- దళితబంధుపై అధికార పార్టీ రాబందు
- కమీషన్ కింద ట్రాక్టర్ ట్రాలీ లాక్కెళ్లిన నేత
- న్యాయం కోసం లబ్ధిదారుల వేడుకోలు
- భద్రాద్రి జిల్లా తెలగరామవరంలో ఘటన
కొత్తగూడెం కలెక్టరేట్/లక్ష్మీదేవిపల్లి : దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని.. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. ‘మా వల్లే మీకు ఈ పథకం కింద లబ్ధి చేకూరుతోంది. కాబట్టి మీకు యూనిట్‌పై వచ్చిన సొమ్ములో కమీషన్ కింద సగం మాకు చెల్లించండి’ అంటూ లబ్ధిదారులను పీడించుకు తింటున్నారు. ఇలాంటిదే ఓ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం తెలగరామవరంలో వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో అధికారపార్టీ నాయకుడొకడు.. తన కమీషన్ ఇవ్వలేదన్న కారణంతో లబ్ధిదారులు దళితబంధు కింద కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీని లాక్కెళ్లాడు. దళితబంధు పథకం కింద వచ్చేసొమ్ములో చెరో సగం అంటూ పలువురు లబ్ధిదారులతో సదరు నాయకుడు ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. ఆ గ్రామానికి చెందిన కండె సరోజ, రాములు దంపతులకు దళిత బంధు పథకం కింద ఆరు నెలల క్రితం ట్రాక్టర్ మంజూరైంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అందులో సగం.. అంటే రూ.5 లక్షలు తమకు ఇవ్వాలని అధికార పార్టీ నాయకుడు ఆ దంపతులపై ఒత్తిడి తెచ్చాడు. వారు ఇవ్వలేకపోవడంతో.. తన కమీషన్ కింద ట్రాక్టర్ ట్రాలీని అతడు తీసుకెళ్లిపోయాడు. ఆ దంపతులతో అతడు గతంలోనే రెండు అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. నిరుపేదలైన తమకు ఆర్థికాభ్యున్నతి కల్పించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అధికారపార్టీ నాయకులు ఇలా సొమ్ము చేసుకుంటూ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని లబ్ధిదారులుమండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కోరుతున్నారు.
5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు
’’ఆరు నెలల క్రితం దళితబంధు పథకం కింద మాకు ట్రాక్టర్ మంజూరైంది. కానీ.. ‘ఈ పథకం మంజూరవడానికి మీకెంతో సాయం చేశాం. అనుకొన్న ప్రకారం పథకంలో సగం డబ్బు.. అంటే రూ.5లక్షలు ఇవ్వాల’ని అధికారపార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. మా దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినలేదు. కనీసం రూ.2లక్షలైనా ఇవ్వాలన్నారు. అవీ లేవనడంతో ట్రాక్టర్ ట్రక్కు తీసుకెళ్లారు. కమీషన్‌గా ఇస్తామన్న డబ్బులు ఇచ్చి ట్రక్కు తీసుకెళ్లండి అంటున్నారు. మాలాంటి నిరుపేదలను కమీషన్ల పేరుతో అధికార పార్టీ నాయకులు పీడించడం బాధగాఉంది. దీనిపై విచారణ చేసి మాకు న్యాయం చేయాలి’’ అని దళిత బంధు లబ్ధిదారులు కండె సరోజ, రాములు కోరారు.