తుమ్మలపల్లె భూగర్భజలాల్లో యురేనియం

0
217

* రెండు రోజుల్లో సిఎంకు నివేదిక
కడప జిల్లా తుమ్మలపల్లెలో భూగర్భ జలాలు కలుషితమయ్యేందుకు యురేనియంతోపాటు అధిక మోతాదులో సోడియం, ఫ్లోరిన్‌, మెగ్నీషియం, కాల్షియం మూలకాల బైకార్బొరేట్లు కూడా కారణమని నిపుణుల కమిటీ పిసిబికి అందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అందజేయనుంది. ఈ సందర్భంగా పిసిబి ఛైర్మన్‌ బిఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఆయన కార్యాలయంలో గురువారం నాడు విలేకర్లతో మాట్లాడారు. యుసిఐఎల్‌ టెయిల్‌ పాండ్‌ వ్యర్థాలు భూమిలోకి ఇంకడం వల్లే భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని కమిటీ కచ్చితంగా నిర్దారించలేదని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు కాకుండా అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ అథారిటీ (ఎఇఆర్‌ఎ), బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) నిబంధనలు పాటిస్తున్నట్లు యుసిఐఎల్‌ పేర్కొందని తెలిపారు. ఆ ప్రాంతంలో పరిమితికి మించి లోతుగా బోర్లు వేయడం వల్ల సహజంగా అందుబాటులో ఉన్న యురేనియం, ఇతర మూలకాలు కూడా భూగర్భ జలాల్లో కలిసినట్లు కమిటీ నివేదికలో పేర్కొంద న్నారు. గతంలో ఆ ప్రాంతంలో వేరుశనగ పంటను ఎక్కువగా వేసేవారని, అయితే అధిక లాభం వస్తుందనే కారణంతో దాదాపు 360 ఎకరాల్లో అరటి తోటలు వేశారని పేర్కొన్నారు. అరటికి ఎక్కువ నీరు అవసరం కనుక దాదాపు వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేశారని తెలిపారు. 300 మీటర్ల కంటే లోతు వెళ్లే కొద్దీ యురేనియం మూలకం శాతం కూడా పెరుగుతూ భూగర్భ జలాలు కలుషితమయ్యాయని పేర్కొన్నారు. ఇక ఆల్కలీన్‌ లీచింగ్‌ పద్ధతిలో యురేనియంను శుద్ధి చేసిన తర్వాత అధిక మొత్తంలో వెలువడే సోడియం వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా ఉండేందుకు బెంటొనైట్‌ లేయర్‌ను వారు వినియోగించడం ఎఇఆర్‌ఎ నిబంధనలు పాటించారని, పిసిబి నిబంధనలను పాటించలేదని తెలిపారు. ఆ స్థానంలో హై డెన్సిటీ పాలివినైల్‌ ఇమల్షన్‌ (హెచ్‌డిపిఇ)ను మట్టితో కలిపి పొరలుగా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. కొత్తగా మరో 150 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న పాండ్‌కు అయినా హెచ్‌డిపిఇ లేయర్‌ను వేయాలని యుసిఐఎల్‌కు సూచించామన్నారు.

కమిటీ సూచించిన ప్రధాన అంశాలు
* వ్యర్థాలు విడుదల చేసే పాండ్‌లో హెచ్‌డిపిఇ లేయర్‌ను వేయాలి. ఆ చుట్టుపక్కల పచ్చదనాన్ని పెంపొందించాలి.
* కాలుష్య ప్రభావిత ప్రాంతంలో కొత్తగా వేసే బోర్లకు అనుమతివ్వరాదు. వాటిపై నియంత్రణ ఉండాలి.
* నెలకోసారి అయినా అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలి.
* యుసిఐఎల్‌ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి.* ప్రభుత్వం తరఫున రక్షిత తాగునీటిని మంజూరు చేయాలి.
* ఆ ప్రాంతంలో అరటి పంట కాకుండా నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను వేయాలి.
ఈ సూచనలన్నీ పాటించేందుకు వారు అంగీకరించారని, అయితే టెయిల్‌ పాండ్‌ వద్ద వ్యర్థాలు వేసే లేయర్‌ మాత్రం బోర్డును సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఈ సూచనలన్నింటినీ రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని, గాలి కాలుష్యం ప్రభావం అంతగా లేదని అన్నారు.

Courtesy Prajashakthi… 

Leave a Reply