు కాటువేయడం, సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడం వల్ల వలస కూలీలు ప్రాణాలు వదిలారు.

80 మంది ఉసురు తీసిన శ్రామిక రైళ్లు

వలస కార్మికులను స్వగ్రామాలకు తరలించడం కోసం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పగా చాటింపు వేసింది. అయితే, ఈ రైళ్ళే 80 మంది వలస కార్మికుల ఉసురును తీశాయి. నిర్వహణ లోపం, భద్రతా చర్యల్లో లోపాలు, సౌకర్యాలు కల్పించకపోవడం, ఆహారం అందించకపోవడం, సరైన సమయంలో వైద్య సహాయం అందకపోవడం, రైలు ప్రమాదాలు తదితర కారణాల వల్ల శ్రామిక రైళ్లు ఇంతమంది కార్మికులను పొట్టనబెట్టుకున్నాయి. మే8న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పట్టాలపై సేదతీరు తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లడంతో 16మంది మరణించారు. మే 16న ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో వలస కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కును, ఒక వ్యాను ఢకొీనడంతో 27 మంది చనిపోయారు. బీహార్‌ లోని ముజఫర్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌లో మరణించిన తల్లిని (వలస కార్మికురాలు) నిద్రలేపుతున్న ఓ చిన్నారి హదయవిదారక దృశ్యం యావత్‌ భారతాన్ని కదిలించింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో మరెన్నో..

కేరళ, ఢిల్లీ ఆదర్శం
వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్రం మీనమేషాలు లెక్కపెట్టినప్పటికీ.. కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ముమ్మర చర్యలకు నడుంకట్టాయి. వలస కార్మికుల కోసం కేరళ రాష్ట్రవ్యాప్తంగా రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. పౌష్టిక ఆహారాన్ని, నాణ్యమైన వైద్య సాయాన్ని అందించింది. కూలీలను రాష్ట్రాలకు పంపించేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాల్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ సర్కార్‌ కూడా 500 రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేసి రోజుకు సుమారు 4 లక్షల మందికి ఆహార ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసింది.

వలస కూలీల మరణాలు ఇలా..

– రోడ్డు ప్రమాదాలు, ఆహారంలేక మరణించిన వాళ్లు – 234
– శ్రామిక రైళ్లలో మరణించిన వాళ్ళు – 80
– అనారోగ్యం, ఇతరత్రా కారణాలు – 8

Leave a Reply