యు.పిలో బిజెపి ఫీట్లు

0
228

– కె. గడ్డెన్న

బెంగాల్‌ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగిన బిజెపికి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఒక పెద్ద సవాల్‌గా నిలిచాయి. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కి గుండెకాయ లాంటి ఈ హిందీ హార్ట్‌ల్యాండ్‌లో మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు బిజెపిలో ముఠా తగాదాలు జోరందుకున్నాయి. కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్రంలోను, రాష్ట్రంలోను బిజెపి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇంకోవైపు రైతాంగం తిరుగుబాటు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల్లో రాజుకుంటున్న అసంతృప్తి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ని కలవర పెడుతున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం పాలవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం చోటుచేసుకుంది. ‘పార్టీలో అంతా బాగా ఉంది’ అని చాటేందుకు అగ్ర నాయకత్వం నానా తంటాలు పడుతోంది. యు.పి లో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై ఇటు ఢిల్లీ లోను, అటు లక్నో లోను ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ల సమావేశాల పరంపర కొనసాగుతోంది.

మోడీ వర్సెస్‌ యోగి
ప్రధాని నరేంద్ర మోడీకి, గోరఖ్‌పూర్‌ మాజీ మఠాధిపతి, యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. యోగికి చెక్‌ పెట్టేందుకు మోడీ వేసిన ఎత్తులకు ఆయన పై యెత్తులు వేస్తున్నారు. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడేంతవరకు బిజెపిలో స్టార్‌ క్యాంపెయినర్లలో ఒకడిగా, కాబోయే బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రచార మోత మోగిన యోగి ఆదిత్యనాథ్‌ ప్రాభవం ఆ ఫలితాలు వెల్లడయ్యాక ఒక్కసారిగా పడిపోయింది. అదే విధంగా మోడీ గ్రాఫ్‌ కూడా పడిపోయింది. అయితే, యు.పి లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయాన్ని చవిచూడడంతో యోగి ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యు.పి లో బిజెపి బతికి బట్ట కట్టాలంటే ఆదిత్యనాథ్‌ను మార్చాల్సిందేనని పలువురు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆదిత్యనాథ్‌ను ఢిల్లీ పిలిపించుకుని, నరేంద్ర మోడీ, అమిత్‌షా, జె.పి నడ్డా ఆయనతో విడివిడిగా మాట్లాడారు. యోగి ఢిల్లీకి రావడానికి ముందు రోజు కాంగ్రెస్‌ నాయకుడు జితిన్‌ ప్రసాదను బిజెపి కేంద్ర నాయకత్వం పార్టీలో చేర్చుకుంది. మోడీకి నమ్మిన బంటు, గుజరాత్‌కు చెందిన మాజీ ఐఎఎస్‌ అధికారి ఎ.కె శర్మను ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పెట్టాలని పార్టీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి తెస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు దినేష్‌ శర్మ, కేశవ ప్రసాద్‌ మౌర్యలలో ఎవరినో ఒకరిని ఖాళీ చేయించి, ఆ స్థానంలో ఎ.కె శర్మను డిప్యూటీ సి.ఎం గా పెట్టాలనేది మోడీ, షా ద్వయం ఆలోచన. ఒబిసి కి చెందిన మౌర్యకు బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మరోసారి అప్పగించి, ఆయన స్థానంలో మోడీ తన అనుయాయుణ్ణి నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, ఈ మాజీ బ్యూరోక్రాట్‌ను ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవడానికి ఆదిత్యనాథ్‌ ససేమిరా అంటున్నారు. మోడీకి సన్నిహితంగా మెలిగే ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ డిప్యూటీ చీఫ్‌ దత్తాత్రేయ హోసబలె లక్నోలో బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఆ తరువాత బిజెపి జాతీయ డిప్యూటీ కార్యదర్శి బి.ఎల్‌ సంతోష్‌, యు.పి బిజెపి రాష్ట్ర ఇంఛార్జి రాధా మోహన్‌ సింగ్‌ లక్నో వెళ్లి ఇదే తంతు కొనసాగిం చారు. ఇదంతా తనను పక్కన పెట్టేందుకు మోడీ అనుసరిస్తున్న వ్యూహంలో భాగమేనని యోగి గుర్రుగా ఉన్నారు. ఎ.కె శర్మను అహ్మదాబాద్‌ నుంచి లక్నోకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ సీటు ఇవ్వమంటే, దానివల్ల తక్షణం తనకొచ్చే ముప్పేమీ లేదనుకున్న యోగి ఆనాడు సరే అన్నారు. మోడీ అండతో వారణాసి నియోజకవర్గ ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఎ.కె శర్మ రాష్ట్రంలో యోగిని ఖాతరు చేయకుండా జిల్లా ఉన్నతాధిóకారులపై పెత్తనం చలాయించారు. ఆయనను మంత్రివర్గం లోకి తీసుకుంటే రేపు తన కుర్చీకే ఎసరొస్తుందన్న భయం యోగికి పట్టుకుంది. తనకు చెక్‌ పెట్టేందుకే ఎ.కె శర్మను మోడీ తెర పైకి తెచ్చారని యోగికి అర్థమైంది. మోడీ ఉద్దేశం కూడా అదే. ప్రధాని అభ్యర్థిగా యోగిని తెర పైకి తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నించవచ్చన్న ఊహాగానాలు మోడీకి చిరాకు తెప్పించినట్లు ఉంది. యోగి 1998 నుంచి పార్ల మెంటుకు వరుసగా ఎన్నికైనా మోడీ తన కేబినెట్‌ లోకి తీసుకోకుండా ఆయనను దూరంగా ఉంచారు. 2017లో యు.పి ముఖ్యమంత్రిగా మోడీ మనోజ్‌ సిన్హాను ప్రతిపాదిస్తే, ఆర్‌ఎస్‌ఎస్‌ యోగిని ఏరికోరి తెచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టింది. యోగి గత అసెం బ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కానీ, స్టార్‌ క్యాంపెయినర్‌గా కానీ లేరు. ఇక అప్పటి నుంచి వీరిరువురి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. బిజెపి లో ఈ ఆధిపత్య పోరు మున్ముందు ఎటువంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

కోవిడ్‌పై పోరులో ఘోర వైఫల్యం
కోవిడ్‌ రెండో దశలో శివ గంగ శవ గంగలా మారడం, ప్రయాగరాజ్‌ లో గంగ, సరస్వతి, యమున నదీ తీరాలు శ్శశానాలుగా మారడం, శవాలను దహనం చేసేందుకు చోటు దొరక్క నదిలో విసిరేసిన హృదయ విదారక దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలచివేశాయి. ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరత, ఆక్సిజన్‌ సమస్య, మందుల కొరతతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కోవిడ్‌పై పోరుకు బదులు, పంచాయతీ ఎన్నికల రణానికి ప్రభుత్వం తెర తీసింది. 30 వేల మంది ఎన్నికల సిబ్బంది పాల్గొన్న ఈ ఎన్నికలు కరోనా వైరస్‌ వ్యాప్తికి ఒక సూపర్‌ స్ప్రెడ్‌ ఈవెంట్‌గా మారాయి. ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడి మరణించారు. యోగి ప్రభుత్వ అసమర్థ నిర్వాకంపై సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే బహిరంగంగా విమర్శించే స్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి గల ముఖ్య కారణాల్లో ఇది కూడా ఒకటి. బిజెపి కి గట్టి పట్టు ఉన్న అయోధ్య, వారణాసి, లక్నో వంటి చోట్ల కూడా అది ఓడిపోయింది. ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ ఘన విజయం సాధించింది.

రైతు ఉద్యమం ప్రభావం
మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఏడు మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమం యు.పి లో ఎటువంటి ప్రభావం చూపుతుందోనని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఆందోళన చెందుతున్నాయి. రాకేష్‌ తికాయత్‌ను యోగి ప్రభుత్వం అరెస్టు చేసి, ఆ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది. అంతవరకు పశ్చిమ యు.పి లో ముజఫర్‌ నగర్‌, ఆ చట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైన తికాయత్‌ ఒక్కసారి జాతీయ నాయకుడైపోయారు. తికాయత్‌కు మద్దతుగా జాట్‌లంతా ఏకమయ్యారు. 2013 ముజఫర్‌ నగర్‌ మత ఘర్షణల వల్ల జాట్‌లకు ముస్లింలకు మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడీ రైతాంగ ఉద్యమంతో సమసిపోయాయి. ముస్లింలకు వ్యతిరేకంగా జాట్‌ల ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన బిజెపి కి ఈసారి అలాంటి అవకాశం లేదు. పశ్చిమ యు.పి నుంచి తూర్పు యు.పి కి రైతాంగ ఉద్యమం విస్తరిస్తున్నది. వివిధ సంస్థలు పరస్పర సహకారం, సమన్వయంతో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లోను, 2017 అసెంబ్లీ ఎన్నికల్లోను వరుస విజయాలను సాధించి న బిజెపి ఈ సారి యు.పి లో తన పట్టు నిలుపు కోవడం కష్టమేనని పలువురు పరిశీలకులు పేర్కొంటు న్నారు.

అన్ని వర్గాల్లోను రగులుతున్న అసంతృప్తి
బిజెపి ప్రభుత్వం పట్ల రైతులే కాదు ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వోద్యోగులు కూడా అసంతృప్తితో రగులుతున్నారు. మరోవైపు నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చుతుండడంతో యువత తీవ్ర ఆగ్రహంతో రగులుతోంది. ఇది ఇప్పటికే వివిధ నిరసనల రూపంలో వ్యక్తమవుతున్నది. రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో అక్రమాలు, రిజర్వేషన్‌ స్కామ్‌కు వ్యతిరేకంగా యువత పెద్ద యెత్తున అలహాబాద్‌ వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపింది. సోషల్‌ మీడియాలో వీరికి పలు సంఘాల నుంచి మద్దతు అభించింది. యోగి ఆదిత్యనాథ్‌ జన్మ దినాన్ని ‘బెరోజ్‌గార్‌ దివస్‌’ (నిరుద్యోగ దినం) గా పాటించాలన్న పిలుపు సోషల్‌ మీడియాలో అత్యధికంగా ట్రెండ్‌ అయిన అంశాల్లో ఒకటి. పంచాయతీ విధుల్లో ఎక్కువమంది ఉపాధ్యాయులు కరోనాతో చనిపోవడం, హానికర నూతన పింఛన్‌ విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు గొంతెత్తాయి. ఇటీవల తీసుకొచ్చిన యు.పి ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ ట్రిబ్యునల్‌ బిల్లు దీనికి మరింత ఆజ్యం పోసింది. ఈ బిల్లును వెనక్కు తీసుకోకపోతే రైతుల మాదిరిగానే తాము కూడా సుదీర్ఘ ఆందోళనకు దిగాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. మరోవైపు ఆశాలు, ఎఎన్‌ఎం లు, అంగన్‌వాడీ ఇన్‌స్ట్రక్టర్లు, మదరసా టీచర్లు వీరంతా తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్నారు. వీరి డిమాండ్లను అంగీకరించేందుకు యోగి ప్రభుత్వం మొండిగా తిరస్కరిస్తున్నది. చివరికి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆందోళనకు దిగారు. 200 మంది బిజెపి ఎమ్మెల్యేలు తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2019 నవంబరులో అసెంబ్లీలో ధర్నాకు దిగారు. ఇవన్నీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

యోగిని మార్చే సాహసం బిజెపి చేస్తుందా?
ఎన్నికల ముందు గుర్రాన్ని మార్చి రిస్క్‌ తీసుకోవాలన్న ఉద్దేశం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కి ఉన్నట్టు కనిపించడం లేదు. నాయకత్వ మార్పు చేస్తే యోగి ఎక్కడ ఎదురు తిరుగుతాడోనన్న భయమే ఆ పార్టీ చేతులు కట్టిపడేసేలా చేసింది. అయితే యోగి పట్ల అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను బుజ్జగించేందుకు కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రి పదవులు ఇవ్వజూపుతున్నది. ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి బిజెపి లోకి ఫిరాయించిన ‘బ్రాహ్మణ నాయకుడు’ జితిన్‌ ప్రసాదకు మంత్రి పదవి ఇస్తే యు.పి లో గణనీయంగా ఉన్న బ్రాహ్మణ ఓట్లు తన ఖాతాలో వచ్చిపడతాయని బిజెపి కలలుగంటున్నది. జితిన్‌ ప్రసాద పార్టీని వీడి వెళ్లిపోయినందుకు కాంగ్రెస్‌లో ఎలాంటి చీకు చింత లేదు. ఎందుకంటే ఆయన రెండు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కసారి కూడా గెలవలేదు. పైగా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. కాబట్టి ఆయన చేరికతో బిజెపి కి అదనంగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.
హిందూత్వ తోనే యు.పి ని తిరిగి వశపరచుకోవడం సాధ్యం కాదనే విషయం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కి అర్థమైనంతగా యోగి ఆదిత్యనాథ్‌కు అర్థమైనట్టు లేదు. ఆయన హిందూత్వ ఎజెండాతోనే విజయం సాధించవచ్చన్న ధీమాతో ఉన్నారు. ఆయన తీసుకున్న ఈ వైఖరే 2019 ఎన్నికల తరువాత రాజభర్స్‌, నిషాద్‌, కుర్మీలు వంటి కులాలను బిజెపి కి దూరం చేసింది. వారు పెట్టే డిమాండ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదన్న ధోరణితో ఆదిత్యనాథ్‌ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు సమాజ్‌వాది పార్టీకి చేరువవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్‌ను మార్చక పోయినా, ఆయనకు ఎన్నికల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా పగ్గాలు వేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. బిజెపి ఎన్ని ఫీట్లు చేసినా యు.పి లో ఈసారి ఓటమి నుంచి తప్పించుకోవడం అంత తేలికేమీ కాదు.

Courtesy Prajashakti

Leave a Reply