గ్యాంగ్‌ రేప్‌ బాధిత మహిళ శీలానికి వెల

0
204

  • గ్రామ పెద్దల నిర్వాకం
  • 1.20 లక్షలకు రాజీకి ఒత్తిడి
  • పోలీసులకు మహిళ ఫిర్యాదు
  • ఐదుగురు నిందితులకు బేడీలు
  • రాజీ కుదిర్చిన 8 మందీ అరెస్టు

పహాడీషరీ్‌ఫ/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 28 : కోళ్లను దొంగచాటుగా అమ్ముతున్నారన్న నెపంతో గిరిజన దంపతులను చితకబాది.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కిరాతకులు. నిందితులకు అండగా మరికొందరు రంగంలోకి దిగారు. ‘‘కేసులు.. కోర్టుల చుట్టూ ఏం తిరుగుతారు? రాజీ కుదురుస్తా’’మంటూ.. బాధితురాలి శీలానికి రూ. 1.2 లక్షలు వెల కట్టారు. పహాడీషరీఫ్‌ పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో నిందితులు అరెస్టయ్యారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌తో కలిసి.. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన గిరిజన దంపతులు 4 నెలల క్రితం హర్షగూడలోని ముచ్చ ప్రశాంత్‌రెడ్డి అలియాస్‌ ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో పనికి కుదిరారు. వారు సురేశ్‌ అనే వ్యక్తికి దొంగచాటుగా కోళ్లు అమ్ముతున్నారనే నెపంతో ఈ నెల 18న ప్రసాద్‌రెడ్డి వారిని బెదిరించాడు. ముచ్చ అనిల్‌రెడ్డి, ఆర్‌.భరత్‌, డి.పవన్‌కుమార్‌, సి.హన్మంతు అనే వ్యక్తులతో కలిసి.. ఆ దంపతులను కారులో మరో కోళ్లఫారానికి తీసుకెళ్లి, వేర్వేరు గదుల్లో బంధించాడు.

బాధితురాలికి మత్తుమందు ఇచ్చి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దంపతులను మూడు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. సురేశ్‌ని సైతం బంధించి, చితకబాదారు. వారి చెర విడిపించుకున్న బాధితులు పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా.. హర్షగూడ గ్రామ పెద్దలు రవీందర్‌, భవానీ వెంకట్‌రెడ్డి, రవినాయక్‌, చర్లపల్లి యాదయ్య, జర్పుల రాజు, బ్యాగరి సురేశ్‌, అనుగు లోకేశ్‌, విజయ్‌నాయక్‌, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి బాధిత దంపతులను కలిసి రాజీకి ప్రయత్నించారు. నిందితుల నుంచి రూ. 2.50 లక్షలు వసూలు చేసి.. బాధిత దంపతులకు రూ. 1.20 లక్షలు, సురేశ్‌కు రూ. 1.30లక్షల చొప్పున అందజేశారు. బాధితులు పోలీసులకు విషయం చెప్పడంతో.. శీలానికి వెలకట్టిన నిందితులపైనా కేసు నమోదు చేశారు. ఐదుగురు ప్రధాన నిందితులతోపాటు.. రాజీకి యత్నించిన వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.

Courtesy Andhrajyothi…

Leave a Reply