పాలనకు నిదర్శనం వలస శ్రామికుల దుస్థితి

0
253
– ఎన్‌. వేణుగోపాల్‌

ఈ వలస శ్రామికుల దుస్థితి, వారి పట్ల అధికార వ్యవస్థల బాధ్యతా రాహిత్యం, స్వగ్రామాలకు వారి తిరుగు ప్రయాణ వెల్లువ, కరోనానంతరం తిరిగి వెనక్కి వస్తారో లేదో తెలియని అనిశ్చితి మన సామాజిక, ఆర్థికరంగాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో, భవిష్యత్తులో మరెంత దిగజారనున్నాయో సూచిస్తున్నాయి.

ఒక సంక్షోభ సందర్భంలో మనం ఎంత సక్రమంగా, మానవీయంగా ఉన్నామనడానికి సూచిక ఆ సంక్షోభపు బాధితులలోకెల్లా బాధితుల పట్ల మన వైఖరి ఎలా ఉందనేదే. మనం అంటే సాధారణ ప్రజలు కూడ కావచ్చు గాని, సమాజ సంపద మీదా, వనరుల మీదా, సమాజం మీదా పాలనాధికారం నిర్వహిస్తున్న పాలకుల, ప్రభుత్వాల వైఖరి మరింత ముఖ్యమైనది. ప్రస్తుత కరోనా మహా విపత్తు సందర్భంలో, ప్రత్యేకించి లాక్‌డౌన్‌ సమయంలో, బాధితులలోకెల్లా బాధితులు వలస శ్రామికులు. వారి పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి అలసత్వం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం.

వలస శ్రామికులను బాధితులలోకెల్లా బాధితులు అనడానికి చాల కారణాలున్నాయి: వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారు. ఉన్నచోటి నుంచి కదలడానికి లేదు. స్థానిక భాష రాదు. వారిని ఏ పనికి తీసుకు వచ్చారో ఆ పని లేదు. అంటే వేతనం లేదు. తిండి లేదు. వారిని తీసుకువచ్చిన కాంట్రాక్టర్‌ జాడలేదు. దుర్భరమైన కిక్కిరిసిన పనిస్థలంలో, లేదా చౌకగా దొరికే మురికివాడల అద్దె ఇండ్లలో ఎప్పుడు కరోనా వైరస్‌ అంటుకుంటుందో తెలియదు. ఇక్కడే వ్యాధి సోకి చచ్చిపోతే అనామక శవంగా కుక్కను ఈడ్చిపారేసినట్టు మునిసిపల్‌ అంత్యక్రియలే తప్ప తమవారి మధ్య గౌరవప్రదమైన అంత్యక్రియలు దక్కుతాయనే ఆశ లేదు. బతికి ఉంటే బలుసాకు తినవచ్చునని పుట్టిన ఊరికి వెళ్లిపోదామనుకుంటే వెళ్లవచ్చుననీ, వెళ్లగూడదనీ, అనుమతి కావాలనీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రభుత్వ ఉత్తర్వులు. వెళ్లడానికి అనుమతి దొరికినా లేని ప్రయాణ సౌకర్యాలు. కాలినడకన అయినా సరే వందల కిలోమీటర్లు నడిచి వెళ్లడానికి సిద్ధపడితే మండుటెండలు. కనీసమైన నీడ లేని, నీళ్లు దొరకని, ఆహారం దొరకని రహదారులు.

ఇంత దుర్భర స్థితిలో ఉన్న వలస శ్రామికులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత. కాని లాక్‌డౌన్‌ ప్రకటన నాటి నుంచి, దాన్ని రెండు సార్లు పొడిగించిన, ఈ యాబైరోజుల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని నిర్వహించవలసిన బాధ్యతలో సగమో పావో కూడ చేయలేదనేది విషాద కఠోర వాస్తవం.

మొదట కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తే, హడావిడిగా, రాత్రి పన్నెండు గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఎనిమిది గంటలకు ప్రకటించి, నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇచ్చి లాక్‌డౌన్‌ను దేశం మీద రుద్దుతున్నప్పుడు అసలు ఈ దేశంలో వలస శ్రామికులు అనే ఒక విశాల సమూహం ఉన్నదని, వారి అవసరాలు, వారికి రాగల ఇబ్బందులు, అవి పరిష్కరించే బాధ్యత తన మీద ఉన్నదని కేంద్ర ప్రభుత్వం అనుకోనే లేదు.

లాక్‌డౌన్‌ ప్రకటించగానే ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. నిజానికి లాక్‌డౌన్‌తో పనులు ఆగిపోయినప్పుడు ఆ పనుల్లో ఉండేవారికి, ప్రధానంగా వలస శ్రామికులకు ఏం జరుగుతుంది అని ప్రభుత్వం ఆలోచించి ఉండవలసింది. ఆయా కాలాల్లో వ్యవసాయ పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వచ్చి తిరిగివెళ్లిపోయే వలస శ్రామికులుంటారు. తెలుగు రాష్ట్రాలలో పంట కోతల కోసం వచ్చి లాక్‌డౌన్‌ వల్ల చిక్కుబడిపోయినవాళ్లున్నారు. లేదా నిర్ణీత కాలపు ఉద్యోగులుగా, రోజు కూలీలుగా భవన నిర్మాణ రంగం, ఇతర నిర్మాణ రంగాలు, ఇటుక బట్టీలు, వస్త్ర పరిశ్రమ, రవాణా, గనులు, చిన్న వ్యాపారాలు, దుకాణాలు, హౌటళ్లు, మెకానిక్‌ షెడ్లు, గహసేవలు వంటి అనేక రంగాల్లో వలస శ్రామికులున్నారు. స్థానబలం లేనందువల్ల వారికి బేరసారాలాడే శక్తి ఉండదు గనుక, వారు చౌకగా దొరికే శ్రామికులు గనుక, వారు వెనుకబడిన ప్రాంతాల నుంచి వస్తారు గనుక, వారిలో అత్యధికులు ఆదివాసులో, దళితులో గనుక వారి చౌక శ్రమను వినియోగించుకోవడానికి యజమానులందరూ ఉవ్విళ్లూరుతారు. ఆ శ్రామికులను సరఫరా చేయడానికి మేస్త్రీల వ్యవస్థ తయారై ఉన్నది. అలా ఎన్నో రంగాలు వలస శ్రామికుల శ్రమ మీద ఆధారపడి ఉన్నాయి. మరో మాటల్లో చెప్పాలంటే మన ఆర్థిక వ్యవస్థ, మన రోజువారీ జీవనం ఇవాళ వలస శ్రామికుల నెత్తుటిమీద, చెమట మీద ఆధారపడి ఉన్నది.

2011 జనగణన ప్రకారం ఈ వలస శ్రామికులు పదమూడు కోట్ల తొంబై లక్షలు. ఇవాళ్టి లెక్కలను బట్టి వారి సంఖ్య పదిహేను కోట్ల ఎనబై ఐదు లక్షలు అయి ఉంటుంది. వారిలో ఎందరెందరు ఏయే రాష్ట్రాలలో చిక్కుబడి పోయారో, అక్కడ పని లేక, తిండి లేక, అప్పో సప్పో చేసే అవకాశం లేక ఎందరు అతలాకుతలమవుతున్నారో, అందులో ఎందరు వెనక్కి పోదలచుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ గణాంకాలు సేకరించే వ్యవస్థే లేదు. ఉన్నవారందరికీ ఆహారం, ఆశ్రయం, వైద్యం కల్పించడమైనా, చిక్కుబడిపోయినవారిలో పావు వంతు వెనక్కి వెళ్లిపోవాలని ఆలోచించినా కనీసం నాలుగు కోట్ల మందికి ప్రయాణ సౌకర్యాలు కల్పించడమైనా బహత్తరమైన పనులు.

ఇంత కీలకమైన సముదాయం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా లాక్‌డౌన్‌ అమలు మొదలయింది. అప్పటికే ఇవ్వవలసి ఉన్న జీతాలు ఎగ్గొట్టిన కాంట్రాక్టర్లు కనిపించకుండా పోయారు. నిర్మాణ స్థలాల్లోనో, కిక్కిరిసిన గదుల్లోనో ఉన్న వలస కార్మికులు తమ ఊళ్లకు పోవడానికి ప్రయత్నించారు. ఢిల్లీ ఆనందవిహార్‌ బస్‌ స్టాండుకు వేలాది మంది తరలివచ్చారు. బస్సులు కూడ నడవడం లేదని తెలుసుకుని ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లకు నడక మొదలుపెట్టారు. అప్పుడు గాని కేంద్ర ప్రభుత్వానికి ఈ వలస కార్మికులు అనే సమూహం ఉన్నదని తెలిసి రాలేదు. వలస శ్రామికులకు ఆహారం, ఆశ్రయం, వైద్యం అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది అని, వారు విపత్తు సహాయ నిధుల నుంచి అవసరమైన నిధులు తీసుకోవచ్చునని ఆదేశం ఇచ్చి చేతులు దులుపుకుంది.

నెల గడిచిన తర్వాత రెండో లాక్‌డౌన్‌ చివర శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల పేరుతో రైళ్లు నడపడం ప్రారంభించేదాకా కేంద్ర ప్రభుత్వం వీరి గురించి చేసినదేమీ లేదు. ఆ శ్రామిక్‌ రైళ్లలో కూడ ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం, రాష్ట్రప్రభుత్వాల వాటా గురించి పేచీ పెట్టుకోవడం వంటి అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తలపడింది. ఇంత చేస్తే మే 1న ప్రారంభమైన శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు పదకొండు రోజుల్లో 366 నడవగా తరలించిన వలస శ్రామికుల సంఖ్య మూడు లక్షల అరవై వేలని స్వయంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమవారం ప్రకటించారు.

ఈ వలస కార్మికుల దుర్భర స్థితిని, కేంద్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని వివరిస్తూ, తక్షణమే సహాయ చర్యలు చేపట్టమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ప్రభుత్వానికి అన్నీ తెలుసునని, తాము ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోబోమని మహా ఘనత వహించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరి, న్యాయవ్యవస్థ వైఖరి అంత బాధ్యతా రహితంగా, నిర్లక్ష్యంగా, అన్యాయంగా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా అదే తానులో ముక్క అని చూపుకున్నది. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి పత్రికా సమావేశంలోనే వలస కార్మికులు మా బిడ్డలు, తెలంగాణ అభివద్ధిలో భాగస్వాములు, వారిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం అని గంభీరంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత ఆరు వారాలకు కూడా వలస శ్రామికుల విషయంలో చేయవలసి పనిలో పావు వంతు కూడ చేయలేదు.

అసలు ఈ సహాయం అందవలసిన వలస శ్రామికులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే, ఎవరికి ఎక్కడ సహాయం అందించాలో నిర్ధారణ అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించిన వలస కార్మికుల గణాంకాలు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా కనీసం ఐదో ఆరో అంకెలు ఉన్నాయి. వలస శ్రామికులు 3,35,669 మంది ఉన్నారని ఒకరన్నారు, తొమ్మిది లక్షల మంది ఉన్నారని మరొకరన్నారు. మే 1న ఒక పత్రికతో మాట్లాడుతూ ఒక సీనియర్‌ కార్మికశాఖ అధికారి తెలంగాణలో ఆరు లక్షల మంది వలస శ్రామికులున్నారని అన్నారు. తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌ స్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ దగ్గర రిజిస్టర్‌ అయిన కార్మికులు 15.51 లక్షల మంది అని, అందులో 8.2 లక్షల మంది ప్రస్తుతం పనిలో ఉన్నారని అధికారిక వెబ్‌ సైట్‌ చెపుతున్నది. వీరిలో ఎంత శాతం వలస శ్రామికులో తెలియదు గాని అరవై డెబ్బై శాతం ఉండవచ్చునని ఒక అంచనా. అంటే భవన నిర్మాణ రంగంలోనే కనీసం ఆరు, ఏడు లక్షల మంది ఉంటారు. ఇతర రంగాలలో మరొక ఆరులక్షల మంది ఉండవచ్చు. మూడున్నర కోట్ల మంది సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజులో జరిపి ప్రపంచ రికార్డు స్థాపించానని చెప్పుకున్న ప్రభుత్వం ఈ పన్నెండు లక్షల మందిని ఏడు వారాలలో కూడా గుర్తించలేకపోవడం ఆశ్చర్యకరం.

ఈ లెక్కే సరిగా లేదు గనుక ఎందరో వలస కార్మికులు ప్రభుత్వ సహాయం ఏదీ అందక, వ్యక్తుల, దాతల, స్వచ్ఛంద సంస్థల ఔదార్యం మీద ఆధారపడవలసి వచ్చింది. చౌకగానైనా తమ శ్రమను అమ్ముకుంటూ ఆత్మగౌరవంతో బతికేవారిని ఇతరుల ఔదార్యం కొరకు ఎదురుచూసే దీనులుగా మార్చిన ఘనత వహించిన దేశమిది. ఆ ఔదార్యాన్ని కూడా సహించని నగర పాలక సంస్థ అలా ఎవరూ తమంత తాముగా సహాయం చేయగూడదని, సహాయం మీద గుత్తాధిపత్యం తమదేనని తాఖీదు జారీ చేసింది. కానీ అన్నార్తుల ఆక్రోశం ముందు ఆ తాఖీదు చెల్లలేదు. తిండి అయినా పెట్టండి, లేకపోతే వెళ్లనైనా వెళ్లనివ్వండి అని వలస కార్మికులు ఆందోళనలు ప్రారంభించాక, ఒకటి రెండు చోట్ల లాఠీచార్జీలు కూడా జరిపి అప్పుడే మొదలైన శ్రామిక్‌ స్పెషల్‌ రైలులో ఆందోళన చేసిన వలస కార్మికులను పంపేశారు.

ఈ లోగా శ్రామికులు ఎక్కడికక్కడ నడిచి అయినా సరే వెళ్లిపోతామని బయల్దేరారు. వాళ్లు వెళ్లిపోతే పనులు జరగవు గనుక, స్థానిక శ్రామికులు అంత చౌకగా దొరకరు గనుక కంట్రాక్టర్లకు, భవన నిర్మాణ కంపెనీలకు, పరిశ్రమాధిపతులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. శ్రామికులను అలా వెళ్లనిస్తే ఎలా అని మొర పెట్టుకున్నట్టున్నారు. దానికి స్పందనగా, వెళ్లిపోదలచుకున్న శ్రామికులకు వారి యజమానుల అనుమతి పత్రం కావాలని, ఆ అనుమతి పత్రంతో పోలీసుల దగ్గర రిజిస్టర్‌ చేసుకుంటే, రైళ్ల అందుబాటును బట్టి పంపిస్తామని మెలిక పెట్టారు. వలసశ్రామికులు వెళ్లిపోవడానికి అనేక ఇబ్బందులు కల్పించడం మొదలుపెట్టారు. వలస శ్రామికుల బాధ్యత కాంట్రాక్టర్లు, పరిశ్రమల యజమానులు వహించాలని, వారి మీద చర్యలు తీసుకుంటామని గంభీర ప్రకటనలు చేశారు గాని, వేతనాలు ఎగ్గొట్టినందుకు, బాధ్యత తీసుకోనందుకు ఒక్క కేసయినా నమోదైన దాఖలా లేదు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో చిక్కుబడిపోయిన తెలంగాణ వలస శ్రామికులు రావడం మొదలైంది. ఇతర రాష్ట్రాల వారిని పంపించడంలో ఎంత అలసత్వం, నిర్లక్ష్యం కనబడ్డాయో, అంతే అలసత్వం, నిర్లక్ష్యం తెలంగాణ బిడ్డలను ఇండ్లకు రానివ్వడంలో కూడా కనబడుతున్నాయి.

ఏది ఏమైనా సరే, కలో గంజో తాగి అయినా, ఆకలితోనైనా కన్నఊరికే వెళ్లిపోతామని ఇవాళ్టికీ లక్షలాది మంది కాలినడకన, దొరికిన వాహనాల్లో సరిహద్దులు దాటి వెళ్తున్నారు. హైదరాబాద్‌ – నాగపూర్‌ జాతీయ రహదారి 44 మీదనే రోజుకు పదిహేను వేల మంది కాలినడకనో, దొరికిన వాహనాల్లోనో వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ వలస శ్రామికుల దుస్థితి, వారి పట్ల అధికార వ్యవస్థల బాధ్యతా రాహిత్యం, స్వగ్రామాలకు వారి తిరుగు ప్రయాణ వెల్లువ, కరోనానంతరం తిరిగి వెనక్కి వస్తారో లేదో తెలియని అనిశ్చితి మన సామాజిక, ఆర్థికరంగాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో, భవిష్యత్తులో మరెంత దిగజారనున్నాయో సూచిస్తున్నాయి.

Courtesy Nava Telangana

Leave a Reply