– జాత్యాహంకార(White House) శ్వేతజాతి సౌధాలను భస్మపటలం చేస్తాం! ఖబర్దార్
– మావద్ద ప్రమాదకరమైన కుక్కలు.. అత్యాధునిక ఆయుధాలు
– నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడి బెదిరింపులు
– జార్జిఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలో ఆరని చిచ్చు
– 16 రాష్ట్రాల్లోని 25 మహానగరాల్లో కర్ఫ్యూ
వాషింగ్టన్: నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్ హత్య నేపథ్యంలో అమెరికా అగ్గిలామండుతుంటే.. ఆ దేశ అధ్యక్షుడు ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు మానటంలేదు. ఇదివరకే మిలటరీని దింపుతామని హెచ్చరించిన ట్రంప్.. తాజాగా మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. మా వద్ద ప్రమాదకర కుక్కలు.. అత్యాధునిక ఆయుధాలతో మీ అంతు చూస్తా… అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనికి నిరసనగా అమెరికాలోని 30 మహానగరాల్లో నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్ హత్యకు నిరసనలు భగ్గుమంటున్నాయి. ట్రంప్ చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలతో అక్కడి భద్రత వ్యవస్థకు తలనొప్పిగా మారింది. నిరసనలను కట్టడి చేయటానికి లాస్‌ఎంజిల్స్, ఫ్లోరిడా, అట్లాంటా సహా 16 రాష్ట్రాల్లోని 25 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఇప్పటివరకు సుమారు రెండు వేల మంది ప్రదర్శనకారుల్ని అరెస్టు చేశారు. గత రెండురోజుల నుంచి మినోసోటాలో అదుపులోకి తీసుకున్న నిరసనకారుల్లో 80 శాతానికి పైగా మినోపోలీస్ ప్రాంతానికి చెందినవారే ఉండటం గమనార్హం.
ట్రంప్ అన్నదేంటీ..?
వైట్‌హౌస్ బయట భారీనిరసన ప్రదర్శనలు కొనసాగాయి. వారిపై భద్రతాబలగాలు వీరంగం సృష్టించారు. వెరీ కూల్.. నేను నిరసనల ఘటనాక్రమాన్ని చూస్తున్నా. నేను చాలా సురక్షితంగా ఉన్నా.. భద్రతాబలగాలు అడ్డుకున్న తీరును ప్రశంసించారు. ఫెన్సింగ్ దాటిలోనికి ఎవరూ రాలేదు. అలా కనుకదాటివస్తే నావద్ద ప్రమాదకరమైన కుక్కలు.. అత్యాధునికమైన మారణాయుధాలు ఉన్నాయి. వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌజర్ ,యూఎస్ సీక్రెట్ సర్వీస్‌కు సహాయం చేయడానికి పోలీసులను ఇవ్వలేదని ట్రంప్ ఆరోపించారు.
నిప్పులా మండుతున్న రాష్ట్రాలివే..
కాలిఫోర్నియా,కోలోరాడో,ఫ్లోరిడా,జార్జియా,ఇలినారు,కెంటకీ,మినోసోటా,న్యూయార్క్, ఓహియో,ఓరెగాన్,పెన్సూల్వియా,సౌత్ కైరోలినా,టెనెసీ,ఉడాV్‌ా, వాషింగ్టన్,విస్కాన్సింగ్.
జంతువును వేటాడి చంపినట్టు ఫోజిచ్చారు..
పోలీసుల వైఖరిపై జార్జి బంధువు స్పందన
అమెరికాలో పోలీసుల చేతిలో బలైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యపై ఆయన సమీప బంధువు సెల్విన్ జోన్స్ స్పందించారు. ఆర్టీ మీడియా సంస్థతో ఆయన ఆదివారం గెట్టీస్‌బర్గ్ నుంచి ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుతూ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి దెరేక్ చావిన్ తన మేనల్లుడైన జార్జి హత్య సందర్భంగా తానేదో ఒక పెద్ద జంతువును వేటాడి చంపినట్టు ఫోజ్ ఇచ్చారని అన్నారు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ ఘటన భవిష్యత్తులో అమెరికాలో మార్పులకు నాంది పలకాని ఆకాంక్షించారు. ఇదే సమయంలో జార్జి హత్యకు వ్యతిరేకంగా పలు నగరాల్లో ఆందోళనలు చేస్తున్న ప్రజలు హింసకు దూరంగా ఉండాలని కోరారు. ఫ్లాయిడ్ మెడపై పలు నిమిషాల పాటు కాలుపెట్టి హత్య చేసిన దెరేక్‌లో తాను పాల్పడిన దురాగతంపై ఏమాత్రం పశ్చాత్తాపం కనపడుతున్నట్టు కనిపించడం లేదని పేర్కొన్నారు. అమెరికాలో నల్లజాతీయులను పోలీసులు ఏవిధంగా టార్గెట్ చేశారన్న విషయం జార్జి హత్యతో మరోసారి వెల్లడైందనీ, కేవలం చర్మం రంగు అధారంగా ఈవిధమైన హింసాకాండ సాగుతుందని జోన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ పోలీసులు ఏం చెప్పారో జార్జి చేశారు. కానీ ఫలితం ఏంటో మీకు తెలుసు. అతను చనిపోయాడు.. కాదు చంపబడ్డాడు’ అని పేర్కొన్నారు. జార్జి హత్యకు వ్యతిరేకంగా గెట్టీస్‌బర్గ్ పట్టణంలో శనివారం జరిగిన ర్యాలీలో జోన్స్ పాల్గొన్నారు. ఈ ర్యాలీ పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ ఐక్యతను చాటిందని ఆయన పేర్కొన్నారు.
Courtesy Nava Telangana