20 శాఖలు.. 32 జీవోలు…

0
237

ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ల నియామకం నూరు శాతం ఆదివాసీలతో చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఇదే పద్దతిని మిగిలిన శాఖల్లో కూడా అమలు చేయటం ద్వారా ఆదివాసీల్లో నిరుద్యోగ సమస్యను తగ్గించి ఆయా ప్రాంతాల అభవృద్ధిలో వారిని భాగస్వాములుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవిన్యూ, పోలీస్‌, వైద్యం ఆరోగ్యం, ఆబ్కారీ అటవీ శాఖలతో కలిపి మొత్తం 20 శాఖల్లో నూరు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ప్రత్యేక జీవోలను జారీ చేసింది. పదేండ్ల కాలంలో 32 జీవోల ద్వారా ప్రత్యేక రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. నూరు శాతం రిజర్వేషన్లతో ఉద్యోగావకాశాలు కల్పించటంతో ఆదివాసీ బాలబాలికలు వృత్తి విద్యా కోర్సుల్లో వేల సంఖ్యలో చేరారు. విలేజి అసిస్టెంట్‌, పోలీస్‌, అటవీ, వైద్య శాఖ రిక్రూట్‌మెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కూడా పొందారు. సుప్రీం తీర్పు నేపధ్యంలో ఇప్పుడు ప్రత్యేక రిజర్వేషన్లు నిలిపివేస్తే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని దాదాపు 2 లక్షలమంది ఆదివాసీలు ఉద్యోగాలు కొల్పోతారని గిరిజన సంఘాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆదివాసీ విద్యార్ధులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం తీర్పు పిడుగుపాటు వంటిదని ఆదివాసీలంటున్నారు. ఆ జీవోల మనుగడ ప్రశ్నార్ధకం.. ఏజెన్సీ టీచర్ల నియామకంలో 100 శాతం రిజర్వేషన్‌ చెల్లదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో ఇదే తీర్పు మిగిలిన శాఖలకు కూడా వర్తిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై జరిగే నియామకాల్లోఈ రిజర్వేషన్‌ విధానాన్ని కొనసాగిస్తే ఎవరు కోర్టుకు వెళ్లినా వాటి మనుగడ కష్టమేనని అంటున్నారు. ప్రత్యేక రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించక పోతే ఇకపై జిల్లాలు యూనిట్‌గా తీసుకుని సాధారణ రోస్టర్‌ విధానం అమలు చేసే అవకాశం ఉన్నదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఈ అంశంపై న్యాయ సలహా కోరాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది.

ఉద్యమబాట….
ఏజెన్సీలో ఆదివాసీలకు కల్పించిన ప్రత్యేక రిజర్వేషన్లను యధాతధంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆదివాసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో యువకులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణఆదివాసీ గిరిజన సంఘం కూడా రిజర్వేషన్ల కొనసాగింపు కోసం ఉద్యమబాట పట్టాలని నిర్ణయించింది.

Courtesy Nava Telangana

Leave a Reply