భర్త కళ్లెదుటే గిరిజన మహిళపై దారుణం

0
219

కర్నూలు: భర్త కళ్లెదుటే ఓ గిరిజన వివాహితపై నలుగురు దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కిరాతక ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెలుగోడు మండలం జమ్మినగర్ తండాలో జూలై 31న ఈ దారుణం జరిగింది.

బాధితురాలు, ఆమె భర్త గాలేరు వాగు వంతెన నిర్మాణ పనుల వద్ద వాచ్‌మన్లుగా పని చేస్తున్నారు. జూలై 31న గాలేరు వంతెన వద్ద నిద్రిస్తుండగా అర్ధరాత్రి బండి ఆత్మకూరు మండలం నారపురెడ్డికుంట గూడేనికి చెందిన నలుగురు దుండగులు మద్యం తాగి అక్కడికి వచ్చారు. భర్తను చితకబాది అతడి కళ్లెదుటే భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితులు కుటుంబ సభ్యుల సాయంతో ఆగస్టు 1న వెలుగోడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు పట్టించుకోకపోవడంతో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు బాధిత మహిళకు న్యాయం చేయాలని వెలుగోడు పోలీసుస్టేషన్‌ను సోమవారం ముట్టడించారు. ప్రజా ఆందోళనలకు భయపడిన పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని గిరిజన సంఘాల నాయకులు, మానవతావాదులు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply