రుణం చెల్లించలేదని రైతు ఇల్లు సీజ్‌

0
188

కామేపల్లి : తీసుకున్న రుణం చెల్లించలేదని గిరిజన రైతు ఇంటిని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ (డీసీసీబీ) అధికారులు సీజ్‌ చేశారు. రుణం కోసం తనఖా పెట్టిన భూమిలో జెండాలు కూడా పాతారు.  ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం జోగ్గూడెంలో బుధవారంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  జోగ్గూడెం గ్రామానికి చెందిన భూక్యా లక్ష్మణ్‌ తనకున్న ఐదున్నర ఎకరాల భూమిపై 2017లో ఖమ్మం డీసీసీబీ ఇల్లెందు బ్రాంచ్‌లో ఎకరాకు లక్ష చొప్పున రూ.5.30 లక్షల రుణం తీసుకున్నారు. ఏటా వడ్డీతో కలిపి కొంతమొత్తం చెల్లిస్తున్నారు. అయితే గత ఏడాది నవంబరులో బ్యాంక్‌ అధికారులు లక్ష్మణ్‌ ఇంటికి వెళ్లి రూ.4.20 లక్షలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో నవంబర్‌, డిసెంబరు మాసాల్లో  రూ.2 లక్షలు చెల్లించారు. అయితే బ్యాంక్‌ అధికారులు ఈ ఏడాది మార్చి 14న మళ్లీ రైతు ఇంటికి వెళ్లి రుణం బకాయి రూ.3.60 లక్షలు ఉందని, అది చెల్లించకుంటే ఇల్లు, భూమి జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

ఈక్రమంలో బుధవారం బ్యాంక్‌ సిబ్బంది భూక్యా లక్ష్మణ్‌ ఇంటిని సీజ్‌ చేయడంతో పాటు, తనఖా పెట్టిన భూమిలో జెండాలు పాతారు. కాగా, తీసుకున్న రూ.5.30  లక్షల రుణానికి, దఫదఫాలుగా రూ.7లక్షలపైనే చెల్లించినా.. అధికవడ్డీలు వేస్తూ ఇంకా రూ.3.60 లక్షలు చెల్లించాలని వేధిస్తున్నారని భూక్యా లక్ష్మణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై డీసీసీబీ ఇల్లెందు బ్రాంచ్‌ మేనేజర్‌ నాగరాజును వివరణ కోరగా… అన్నదమ్ముల మధ్య వాటాల పంపిణీ తర్వాత భూక్యా లక్ష్మణ్‌కు మిగిలింది 1.05 కుంటల భూమి మాత్రమే అని అన్నారు. రుణం చెల్లించే పరిస్థితి లేకపోవడంతోనే లక్ష్మణ్‌ ఇంటిని జప్తు చేయాల్సి వచ్చిందని బ్రాంచ్‌ మేనేజర్‌ నాగరాజు వివరించారు.

Leave a Reply