ఉద్యోగాల ఊచకోత!

0
39
  • వేలాది ఉద్యోగులపై టెక్‌ కంపెనీల వేటు
  • అమెజాన్‌ 18 వేలు.. మైక్రోసాఫ్ట్‌ 10 వేలు
  • 12 వేల మందిని తీసేస్తామంటున్న గూగుల్‌
  • నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వారికి
  • ఢోకా ఉండదు: టెక్‌ నిపుణుల భరోసా

మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌.. అన్నీ దిగ్గజ కంపెనీలే! తమ తమ రంగాల్లో ఏకఛత్రాధిపత్యం అనుభవిస్తున్న బహుళజాతి సంస్థలే!! కానీ.. కరోనా దెబ్బకుతోడు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచదేశాలను అలుముకుంటున్న ఆర్థికమాంద్యం కారణంగానో, మరే కారణంతోనో.. ఈ సంస్థలన్నీ ఉద్యోగాల ఊచకోత షురూ చేశాయి! 2008లో వచ్చిన మహామాంద్యం సమయంలో టెక్‌ కంపెనీలు దాదాపు 65 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఆ మరుసటి ఏడాదిలోనూ దాదాపు అంతే సంఖ్యలో వేటు వేశాయి. ప్రస్తుత ‘ఊచకోత’లో మహామాంద్యంనాటి కోతలకు మించి ఉద్యోగాలపై వేటు పడడం గమనార్హం. ‘లేఆఫ్స్‌ డాట్‌ ఎఫ్‌వైఐ’ వెబ్‌సైట్‌ గణాంకాల ప్రకారం.. ఒక్క 2022లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి టెక్‌ కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయి!! అంతకుముందు రెండేళ్లలో..

అంటే కరోనా విలయతాండవం చేసిన 2020, 21 సంవత్సరాల్లో 1,495 కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 2.4 లక్షలు. నిజానికి ఏడాదో, రెండేళ్లో ఆర్థిక మాంద్యం అలుముకున్నంత మాత్రాన దాన్ని తట్టుకోలేనంత చిన్న సంస్థలు కావవి. అయినా ఎందుకిలా ఉద్యోగులను తొలగిస్తున్నాయి? అంటే.. దాని మూలాలు ఈ కంపెనీల పెట్టుబడుల్లో ఉన్నాయని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డెరెక్‌ థాంప్సన్‌ వివరిస్తున్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం.. 2008లో వచ్చిన మహా మాంద్యం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ బలహీన పడ్డాయి. అగ్రిగేట్‌ డిమాండ్‌ (అంటే వస్తు, సేవలకు డిమాండ్‌) బాగా తగ్గిపోయింది. రుణాలకు డిమాండ్‌ తక్కువగా ఉండడంతో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు తగ్గించాయి. ఆ సమయంలో.. వెంచర్‌ క్యాపిటలిస్టులు మార్జినల్‌ కాస్ట్‌ తక్కువగా ఉండే సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పెట్టుబడులు కుమ్మరించారు. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల యుగం ఊపందుకుంది కూడా ఇంచుమించుగా అప్పుడే(మొట్టమొదటి ఐఫోన్‌ 2007 జూన్‌లో మార్కెట్లోకి వచ్చింది). దరిమిలా యాప్‌ల విప్లవం మొదలైంది. ఇలా ఒకదాని వెంట మరొకటిగా టెక్‌ విప్లవాలు రావడంతో సోషల్‌మీడియా (ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటివి), కన్స్యూమర్‌ టెక్‌ (గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటివి) కంపెనీలు అత్యంత వేగంగా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న కంపెనీలుగా ఎదిగాయి. కంటెంట్‌ అంతా డిజిటల్‌ రూపంలోకి మారిపోయింది.

అడ్డుకట్ట..
దశాబ్దన్నర కాలంగా దూసుకుపోతున్న టెక్‌ కంపెనీల జోరుకు కరోనా అనంతర ద్రవ్యోల్బణం అడ్డుకట్ట వేసింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచడంతో వెంచర్‌ క్యాపిటలిస్టులు టెక్‌ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. ప్రపంచమంతా మళ్లీ ఆర్థిక మాంద్యం దిశగా నడుస్తోందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దీంతో ఆయా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోక తప్పని పరిస్థితి. అందుకే ఈ ‘కోతల పర్వం’. డెరెక్‌ థాంప్సన్‌ విశ్లేషణ ప్రకారం.. మహామాంద్యం తర్వాత పరుగు ప్రారంభించిన టెక్‌ కంపెనీల ప్రాథమిక సమస్యలన్నీ ఈ పది-పదిహేనేళ్లలో తీరిపోయాయి! దీంతో అవన్నీ తదుపరి తరం టెక్నాలజీలపై దృష్టి సారించాయి. నిజానికి డెరెక్‌ కన్నా నాలుగేళ్ల ముందే ఈ విషయాన్ని ప్రముఖ టెక్‌ విశ్లేషకుడు బెన్‌ ఇవాన్స్‌ ఊహించి చెప్పారు. ‘‘ఒక అధ్యాయం ముగిసింది. టెక్‌ ఎగ్జిక్యూటివ్‌లు, పెట్టుబడిదారులు కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని ఆయన నాడే తెలిపారు. కృత్రిమ మేధ, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ వంటివాటి రూపంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఏళ్లు గడిచినా అప్‌డేట్‌ కాని ఉద్యోగులను వదిలించుకుని కొత్త టెక్నాలజీల దిశగా కంపెనీలు సాగిపోతున్నాయి. ఉదాహరణకు.. అమెజాన్‌ సంస్థ తన కృత్రిమమేధ అయిన అలెక్సాను మరింత మెరుగుపరిచేందుకు ఇటీవలే 10 వేలమందికిపైగా టెకీలను నియమించుకుంది. ఆ సంస్థ అధిపతి జెఫ్‌బెజోస్‌ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ వ్యవస్థాపకుడు అయి ఉండీ.. ‘త్వరలో మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరూ టీవీలు, ఫ్రిజ్‌ల వంటివి కొనొద్దు. డబ్బులు దాచుకోండి’ అని హెచ్చరించారు. ఇక.. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా సైతం ‘రియాలిటీ ల్యాబ్స్‌’ పేరుతో మెటావర్స్‌ను నిర్మించే విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. దాంట్లో ఉద్యోగుల సంఖ్య అక్షరాలా 15 వేలు. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ తయారీ కోసం యాపిల్‌ సంస్థ 3 వేల మందికి పైగా టెకీలను నియమించుకుంది. గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వేలాదిమంది టెక్నాలజీ నిపుణులు పనిచేస్తున్నారు.

మనపై ప్రభావం ఎంత?
మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి ప్రఖ్యాత సంస్థల్లో మనోళ్లదే కీలకపాత్ర. ఈ నేపథ్యంలో.. తాజా తొలగింపుల సెగ భారతీయులకు బాగానే తగులుతోంది. ఉదాహరణకు.. అమెజాన్‌కు భారతదేశంలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు. ఆ సంస్థ అంతర్జాతీయంగా తలపెట్టిన 18000 ఉద్యోగాల కోతలో భాగంగా.. భారత్‌లో వెయ్యి మందిని తొలగించనున్నట్టు సమాచారం. ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మాన్‌ శాష్‌కు మనదేశంలో 9000 మంది ఉద్యోగులు ఉండగా వారిలో కనీసం 500 మందిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. శ్నాప్‌చాట్‌ సంస్థ 1200, ట్విటర్‌ 7500 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీరిలో మనవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారని అంచనా. కాగా.. టెక్‌ కంపెనీల లేఆ్‌ఫలను చూసి భయపడాల్సిన పని లేదని.. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకునేవారికి భవిష్యత్తుపై భరోసా ఎప్పుడూ ఉంటుందని పలువురు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంత మంచి హోదాలో ఉన్నా..

కృత్రిమ మేధ, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ వంటివాటిపై దృష్టిపెట్టి వాటిల్లో నైపుణ్యాలు సాధించినవారిదే భవిష్యత్తు అని వారు స్పష్టం చేస్తున్నారు. అలాగే.. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో అధికంగా నియమించుకున్నవారిని అమెజాన్‌ వంటి సంస్థలు ఇప్పుడు తొలగిస్తున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోతను చూసి ఆందోళన చెందాల్సిన పని లేదని.. కొన్ని కంపెనీలు అమెరికా, యూరప్‌ దేశాల్లో తమ సిబ్బందిని తగ్గించుకుని.. ఇండియా వంటి దేశాల నుంచి రిమోట్‌గా పనిచేసేవారిని నియమించుకునే ప్రణాళికల్లో ఉన్నాయని, కాబట్టి మన టెకీలకు మంచే జరుగుతుందని క్వెస్‌ ఐటీ సిబ్బంది సేవల సంస్థ సీఈవో విజయ్‌ శివరామ్‌ అభిప్రాయపడ్డారు.

అమెజాన్‌ తన 28 ఏళ్ల చరిత్రలోనే అత్యధికంగా 18 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది! మైక్రోసాఫ్ట్‌ 10 వేల మంది తొలగింపునకు గురి పెడితే.. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 12 వేల మందిని తొలగిస్తానంటోంది. ఇక ఈ ఏడాది జరిగిన ‘కోత’ల్ని చూస్తే.. 104 టెక్‌ కంపెనీలు జనవరి 15లోపు 24 వేల మందిని తొలగించేశాయి! ఇప్పుడు దిగ్గజ సంస్థలూ అదేబాట పట్టాయి!

1600
ఈ సంవత్సరం.. అంటే 2023లో మొదటి పదిహేను రోజుల్లో ప్రపంచవ్యాప్తంగాఅన్ని టెక్‌ కంపెనీలూ కలిసి రోజుకు సగటున 1600 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.

15 రోజులు.. 24 వేల మందిపై వేటు
మనదేశంలో కోతల విషయానికి వస్తే.. జనవరి 1 నుంచి 15 నడుమ 91 టెక్‌ కంపెనీలు 24 వేల మంది టెకీలపై వేటు వేశాయి. దేశీ సామాజిక మాధ్యమం షేర్‌చాట్‌ ఈ ఏడాది తన ఉద్యోగుల్లో 20ు మంది (దాదాపు 500 మంది)ని తొలగించింది. ట్విటర్‌, గూగుల్‌, శ్నాప్‌చాట్‌ అన్నీ కలిసి 2300 మందిని ఈ ఇరవై రోజుల్లోనే తొలగించాయి. ఓలా 200 మంది ఉద్యోగులపై వేటు వేయగా.. డంజో 3 శాతాన్ని ఇంటికి పంపింది.

Leave a Reply