అసాంజెకు చికిత్స అత్యవసరం

0
198

– వికిలీక్స్‌ సహ వ్యవస్థాపకుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ఆందోళన
లండన్‌: వికిలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జూలి యన్‌ అసాంజెకు చికిత్స అత్యవసరమని వైద్యబృం దాలు తెలిపాయి. ఒకవేళ ఆయనకు చికిత్స చేయకుంటే ఆస్పత్రిలోనే చనిపోయే ప్రమాద ముందని హెచ్చరించారు. అసాంజెను పరీక్షించిన 60 మంది సభ్యుల వైద్యబృందం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విచారణ పేరిట అసాంజెని వేధించినట్టయితే బ్రిటన్‌ జైలులోనే ఆయన చనిపోయే ప్రమాదముందని బ్రిటన్‌ హోంహొశాఖకు వైద్యుల బృందం సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అసాంజె ఆరోగ్య పరిస్థితిపై ఓ నివేదికను అందజేశారు.

అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక, అత్యంత రహస్యమైన దస్త్రాలను అసాంజె బహిర్గతం చేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహా రాల్లో అమె రికా ఏవిధంగా జోక్యం చేసుకుంటుందో ఆ దస్త్రాల్లో ఉన్నది. అసాంజె అందజేసిన సమాచారంతో అనేక దేశాలు అప్రమత్తమయ్యాయి. కీలక దస్త్రాలను బహిర్గతం చేసిన అసాంజెపై అమెరికా కక్ష పెట్టుకుంది. ఆయన్ను అప్పగించాలని పలుమార్లు బ్రిటన్‌ను కోరింది.
లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజె బ్రిటన్‌ జైలులో శిక్ష పొందుతున్నారు. అమె రికా మాత్రం అసాంజేను తమ దేశానికి రప్పించుకునే విషయమై ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవేళ అదే జరిగినట్టయితే అసాంజెకు అమెరికాలో 175ఏండ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. అసాంజె ను ఆరోగ్య కారణాలతో బెల్మార్ష్‌ జైలు నుంచి యూని వర్సిటీ టీచింగ్‌ ఆస్పత్రికి తరలించాలని హోం సెక్రటరీ ప్రీతిపటేల్‌, బ్రిటన్‌ దేశీయాంగ మంత్రికి రాసిన లేఖలో వైద్యులు కోరారు. లండన్‌లో గతనెల21న కోర్టుకు హాజరైన సందర్భంగా అసాంజెను చూసినవారు వెల్లడించిన వివరాలతో పాటు ఆయన ఎదుర్కొంటున్న వేధింపులపై ఐరాస ప్రతినిధి నిల్స్‌ మెల్జర్‌ నివేదిక ఆధారంగా తాము ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.

అసాంజెపై విచారణ పేరుతో వేధింపులు కొనసాగితే ఆయన జీవితం అంతమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హక్కుల నిపు ణులు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. 2010లో అఫ్ఘాన్‌, ఇరాక్‌ దేశాలపై అమెరికా దాడులకు సంబంధించిన సైనిక దౌత్య ఫైళ్లను అసాంజే వికీలీక్స్‌లో ప్రచురించడంతో అమెరికా ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
అసాంజెకు శారీరక పరిస్థితితో పాటు మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరిలో అమెరికాకు రప్పించే విషయమై వాదనలు జరగనుండగా అప్పటి లోగా అసాంజే ఆరోగ్యం మరింత విషమించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఇప్పుడు కనుక మానసిక వ్యాధికి సంబంధించిన చికిత్స, శారీరక వ్యాధులకు సంబంధించిన చికిత్స అందించకుంటే అసాంజే జైలులోనే మృతి చెందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసర చికిత్స అసాంజేకు అందజే యాలని సమయంను వృథా చేయకూడదని వైద్యులు చెప్పారు.

మానసికంగా శారీరకంగా
కృంగిపోయిన అసాంజే
ఆరు నెలల తర్వాత తొలిసారిగా కోర్టుకు హాజరైన అసాంజెను చూసిన వైద్యులు ఆయన చాలా బలహీనంగా ఉన్నాడని చెప్పారు. అంతేకాదు కోర్టు అడిగే ప్రశ్నలకు అసాంజె ఇచ్చిన సమాధానాలు చూస్తే మానసికంగా కూడా చాలా బలహీనంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కోర్టు తన పుట్టిన రోజు ఎప్పుడని అడుగగా ఆ తేదీ కూడా మరిచిపోయినట్టు వైద్యులు చెప్పారు. ఇక వాదనలు ముగిశాక కోర్టులో ఏం జరిగిందని జడ్జిని అసాంజె అడిగినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజే ఈక్వెడార్‌ ఎంబసీలో తలదాచుకోగా గత ఏప్రిల్‌లో ఆయనను తీసుకొచ్చి బ్రిటన్‌ జైలులో ఉంచారు.

Courtesy Navatelangana…

Leave a Reply