ముగ్గురు బాధితులు

0
348
డా౹౹ అంబేద్కర్

తొంభై సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరితీసింది. మరాఠీ పత్రిక ‘జనత’ లో డాక్టర్  అంబేడ్కర్ దీనిపై ఎడిటోరియల్ రాశారు. ఆ ముగ్గురు యువ యోధులను బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు ఉరితీసిందో విశ్లేషిస్తూ 1931 ఏప్రిల్ 13 ‘జనత’ సంచికలో ‘ముగ్గురు బాధితులు’ అనే పేరుతో ఆయన ఈ సంపాదకీయం రాశారు. ‘ఫార్వార్డ్ ప్రెస్’ అనే వెబ్‌సైట్ 2018 మార్చి 22న దీనిని ఇంగ్లీష్‌లో ప్రచురించింది. బాబాసాహెబ్ మనుమడు, నేడు భీమాకోరేగావ్ కుట్రకేసులో జైలులో ఉన్న డాక్టర్ ఆనంద్ టేల్తుంబ్డే మరాఠీ మూలం నుండి ఇంగ్లీష్‌లోకి ఆ సంపాదకీయాన్ని అనువదించారు. ఆ ఇంగ్లీష్ పాఠానికి డాక్టర్ సతీష్ కుమార్ స్వేచ్ఛానువాదమిది.

చివరికి భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులను ఉరితీశారు. సాండర్స్ అనే ఆంగ్ల పోలీసు అధికారి, చమన్ సింగ్ అనే సిఖ్ సిపాయిని హత్య చేశారనే నేరం ఆ ముగ్గురిపై మోపబడింది. అంతేగాక బెనారస్‌లో పోలీస్ ఇన్ స్పెక్టర్ పై హత్యా ప్రయత్నం, అసెంబ్లీలో బాంబులు విసరడం, మౌలీమియా గ్రామంలో ఒక ఇంటిలో దొంగ తనం, విలువయిన వస్తువుల లూటీ లాంటి మరికొన్ని నేరారోపణలు వాళ్లపై మోపబడ్డాయి. భగత్ సింగ్ అప్పటికే అసెంబ్లీలో బాంబులు విసిరిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ నేరానికి గాను భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్‌లకు ఇప్పటికే జీవిత ఖైదు విధించారు. భగత్ సింగ్ సహచరుడు జై గోపాల్ అప్రూవర్‌గా మారి తాను, భగత్ సింగ్‌తో సహా మరికొంతమంది విప్లవకారులు కలిసి సాండర్స్‌ను హత్య చేశామని ఒప్పుకున్నాడు. ఆ నేరాంగీకారం ఆధారంగా ప్రభుత్వం భగత్ సింగ్, అతని సహచరులపై కేసు బనాయించింది. అయితే ఆ ముగ్గురు ముద్దాయిలలో ఏ ఒక్కరు కూడా కేసు నిమిత్తమై కోర్టులో హాజరు కాలేదు. ముగ్గురు హైకోర్టు జడ్జిలతో ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునల్ కేసు విని ఏకగ్రీవంగా అందరికీ మరణశిక్ష విధించింది.

మరణ శిక్షను అమలు చేయెద్దని, అవసరమైతే ఆ శిక్షను అండమాన్ జైలులో జీవిత ఖైదుగా మార్చాలని క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ చక్రవర్తికి, వైస్రాయ్‌కి భగత్ సింగ్ తండ్రి అర్జీ పెట్టాడు. ప్రముఖ నాయకులతో సహా అనేకమంది ప్రభుత్వానికి ఈ విషయం పై విన్నవించారు. గాంధీ, లార్డ్ ఇర్విన్ మధ్య జరిగిన చర్చల్లో కూడా భగత్ సింగ్ మరణ శిక్ష విషయం చర్చకు వచ్చి ఉండవచ్చు. భగత్ సింగ్ జీవితాన్ని కాపాడడంలో లార్డ్ ఇర్విన్ ఎటువంటి స్పష్టమయిన హామీ ఇవ్వక పోయినప్పటికీ, చర్చల సంధి కాలంలో గాంధీ ఇచ్చిన ఉపన్యాసం ముగ్గురు యువకుల జీవితాలను కాపాడడానికి ఇర్విన్ తన స్థాయిలో శాయ శక్తులా ప్రయత్నిస్తాడనే ఆశను రేకెత్తించింది. కానీ ఈ ఆశలు, అంచనాలు అన్నీ నీరుకారిపోయాయి. విన్నపాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ముగ్గురిని లాహోర్‌లోని సెంట్రల్ జైలులో 1931 మార్చ్ 23 సాయంత్రం 7 గంటలకు ఆ ముగ్గురికీ ఉరిశిక్ష అమలుపరిచారు. వారిలో ఏ ఒక్కరు కూడా క్షమాభిక్ష కోరలేదు.

ఉరికి బదులుగా తుపాకీ గుళ్ళతో కాల్చి చంపమని భగత్ సింగ్ చివరి కోరికగా కోరాడని అప్పటికే ఒక వార్త ప్రచురితమయినది. అయితే భగత్ సింగ్ కోరిన ఈ చివరి కోరికను కూడా మన్నించకుండా, ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలు చేశారు. చనిపోయేంతవరకు వరకు ఉరితీయాలనేది తీర్పు. ఒకవేళ వాళ్ళను తుపాకీ గుళ్ళతో కాలిస్తే తీర్పు అమలు ఖచ్చితంగా తీర్పుకు లోబడి ఉండేది కాదు. న్యాయదేవత ఆజ్ఞ శిరసావహించి, ఆమె ఆజ్ఞాపించిన పద్ధతిలో ఆ ముగ్గురు చంపబడ్డారు.

ఎవరికోసం ఈ బలి? న్యాయదేవతకు అంకితభావం, కచ్చితమైన విధేయత ప్రదర్శించడం ద్వారా ప్రజలు మెచ్చుకుంటారనో, తద్వారా ఈ హత్యలను ఆమోదిస్తారనో అని ప్రభుత్వం అనుకున్నట్టయితే అది ఉత్త అమాయకత్వం అవుతుంది. బ్రిటిష్ న్యాయ దేవత కు ఇచ్చిన ఈ బలి ఆ దేవతను స్వచ్ఛమయిన దానిగా, మచ్చలేని దానిగా నిలిపేందుకు అని అన్నా ఎవరూ నమ్మరు. ఒప్పుకోరు కూడా. ఇటువంటి అవగాహనతో ఆఖరికి ప్రభుత్వం కూడా తనను తాను ఒప్పించుకోలేదు. అటువంటప్పుడు ఇలా న్యాయదేవత అనే ముసుగు వేసి ఇతరులను ఎలా ఒప్పించగలుగుతుంది? ప్రభుత్వానికే కాదు, మొత్తం ప్రపంచానికి తెలిసిన సత్యం ఏమిటంటే ఇది న్యాయ దేవత పట్ల భక్తి మూలంగా కాక, తమ స్వస్థలమయిన ఇంగ్లాండ్‌లో కన్సర్వేటివ్ (సంప్రదాయ) పార్టీ, ప్రజాభిప్రాయం వలన కలిగిన భయం ఈ బలి ఇవ్వడానికి ప్రోత్సహించింది. గాంధీ లాంటి రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయడం, గాంధీ సమూహంతో చేసుకున్న ఒప్పందాలు బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రతిష్టను దెబ్బతీసింది అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రస్తుతపు లేబర్ పార్టీ మంత్రివర్గం, దాని పాటకు వంతపాడే వైస్రాయ్ లు మాత్రమే బ్రిటిష్ ప్రతిష్ట దిగజార్చడానికి బాధ్యులని ఇప్పటికే కొంతమంది కన్సర్వేటివ్ పార్టీకి చెందిన సనాతన వాద నాయకులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఇంగ్లీష్ అధికారి హత్యలో శిక్ష పడ్డ రాజకీయ విప్లవకారుల పై లార్డ్ ఇర్విన్ దయ చూపెట్టినట్టయితే ప్రతిపక్ష నాయకులకు మంచి అస్త్రాన్ని అందించినట్టే. ఇప్పటికే లేబర్ పార్టీ అస్థిరత్వంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కన్సర్వేటివ్ పార్టీ నాయకులకు లేబర్ పార్టీ ప్రభుత్వం ఒక ఇంగ్లీష్ అధికారిని చంపిన దోషులకు క్షమాబిక్ష ప్రసాదించింది అనే ఉప్పందితే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో మరింతగా రేకెత్తించడం చాలా సులువు.

ఈ తక్షణ సంక్షోభాన్ని నివారించడానికి, కన్సర్వేటివ్ నాయకుల మెదళ్లలో ఉన్న అగ్ని ఇంకా పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ ఉరితీతలు అమలు చేసారు. ఈ చర్య న్యాయదేవతను ప్రసన్నం చేసుకోవడానికి కాదని ఇంగ్లాండ్‌లోని ప్రజలను సంతృప్తి పరచడానికని తేటతెల్లం అవుతుంది. ఈ అంశం లార్డ్ ఇర్విన్ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన అంశమో లేక అతని అధికార పరిధిలో ఉన్న అంశమో అయినట్టయితే అతను మరణ శిక్షను రద్దు చేసి యావజ్జీవ శిక్షగా మార్పు చేసి ఉండి ఉండేవాడు. లేబర్ పార్టీ మంత్రివర్గం కూడా ఈ విషయంలో లార్డ్ ఇర్విన్‌కు మద్దతుగా ఉండేది. గాంధీ ఇర్విన్ ఒప్పందం సందర్భంలో ప్రజల సానుకూల అభిప్రాయాన్ని కొనసాగించడం చాలా అవసరంగా ఉండేది. లార్డ్ ఇర్విన్ దేశాన్ని విడిచి వెళ్తున్నప్పుడు ఈ గుడ్ విల్ (మంచి పేరు)ను సంపాదించుకోవడానికి ఇష్టపడేవాడు. అలా అయినట్లయితే లార్డ్ ఇర్విన్ ఇంగ్లాండ్‌లోని సంప్రదాయ సహచరుల కోపాగ్నికి, ఇక్కడి అదే సాంప్రదాయ విలువలతో కూడిన కులతత్వ బ్యూరోక్రసీ మధ్య నలిగిపోయి ఉండేవాడు. అందుకోసమని ఇక్కడి ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా/ విస్మరిస్తూ భగత్ సింగ్, అతని సహచరులను లార్డ్ ఇర్విన్ ప్రభుత్వం ఉరితీయడం జరిగింది అది కూడా కరాచీలో జరిగే కాంగ్రెస్ మహాసభకి నాలుగు రోజులు ముందు. ఈ సమయంలో భగత్ సింగ్, అతని సహచరులను ఉరి తీయడం ద్వారా గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని తూట్లు పొడవడానికి, ఒప్పందం లోని నిర్ణయాలు ఉత్తవే అనిచూపించడానికి సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ లార్డ్ ఇర్విన్ ఈ ఒప్పందాన్ని విఫలం చేయాలనుకుంటే ఇంతకంటే మంచి మార్గం మరోటి దొరికి ఉండేది కాదు. ఈ దృక్కోణం నుండి చూస్తే ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. గాంధీ కూడా ఇలానే అభిప్రాయ పడ్డారు.

మొత్తానికి ఇంగ్లాండ్‌లోని సంప్రదాయవాదుల (కన్సర్వేటివ్‌ల) కోపానికి గురికాకుండా ఉండేందుకు, భగత్ సింగ్, అతని సహచరులను బలి ఇచ్చారు. ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు సరికదా, దీని ద్వారా గాంధీ- ఇర్విన్ ఒప్పందానికి ఏమవుతుందో అని కూడా లెక్కచేయలేదు. కానీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంత దాయాలని ప్రయత్నించినా, ఎన్ని ముసుగులు వేయాలని ప్రయత్నించినా ఈ నిజం ఎప్పటికీ దాగదు.

ఇంగ్లీషు అనువాదం: డా౹౹ ఆనంద్ టేల్తుంబ్డే
స్వేచ్ఛానువాదం: డా౹౹ సతీష్ కుమార్

Courtesy Andhrajyothi

Leave a Reply