ఎల్ఘర్ పరిషత్ కేసులో ఆదివాసీ హక్కుల కార్యకర్తను అరెస్టు చేసిన ఎన్ఐఏ

0
240

ముంబయి : ఎల్ఘర్‌ పరిషత్‌ కేసులో జాతీయ దరాప్తు సంస్థ ఎన్‌ఐఏ అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. తాజాగా జార్ఖండ్‌కు చెందిన ఆదివాసీ హక్కుల కార్యకర్త, కురువృద్ధుడు ఫాదర్‌ స్టాన్‌ స్వామిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ మేరకు జార్ఖండ్‌లో ఆయనను కస్టడీలోకి తీసుకున్నది. స్వామి అరెస్టుతో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన కురు వృద్ధుడిగా ఉన్నారు. కాగా, ఎల్ఘర్‌ పరిషత్‌ కేసులో ‘కొనసాగుతోన్న’ దర్యాప్తులో భాగంగా స్వామిని ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులు పలు సందర్భాలలో ప్రశ్నించారు. అయినప్పటికీ ఇప్పుడు ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. జూన్‌ 2018నుంచి ఈ కేసులో ఈయనతో సహా ఇప్పటి వరకు అరెస్టయినవారి సంఖ్య 16కు చేరుకున్నది. 2017, డిసెంబర్‌ 31న నిర్వహించిన సమావేశంలో విద్వేశపూరిత ప్రసంగాలతో మహారాష్ట్రలో అల్లర్లు చెలరేగాయనీ, దీనికి మావోయిస్టులతో సంబంధాలున్నయన ఆరోపణలను ఎన్‌ఐఏ అధికారులు వినిపిస్తున్న విషయం విదితమే.

రాంచీలోని స్వామి ఇంటికి ఎన్‌ఐఏ బృందం చేరుకొని ఎలాంటి అరెస్టు వారెంటు లేకుండానే ఆయనను ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లారని సీనియర్‌ న్యాయవాది మిహిర్‌ దేశారు చెప్పారు. అరెస్టువారెంటును చూపాలని అడిగితే ఎన్‌ఐఏ అధికారులు దురుసుగా, అహంకారపూరితంగా వ్యవహరించారని స్వామి సహౌద్యోగులు తెలిపారు. వాస్తవానికి కేరళకు చెందిన ఆయన.. జార్ఖండ్‌లో ఐదు దశాబ్దాలుగా ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రముఖ ఆదివాసీ హక్కుల కార్యకర్తగా పేరుగాంచిన ఆయన వయోభారం కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply