టుడే హెడ్ లైన్స్

0
246

తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.

హైదరాబాద్: తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్ తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ అంటే సామాజిక విలువల స్వరూపమని పేర్కొంటూ ఆయన బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 1, 38, 669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం : 22,061.18 కోట్లుగా చూపించారు. రెవెన్యూ మిగులు : 4,482.12 కోట్లు, ఆర్థిక లోటు : 33,191.25 కోట్లుగా బడ్జెట్ లో పేర్కొన్నారు. కాగా, బడ్జెట్ పూర్తి సమతుల్యతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి అవాస్తవాలతో ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

ఏపీలో ‘మున్సిపల్’ రిజర్వేషన్లు ఖరారు
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు ఏపీ మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. ఎన్నికలు జరగనున్న 12 కార్పొరేషన్లతో పాటు మొత్తం 16 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు వెల్లడించారు. మూడు కార్పొరేషన్లపై కోర్టులో వివాదాలున్నాయని వెల్లడించారు. 74 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. కాగా, రిజర్వేషన్లలో రిజర్వేషన్లలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది.

తెలుగు మహిళకు నారీశక్తి పురస్కారం
న్యూఢిల్లీ: తెలుగు మహిళ పడాల భూదేవి నారీశక్తి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఢిల్లీలో ఆదివారం ఈ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవి.. 1996 లో తన తండ్రి స్థాపించిన ఆదివాసి వికాస్ సొసైటీ ద్వారా గిరిజన మహిళలు, వితంతువులు, పోడు భూముల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలు రాష్ట్రపతి చేతులు మీదుగా నారీ శక్తి పురస్కారాలు స్వీకరించారు. 103 ఏళ్ల మన్ కౌర్‌ నారీశక్తి పురస్కారాన్ని అందుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీనాదేవి, అరిఫ్ జాన్, చామి ముర్ము, నిల్జా వాంగ్మో, రష్మీ ఉర్దువరేశి, మన్‌కౌర్, కళావతి దేవి, కౌషికీ చక్రవర్తి, అవని చతుర్వేది, భవనకాంత్, మోహనసింగ్, భగీరథి అమ్మ, కార్తియాని అమ్మ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.

మారుతీరావు ఆత్మహత్య
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలో ఉన్న ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి బలవన్మరణం చెందారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన కూతురు అమృత నిమ్నకులానికి చెందిన ప్రణయ్ ను పెళ్లి చేసుకుందన్న కక్షతో సుఫారీ ఇచ్చి అల్లుడిని హత్య చేయించాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తన కూతురిని తిరిగి ఇంటికి రప్పించేందుకు ఆయన చేసిన ఫలితాలు ఫలించలేదు. అల్లుడిని చంపించాడన్న పశ్చాతాపంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అమృత అన్నారు. మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో మిర్యాలగూడలోని అమృత ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తన అన్నయ్యతో తనకు ఆస్తి తగాదాలు లేవని మారుతీరావు సోదరుడు శ్రవణ్ వెల్లడించారు.

యస్ బ్యాంకు సంక్షోభం; కీలక పరిణామం
ముంబై : యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుమార్తె రోషిణి కపూర్ దేశం విడిచి వెళ్లిపోకుండా అధికారులు అడ్డుకున్నారు. లండన్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అధికారులు సకాలంలో స్పందించి ఆమెను ఆపగలిగారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రోషిణి కపూర్ లండన్ వెళ్ళే బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కుతుండగా అధికారులు అడ్డుకున్నారు. రోషిణి కపూర్ డైరెక్టర్ గా ఉన్న డోల్ట్ అర్బన్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ మనీలాండరింగ్ కేసులో ఈడీ నిఘాలో ఉంది.

మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా
మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఐదోసారి కైవశం చేసుకుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 85 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. 185 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు కనీస పోరాట పటిమ కూడా చూపలేకపోయింది. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 99 పరుగులకు ఆలౌట్ అయి ఘోర ఓటమిని చవిచూసింది.

Leave a Reply