పరేషాన్‌ భగీరథ!

0
98
  • లక్ష్యానికి దూరంగా మిషన్‌ భగీరథ పథకం
  • పలుచోట్ల పూర్తికాని పైపులైన్లు, నల్లా కనెక్షన్లు
  • అసంపూర్తిగా ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం
  • లీకేజీలతో నీటి సరఫరాలో అంతరాయం
  • రెండు, మూడు రోజులకోసారి అందుతున్న నీళ్లు 
  • కొన్నిచోట్ల 5 – 15 రోజులకోసారి మాత్రమే
  • మండుతున్న ఎండలతో గ్రామాల్లో నీటి ఎద్దడి
  • ఏజెన్సీ గ్రామాలు, తండాల్లో పరిస్థితి మరీ తీవ్రం
  • బోరుబావుల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్న జనం

ఎండ తాకిడికి నోరు తడారిపోతోంది. తాగేందుకు కడివెడు నీరు దొరక్క రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెవాసులు శివార్లలోని బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. చెలిమెల్లో తోడుకొని తాగుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో సాధారణమైన ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరడంలేదు.

హైదరాబాద్‌ : రాష్ట్రంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం మిషన్‌ భగీరథ. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌తో మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. మిషన్‌ భగీరథ ఉన్నా.. ప్రజలకు మాత్రం నీళ్ల కోసం పరేషాన్‌ తప్పడం లేదు. ఈ పథకం ద్వారా 2018 డిసెంబరు నాటికి పల్లెల్లోని 60 లక్షల కుటుంబాలకు, పట్టణాల్లోని 2.32 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లోని 23,775 ఆవాసాల్లో 54,06,070 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా ప్రధాన పైపులైన్‌ పనులే పూర్తికాలేదు. ఇంకొన్ని చోట్ల పూర్తయినా ట్యాంకులు నిర్మించలేదు. మరికొన్ని చోట్ల ట్యాంకులు నిర్మించినా నీళ్లు రావడంలేదు. ఇంకొన్నిచోట్ల నీరు వస్తున్నా నిర్వహణ లోపంతో పైపులు లీకవుతూ నీళ్లు వృధాగా పోతున్నాయి. మరోవైపు మిషన్‌ భగీరథ పథకాన్ని పూర్తి చేయాలనుకున్న గడువు తీరిపోయి మూడున్నరేళ్లు దాటిపోయింది. నిధుల కొరత, బిల్లుల్లో జాప్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. నాణ్యతలేని పైపుల ఏర్పాటు, ప్రధాన, అంతర్గత పైపులైన్ల లీకేజీలు పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ‘మిషన్‌ భగీరథ’ పనులపై జిల్లాల వారీగా పరిశీలన జరిపింది. ఆ వివరాలు..

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం బీర్సాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాజిపేట, మర్కగూడ, సోనేరావు పేట, చెక్‌డ్యాంగూడ గ్రామాలకు భగీరథ నీళ్లు రావడం లేదు. ఇప్పటికీ సోలార్‌ పంపుల ద్వారానే ఈ నాలుగు గ్రామాల్లో మంచినీటి సరఫరా జరుగుతోంది. ఆదిలాబాద్‌ మండలం, నార్నూర్‌, గాదిగూడ, భీంపూర్‌, సిరికొండ, ఇంద్రవెల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి ప్రజలకు మిషన్‌ భగీరథ పథకం అంటే ఏమిటో కూడా తెలియదు. అధికారులు మాత్రం జిల్లాలోని 1231 గ్రామాలకుగాను 1227 గ్రామాలకు భగీరథ నీళ్లు ఇస్తున్నామని చెబుతున్నారు. విద్యుత్‌ మోటార్ల మరమ్మతులు, పైపులైన్ల లీకేజీలు వంటి సమస్యలతో చాలా గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా గాదిగూడ, నార్నూర్‌, సిరికొండ, ఇంద్రవెల్లి, భీంపూర్‌ ఏజెన్సీ మండలాల్లో తాగునీటి కోసం జనం విలవిల్లాడుతున్నారు. 

నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలోని పులగం పాండ్రి, రాగి దుబ్బ, దొంధరి, చాకిరేవు గ్రామాల్లో ఇప్పటికీ మిషన్‌ భగీరథ పనులు మొదలుకాలేదు. మామడ మండలం బూరుగుపల్లి, లోకేశ్వరం మండలం కనకాపూర్‌, అబ్దుల్లాపూర్‌, జోహర్‌పూర్‌, రాజురా గ్రామస్థులు శివార్లలోని బోరుబావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. 

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బీర్మల్‌ తండా, నేరల్‌ తండా, కాటెవాడి తండాతోపాటు దోమకొండ, భిక్కనూరు, తాడ్వాయి, సదాశివనగర్‌ మండలాల్లోని గ్రామాల్లో మిషన్‌ భగీరథ పైపులైన్లు వేసినా నీళ్లు రావడం లేదు.

కరీంనగర్‌ జిల్లాలో 494 గ్రామాలను మిషన్‌ భగీరథ పథకం కింద చేర్చి మంచినీటిని సరఫరా చేయాలని నిర్ణయించగా వీటిలో 491 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మానకొండూర్‌ మండలంలోని కొండపల్కల, రాములపల్లి, కిష్టాపూర్‌ గ్రామాలలో లీకేజీ కారణంగా నీరందడం లేదు. మార్చి 27న జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో అధికారులు 491 గ్రామాలకు నీటిని అందిస్తున్నామని చెప్పడం పట్ల జడ్పీటీసీలు, మండల పరిషత్‌ అధ్యక్షులు తీవ్రంగా మండిపడ్డారు. చాలా గ్రామాల్లో నీరు రావడం లేదని, వచ్చినచోట మురికి నీరు వస్తుందని, కొన్ని గ్రామాల్లో ట్యాంకుల్లోకి నీరు ఎక్కడం లేదని, మరికొన్ని గ్రామాల్లో పైపులైన్ల నుంచి నీరు కారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ అన్ని గ్రామాల్లో మిషన్‌ భగీరథ పరిస్థితిని సమీక్షించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని సర్వారం, ఇండ్లూరు, వెంకటాద్రిపాలెం, రాజపేట గ్రామాల్లో 15 రోజులకోసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. కనగల్‌ మండల కేంద్రంలో భగీరథ పనులు ఇంకా పూర్తికాలేదు. శాలిగౌరారం మండలంలోని గురజాల, శాలిలింగోటం, ఆకారం, ఉప్పలంచ గ్రామాలకు ఐదారు రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. నకిరేకల్‌ మునిసిపాలిటీలోనూతే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. పట్టణంలో 80 శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదు. చండూరు మండల కేంద్రంలో కాంట్రాక్టర్లు.. గుంతలు, కాల్వలు తవ్వి వదిలేశారు. కేతపల్లి మండలంలో పైప్‌లైన్‌ లీకేజీ సమస్యలున్నాయి. చందంపేట మండలంలో కృష్ణానది చెంతనే ఉన్నా.. పొగిళ్ల, కంబాలపల్లి, తెల్దేవరపల్లి గ్రామాలకు తాగడానికి మంచినీరు లేదు. నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం, వైజాగ్‌ కాలనీలో నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నీటిని అందించడానికి ప్రతిపాదించిన రెండు ట్యాంకుల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని వీధుల్లో పైప్‌లైన్‌ పనులు జరగాల్సి ఉన్నాయి. మంథని మండలంలో రెండు, మూడు రోజులకోసారి నీళ్లు సరఫరా అవుతున్నాయి. కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో పైపు లైన్‌ పనులు అసంపూర్తిగానే జరిగాయి. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, కమాన్‌పూర్‌, రామగిరి, ముత్తారం మండలాల్లోనూ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.  

మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పీర్లబండ తండా, ముస్లింకాలనీ, రాకాసులబండ తండాలకు, మహ్మదాబాద్‌ మండలంలోని చెరువు వెనుకతండా, ఆముదాలగడ్డ తండా, నవాబుపేట మండలంలోని లింగాలపల్లి, కొత్తపల్లి, మొగుళ్లపల్లి ఆవాసాలు.. దేవరకద్ర మండలంలోని రాజోలి గ్రామం, అడ్డాకుల మండలంలోని సుంకురాంపల్లిలో ఇంకా భగీరథ నీరు అందడం లేదు. అలాగే మునిసిపాలిటీల్లో, మండల కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటైన కాలనీలకు కూడా మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు. 

జూ  భూపాలపల్లి జిల్లాలో రేగొండతో సహా కొన్ని పెద్ద మండలాల్లో మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ నీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే సరఫరా చేస్తున్నారు.

హనుమకొండ జిల్లా పరిధిలో 2018 నుంచి భగీరథ నీటిని సరఫరా చేస్తున్నా ఇంకా బాలారిష్టాలు తప్పడంలేదు. సాంకేతిక కారణాల వల్ల ట్యాంకుల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో ప్రజల అవసరాలు తీరడంలేదు. 

మహబూబాబాద్‌ జిల్లాలోని 1424 ఆవాసాలకు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయడం లక్ష్యం కాగా ప్రధాన పైపు లైన్లు, అంతర్గత పైపు లైన్ల నిర్మాణం చేపట్టకపోవడంతో 350కి పైగా ఆవాసాల్లో మంచినీటి సరఫరా జరగడం లేదు. జనగామ పట్టణంతోపాటు గ్రామాల్లో అంతర్గత పైప్‌లైను వేయడం ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.

నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలం ఎస్కెపల్లి, ఐనాపూర్‌, కుసుమర్తి గ్రామాలకు మిషన్‌ భగీరథ నీళ్లు అందడం లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో మునిసిపాలిటీలు, మండల కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటైన కాలనీలకు మిషన్‌ భగీరథ నీళ్లందించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఖమ్మం జిల్లాలో 30-35 గ్రామాల్లో మిషన్‌ భగీరథ పథకం మొదలే కాలేదు. ఖమ్మం రూరల్‌ మండలంలోని పిట్టలవారిగూడెం, చింతకాని మండలంలోని బొప్పారం, నేలకొండపల్లి మండలం అన్నాసాగరం, సదాశివునిగూడెం మండలంలోని వాంకుడోతుతండా, తిరుమలాయపాలెం మండలంలోని రాఘవతండా, సూర్యకానితండా, పెనుబల్లి మండలంలో కొత్త అగ్రహారంలో తాగునీటికి ఇబ్బందులు నెలకొన్నాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొన్నిచోట్ల స్థలాల వివాదాల వల్ల ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్ల (ఓహెచ్‌ఆర్‌) నిర్మాణమే జరగలేదు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ కింద కొంత మేరకు తాగునీటి సరఫరా జరుగుతున్నా పట్టణాల్లోని చాలా ప్రాంతాలకు ఇప్పటికీ నీటి సరఫరా జరగడం లేదు.

మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం నల్లకుంట తండా, కేవ్లా తండా, బర్దీపూర్‌లో ఐదురోజులకోసారి నల్లా నీళ్లు వస్తుండటంతో పొలిమేరల్లోని బోరుబావుల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో మంచినీరు దొరక్క ఉన్న ఉప్పునీరే తాగుతున్నారు. ఇక్కడ మిషన్‌ భగీరథ ట్యాంకు ఉన్నా అలంకారప్రాయంగానే మిగిలింది. 

రోడ్డు విస్తరణలో పైప్‌లైన్‌ ధ్వంసం
22 ఊళ్లకు నీళ్లు బంద్‌
రంగారెడ్డి జిల్లాలో రెండు శాఖల మధ్య సమన్వయ లోపం 22 గ్రామాలకు తీవ్ర తాగునీటి సమస్యను తెచ్చిపెట్టింది. కొత్తూరు-షాద్‌నగర్‌ మధ్య రహదారి విస్తరణలో భాగంగా ఆర్‌అండ్‌బీ అధికారులు మిషన్‌ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు. ఈ పైప్‌లైన్ల పునరుద్ధరణకు సుమారు రూ.5 కోట్లు అవసరమవుతాయని, ఆ నిధులను తమకు కేటాయించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను మిషన్‌ భగీరథ అధికారులు కోరారు. తామెందుకు డబ్బులు చెల్లించాలని ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండు శాఖలకు చెందిన అధికారుల తీరు ఫలితంగా గత రెండు నెలలుగా కొత్తూరు, నందిగామ మండలాల్లోని 22 గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఇక జిల్లాలోని కేశంపేట మండలంలోని మంగళిబావి తండా, గాంధీ శంకర్‌పల్లి, నానుతండా, రంగంపల్లి, తుర్కలపల్లి, తెట్టెకుంట తండాలకు భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదు. వికారాబాద్‌ జిల్లా బొంరా్‌సపేటలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply