ప్రాణం తీసిన సరదా

0
33
  • బావిలో ఈత కొట్టేందుకు వెళ్లి బాలుడి మృతి
  • పండుగ పూట విషాదంలో కుటుంబసభ్యులు

యాలాల : సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు మృతిచెందాడు ఈ ఘటన బుధవారం వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కేపల్లికి చెందిన గుండప్ప-లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నవీన్‌(17) తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీపావళి సెలవులు కావడంతో మంగళవారం తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని అనంత్‌రెడ్డి బావిలో ఈతకు వెళ్లారు. అయితే, నవీన్‌కు ఈత రాకపోయినా తోటి స్నేహితులతో కలిసి బావిలో దిగాడు. ఈక్రమంలో ఈత కొట్టడానికి యత్నించిన నవీన్‌ నీటిలో మునిగిపోయాడు. దీంతో వెంటనే తోటి స్నేహితులు బావిలో వెతికారు. ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. తల్లిదండ్రులు వచ్చి వెతకసాగారు. అయినప్పటికీ నవీన్‌ను గుర్తించలేక పోయారు. బుధవారం అగ్నిమాపక సిబ్బంది సాయంతో నవీన్‌ మృతదేహాన్ని బయటికి తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply